పూజ కెరీర్ మళ్లీ పుంజుకుంటోందా?

కన్నడ కస్తూరి పూజా హెగ్డే. కన్నడ సంతతికి చెందిన ఈ తులు బ్యూటీ.. పుట్టి, పెరిగిందంతా ముంబైలోనే. కాలేజ్ చదువుతున్న సమయంలోనే ఫ్యాషన్ షో స్ లో పాల్గొన్న పూజా.. 2009 మిస్ ఇండియా కాంపిటేషన్ లోనూ పార్టిసిపేట్ చేసింది. సినిమాల విషయానికొస్తే.. తొలుత తెలుగులో ‘ముకుంద, ఒక లైలా కోసం’ అంటూ చిన్న చిత్రాలతో అలరించే ప్రయత్నం చేసిన పూజాకి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. ఒకానొక దశలో ఐరెన్ లెగ్ అనే ఇమేజ్ కూడా వచ్చింది.

ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాథమ్, అరవింద సమేత, మహర్షి, అల.. వైకుంఠపురములో‘ అంటూ వరుసగా అగ్ర కథానాయకులతో నటించి టాలీవుడ్ లో పాగా వేసేసింది బుట్ట బొమ్మ. అఖిల్ తో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్‘లో కూడా పెర్ఫార్మెన్స్ పరంగా పూజాకి మార్కులు పడ్డాయి. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే ‘రంగస్థలం, గద్దలగొండ గణేష్, ఎఫ్3‘ వంటి సినిమాలలో స్పెషల్ అప్పీరెన్సెస్ తో అలరించింది. ప్రస్తుతం పూజా కెరీర్ డల్ గా సాగుతోంది. పోయినేడాది ఎన్నో అంచనాలతో విడుదలైన ‘రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్‘ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

తెలుగు సినిమాలతో పాటు హిందీ చిత్రసీమలోనూ పూజా హెగ్డేకి తొలుత చేదు అనుభవమే ఎదురైంది. తొలి సినిమాయే గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ సరసన చేసే అదృష్టం వరించినా ఆ సినిమా ఘోర పరాజయాన్ని పొందింది. దాంతో ఆ తర్వాత కొన్నేళ్లపాటు బాలీవుడ్ కి దూరమైన పూజా హెగ్డే.. మళ్లీ 2019లో ‘హౌస్ ఫుల్-4’తో హిట్ అందుకుంది. ఇక పూజ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‘ సినిమాలు విజయాలు సాధించలేదు.

మరోవైపు మహేష్ బాబు తో ‘గుంటూరు కారం‘లో నటించే అవకాశం కూడా చేజారిపోయింది. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‘లోనూ తొలుత పూజా హెగ్డేనే కథానాయిక. అయితే.. ‘గుంటూరు కారం‘ తరహాలోనే ‘భగత్ సింగ్‘ పాత్రనూ శ్రీలీల కొట్టేసింది. అలా.. పడి లేచిన కెరటం పూజా హెగ్డే.. మళ్లీ ఫ్లాపుల బాట పట్టింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్, సంపత్ నంది చిత్రంలో పూజా కథానాయికగా నటించబోతుంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబో మూవీలోనూ పూజా పేరు వినిపిస్తుంది. తమిళంలోనూ ‘ఆవారా 2‘లో హీరోయిన్ గా చేస్తుందట. మరి.. త్వరలోనే పూజా మంచి విజయాలు సాధించి మళ్లీ అగ్రపథాన దూసుకెళ్లాలని ఆశిస్తూ.. ఈరోజు పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుదాం.

Related Posts