రామన్న యూత్


తారాగణం : అభయ్ నవీన్, అనిల్ గీల, తాగుబోతు రమేష్, విష్ణు ఓయ్, శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ రోహిణి, మనోజ్ ముత్యం
ఎడిటర్ : రూపక్ రోనాల్డ్ సన్, నవీన్
సంగీతం : కమ్రన్
సినిమాటోగ్రఫీ : ఫహాద్ అబ్దుల్ మజీబ్
నిర్మాత : రజిని
దర్శకత్వం : నవీన్

పెళ్లి చూపులు సినిమాతో నటుడుగా ఆకట్టుకున్నాడు అభయ్ నవీన్. ఆ తర్వాత అనేక సినిమాల్లో కనిపించాడు. అతను సడెన్ గా దర్శకుడుగా మారి తాజాగా రామన్న యూత్ అనే సినిమాతో వచ్చాడు. ట్రైలర్ ఆకట్టుకుంది. పాటలూ బావున్నాయి. నవీన్ కాకుండా ఒకరిద్దరు తప్ప అంతా కొత్తవాళ్లే నటించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కథ :
అంక్షాపూర్ అనే గ్రామంలో రాజు(నవీన్) ఇంకా అతని ఫ్రెండ్స్ తో కలసి ఊరికే తిరుగుతుంటాడు. రాజు తండ్రి దుబాయ్ లో ఉంటడు. ఓ రోజు ఎమ్మెల్యే వారి ఊరికి వచ్చి రాజును పేరు పెట్టి పలకరించివాళ్ల నాన్న గురించి కూడా అడుగుతాడు. అంతే.. అప్పటి వరకూ ఊరిలో బలాదూర్ గా ఉన్న రాజుకు రాత్రికి రాత్రే లీడర్ కావాలని కోరిక పట్టుకుంటది. అందుకోసం అప్పటికే ఊరిలో పార్టీ లీడర్ గా ఉన్న అనిల్(తాగుబోతు రమేష్) ద్వారా పనవుతుందనుకుంటారు. ఈ లోగా దసరా పండగ వస్తది. పండగనాడు ఊళ్లె ఎమ్మెల్యే తన దోస్త్ లతో పాటు అనిల్ ఫోటో కూడా భారీ ఫ్లెక్సీ పెడతాడు రాజు. అది చూసిన అనిల్ తమ్ముడు మహిపాల్(విష్ణు) తన ఫోటో లేదని అమాయకులైన వీరితో ఆడుకుంటడు. అయినా అతనికి మందు పోయించి ఎమ్మెల్యేను కలిపించమని అడుగుతాడు. మత్తులో మహిపాల్ నోరు జారి వీరినే తిడతడు. అంతే.. కోపం వచ్చిన రాజు.. అనిల్, మహిపాల్ సపోర్ట్ లేకుండనే ఎమ్మెల్యేను కలిసి యూత్ లీడర్ అయిత పందెం కాస్తడు. మరి ఆ పందెంల రాజు గెలిచిండా లేదా అనేదే కథ.

ఎలా ఉంది.

రామన్న యూత్ పాయింట్ చిన్నదే. కానీ ఆ పాయింట్ తో దర్శకుడు నవీన్ పెద్ద ఇంపాక్ట్ చూపించాలనుకున్నాడు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ.. వారి చెప్పే అబద్ధపు మాటలు వింటూ పగటి కలలు కంటూ కెరీర్ ను ఆగం చేసుకుంటున్నరు. అలాంటి వారి కళ్లు తెరిపించే కథే ఈ రామన్న యూత్. ఇందుకోసం ఎంచుకున్న గ్రామం, పండగలు, సంస్కృతితో పాటు వివిధ వర్గాలకు చెందిన స్నేహితులు, ఓ చిన్న ప్రేమకథను యాడ్ చేస్తూ ఫస్ట్ హాఫ్ నడిపించాడు. అయితే మొదటి సగంలో రాజు లీడర్ కావాలన్న తపన, ఎమ్మెల్యేను కాలవాలన్న కోరిక తప్ప ఎగ్జైటింగ్ పాయింట్స్ ఎక్కువగా లేవు. అయినా బోర్ కొట్టకుండా చూసుకున్నాడు. ఇక అసలు కథ ” కార్” తో మొదలవుతుంది. ఊళ్లోని ఒక మిత్రుడి కార్ తీసుకుని సిద్ధిపేటలో ఉండే ఎమ్మెల్యేను కలిసేందుకు వెళతారు. అప్పటికే ఎమ్మెల్యే హైదరాబాద్ వెళ్లాడని తెలుస్తుంది. ఈ లోగా వీరిని అనుక్షణం అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ రెచ్చగొడుతుంటాడు మహిపాల్.అతని వల్ల పంతంతో హైదరాబాద్ వెళ్లిన వీరికి అక్కడ అసలు పిక్చర్ కనిపిస్తుంది. పోలీస్ లు పట్టుకోవడం.. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అవమానాల పాలు కావడం.. ఏ ఎమ్మెల్యేనైతే తాము గొప్పగా భావించుకున్నారో అతనే వీరిని అరెస్ట్ చేయించడం ఇవన్నీ చకచకా సాగుతూ.. అలాంటి నాయకులను నమ్ముకుని దేవుడులా కొలిచే కొందరు యువతకు కనువిప్పు కలిగిస్తుంటాయి.

నటన పరంగా అందరూ సహజంగా చేశారు. ఎవరి పాత్రల్లో వాళ్లు ఒదిగిపోయారు. ముఖ్యంగా ఆటో కొనుక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తి నటన, పాత్ర రెండూ చాలాబావున్నాయి. అనిల్ ఫ్రెండ్స్ పరుగులు పెట్టించి ఆఖర్లో తప్పుకునే పాత్రలో మెప్పించాడు. ఇలా వ్యక్తులు కాదు కానీ.. గ్రామాల్లో పుట్టి పెరిగిన వారికి ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్రా పరిచయమే అన్నట్టుగా ఉంటుంది. అంత సహజంగా క్యారెక్టరైజేషన్స్ ను రాసుకున్నాడు దర్శకుడు. దర్శకుడి ఆలోచనను అర్థం చేసుకుని ఆ పాత్రలు చేసిన వారంతా సహజంగా ఒదిగిపోయారు.


టెక్నికల్ గా పాటలు, నేపథ్య సంగీతం బావుంది. సినిమాటోగ్రఫీ బావుంది. మాటలు మెప్పిస్తాయి. ఎడిటింగ్ పరంగా ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు నవీన్ .. నేటి యువతరం ఖచ్చితంగా చూడాల్సిన సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. చిన్న పాయింట్ తో ఓ మంచి ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ ప్రయత్నం అభినందనీయం. “నాయకుడి ఎన్నుకోవడమే కాదు.. మనం అనుసరించే నాయకుడు ఎలాంటి వాడో కూడా తెలుసుకోవాలన్నదే ఈ సినిమా ప్రధాన పాయింట్..”. ఈ పాయింట్ ను సెకండ్ హాఫ్ లో బలంగా చెప్పాడు దర్శకుడు నవీన్. ఫస్ట్ మూవీ అయినా దర్శకుడుగా నవీన్ టేకింగ్, మేకింగ్, షాట్ డివిజన్ ఆకట్టుకుంటాయి. ఊళ్లల్లో కొన్ని షాట్స్ ను బలే క్యాప్చర్ చేశాడే అనిపిస్తుంది. అత్యంత పరిమితమైన వనరులు, బడ్జెట్ తో రూపొందించినా.. ఆ లోటు ఎక్కడా కనిపించకుండా బాగా హ్యాండిల్ చేశాడు.

ఫైనల్ గా : రామన్న యూత్ జిందాబాద్
రేటింగ్ : 2.5/5

  - బాబురావు. కామళ్ల

Related Posts