యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన రెండు చిత్రాలు ‘విరూపాక్ష, బ్రో’ మంచి విజయాలు సాధించాయి. వీటిలో ‘విరూపాక్ష’ అయితే బంపర్ హిట్ కొట్టింది. మేనమామ పవన్ కళ్యాణ్ తో చేసిన ‘బ్రో’ కూడా తేజ్ కి మెమరబుల్ మూవీగా నిలిచింది. ఈ సినిమాల తర్వాత సంపత్ నంది డైరెక్షన్ లో ‘గాంజా శంకర్’ అనౌన్స్ చేశాడు సాయిధరమ్. ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు ఓ స్పెషల్ టీజర్ కూడా రిలీజయ్యింది.
అయితే.. భారీగా పెరిగిపోయిన బడ్జెట్ లెక్కల దృష్ట్యా ‘గాంజా శంకర్’ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. దానికి తోడు లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ మార్చాలంటూ నార్కోటిక్ బ్యూరో నుంచి నోటీసులు అందాయనే వార్తలు వచ్చాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘గాంజా శంకర్‘ గురించి కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సినిమాని కాసేపు పక్కనపెడితే.. సాయిధరమ్ తేజ్ తన హిట్ మూవీ ‘చిత్రలహరి’కి సీక్వెల్ చేసే సన్నాహాల్లో ఉన్నాడట.
2019లో వచ్చిన ‘చిత్రలహరి’ గుడ్ మూవీగా నిలిచింది. అప్పటికే వరుస ఫ్లాపుల్లో ఉన్న సుప్రీంహీరోకి ఈ మూవీ మంచి కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. రైటర్ కమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ కథను చెప్పిన విధానం.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు.. దేవిశ్రీప్రసాద్ సంగీతం ‘చిత్రలహరి’కి బాగా ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం ‘చిత్రలహరి 2′కోసం కథ సిద్ధం చేస్తున్నాడట డైరెక్టర్ కిషోర్ తిరుమల. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే ఈ సీక్వెల్ రూపొందనుందట. త్వరలోనే ‘చిత్రలహరి 2′పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.