‘కన్నప్ప‘లో నటించబోతున్న కన్నడ స్టార్

హీరోలకు కెరీర్ బెస్ట్ ఫిల్మ్స్ అంటూ కొన్నే ఉంటాయి. అలా.. రెబెల్ స్టార్ కృష్ణంరాజు కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోదగ్గ చిత్రం ‘భక్త కన్నప్ప‘. ఇలాంటి క్లాసిక్స్ ను రీమేక్ చేయాల్సి వస్తే.. మళ్లీ వాళ్ల వారసులే నటించాలని కోరుకుంటారు అభిమానులు. అయితే.. ఎవర్ గ్రీన్ ‘భక్త కన్నప్ప‘ను ఇప్పుడు మంచు విష్ణు రీమేక్ చేస్తున్నాడు.

ప్రభాస్ చేస్తాడనుకున్న ‘భక్త కన్నప్ప‘లో మంచు విష్ణు నటిస్తుండడంతో.. రెబెల్ స్టార్ ఫ్యాన్స్ నిరాశచెందారు. అయితే.. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘లో ప్రభాస్ కూడా నటించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ‘కన్నప్ప‘లో ప్రభాస్ శివుడు పాత్రలో నటిస్తాడనే ప్రచారం జరిగింది. పార్వతిగా నయనతార కనిపించనుందట. పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో మలయాళం నుంచి మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ‘కన్నప్ప‘లో భాగస్వామ్యమయ్యాడట. అసలు కృష్ణంరాజు నటించిన ‘భక్త కన్నప్ప‘ చిత్రం.. కన్నడలో శివరాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ నటించిన ‘బేడార కన్నప్ప‘కు రీమేక్.

ఎక్కువభాగం న్యూజిలాండ్ లో చిత్రీకరణ జరుపుకోబోతున్న ‘కన్నప్ప‘ చిత్రం కోసం చాలామంది దిగ్గజ రచయితలను రంగంలోకి దింపాడు విష్ణు. ఈ సినిమాకోసం పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్రప్రసాద్, తోటపల్లి సాయినాథ్, తోట ప్రసాద్ స్క్రిప్ట్ సమకూరుస్తున్నారు. దర్శకులు నాగేశ్వరరెడ్డి, ఈశ్వర్ రెడ్డి లు కూడా ఈ సినిమా స్క్రిప్ట్ రచనలో భాగస్వాములయ్యారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ‘కన్నప్ప‘ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు విష్ణు నిర్మిస్తుండగా.. ‘మహాభారత్‘ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Posts