బేబీ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా గంగం గణేశా. ఉదయ్ బొమ్మిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఆనంద్ సరసన ప్రగతి శ్రీ వాత్సవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు.

తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేసింది టీమ్. టీజర్ చూస్తే ఆనంద్ దేవరకొండ ఇప్పటి వరకూ చేసిన చిత్రాలకు భిన్నమైన కథ ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఫస్ట్ టైమ్ కాస్త మాస్ తో పాటు యాక్షన్ కూడా చేశాడు. ఇందుకోసం బాడీ కూడా బాగా బిల్డ్ చేశాడు.

మామూలుగా టీజర్, ట్రైలర్, సినిమా ఆరంభానికి ముందు చాలా పెద్దవాళ్లు చెప్పిన కొన్ని కోట్స్ ను యాడ్ చేస్తుంటారు మేకర్స్. బట్ వీళ్లు “ఈ చెడు ప్రపంచంలో మంచిగా బ్రతకాలనుకోవడం ఒక చెడ్డ ఆలోచన” – ఓ ఆటో డ్రైవరన్న అన్న కొటేషన్ తో టీజర్ స్టార్ట్ చేశారు.
తర్వాత ‘రేయ్ అమ్మాయిలను టీజ్ చేస్తే పెదాల్లో నుంచి నవ్వు రావాలి కానీ కళ్లలో నుంచి నీళ్లు రాకూడదురా’ అనే ఆనంద్ డైలాగ్ చెప్పగానే విలన్స్ అంతా.. ‘రేయ్ బాల్ రెడ్డీ.. అర్జున్ రెడ్డొచ్చినాడ్రా’ అని టీజ్ చేసి ఒక్కటిస్తారు. అలా అక్కడి నుంచి ఆనంద్ కు అన్నీ చెంపదెబ్బలే. విలన్స్ నుంచి హీరోయిన్ల వరకూ మనోడి చెంపలు వాయించి వదిలేస్తే ఓ చిన్న పిల్లను పట్టుకుని ఏడుస్తాడు. అటుపై కాసేపు ఫన్ రైడ్.. తను ఎఫ్.బి.ఐ అని చెప్పడం.. పోలీస్ అడిగితే మీడియా అనడం.. ప్రెస్ నుంచి మళ్లీ మీడియా అనడం ఫన్నీగా ఉంది. కట్ చేస్తే కంప్లీట్ యాక్షన్ మోడ్. హై డోస్ విలనిజం.. ఆనంద్ ఓ డీల్ ఒప్పుకోవడం.. దాని వెనక విలన్ పడటం.. అతను పరుగులు పెట్టడం.. చూస్తోంటే ఇదో క్రైమ్ యాక్షన్ కామెడీ డ్రామాలా ఉంది.

మొత్తంగా ఆనంద్ కొత్త జానర్ ప్రయత్నించాడనేది అర్థం అవుతుంది. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. బేబీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తోంది కాబట్టి ఓపెనింగ్స్ బానే ఉంటాయి. అందుకు తగ్గ కంటెంట్ కూడా పడితే బాబుకు మరో హిట్ పడుతుందని చెప్పాలి.