రివైండ్ 2023.. సత్తా చాటిన డెబ్యూ డైరెక్టర్స్

కొత్తదనానికి చిరునామాగా నిలుస్తుంటారు నవతరం దర్శకులు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచడంలో వారెప్పుడూ ముందుంటారు. ఇక.. ఈ ఏడాది పలువురు కొత్త దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమలో డెబ్యూ మూవీస్ తోనే హిట్స్ కొట్టారు. మరికొంతమంది తాము చేసిన ప్రయత్నాలకు ప్రశంసలు పొందారు.

ముందుగా చెప్పుకోవాల్సింది వేణు. హాస్యనటుడిగా అందరికీ సుపిరిచితమైన వేణు దర్శకుడిగా మారి తీసిన ‘బలగం‘ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆద్యంతం తెలంగాణ నేపథ్యంలో చిన్న తారలతో తీసిన ఈ సినిమా అతి పెద్ద విజయాన్ని సాధించింది. సహజత్వానికి పెద్ద పీట వేస్తూ రూపొందిన ‘బలగం‘ వసూళ్లు మాత్రమే కాదు.. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు కూడా దక్కించుకుంది.

‘దసరా‘ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల కూడా డెబ్యూ మూవీతోనే టాలీవుడ్ లో సంచలనంగా మారాడు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ శిష్యగణంలో ఒకడైన శ్రీకాంత్.. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘దసరా‘. తెలంగాణలోని ఓ పల్లె నేపథ్యాన్ని తీసుకుని.. ఆద్యంతం రస్టిక్ గా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి బెస్ట్ అవుట్ పుట్ ను తీసుకోవడంలో ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. ‘దసరా‘తో పక్కా కమర్షియల్ డైరెక్టర్స్ లో లిస్టులోకి చేరిపోయాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.

నాని నటించిన మరో చిత్రం ‘హాయ్ నాన్న‘తో శౌర్యువ్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానానికి శౌర్యువ్ ని సినీ విమర్శకులు ఎంతగానో ప్రశంసించారు. ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి మంచి వసూళ్లు రాబట్టిన చిత్రం ‘మ్యాడ్‘. సితార బ్యానర్ నుంచి వచ్చిన ఈ మూవీతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ‘మ్యాడ్‘ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దాడు డెబ్యూ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్.

నాగశౌర్య ‘రంగబలి‘ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ బాసంశెట్టి, ‘మేమ్ ఫేమస్‘ మూవీతో హీరోగానే కాకుండా డైరెక్టర్ గానూ సత్తా చాటిన సుమంత్ ప్రభాస్, ‘రైటర్ పద్మభూషణ్‘ డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ వంటి డెబ్యూ డైరెక్టర్స్ కి పెద్ద విజయాలు దక్కకపోయినా.. తొలి సినిమాలతోనే మంచి మార్కులు సంపాదించుకున్నారు.

Related Posts