అసాధ్యాలను సుసాధ్యం చేసిన నటశిఖరం

నటుడిగా ఆయన ఒక విశ్వరూపం. అభినయానికి నాట్యవేదం. బాలనటుడిగా పరిచయమై, కథానాయకుడిగా ఎదిగి, ప్రవేశించిన ప్రతీ భాషాచిత్రాలలోనూ తనదైన సంతకంతో లెక్కలేనంతమంది అభిమానులను సొంతం చేసుకుని తన నటజీవితాన్ని సార్ధకం చేసుకుని, ఒక చరిత్రగా తీర్చిదిద్దుకున్న మహత్తర సాధనలో వేసిన ప్రతి అడుగు, తిరిగిన ప్రతీ మలుపూ ఆయన జీవితంలో ఒక విజయ పతాకం. ఒక కీర్తికిరీటం. 69 ఏళ్ళ జీవితంలో 62 ఏళ్ళ నటజీవితాన్ని పొందుపరుచుకున్న కమల్‌ ఒక చరిత్ర. అసాధ్యాలను సుసాధ్యం చేసిన నటశిరోమణి. ఈరోజు (నవంబర్ 7) కమల్ పుట్టినరోజు.

బాల నటుడిగానే బంగారు పతకం
1954లో తమిళనాడులో పుట్టిన కమల్‌హసన్‌ ఆరేళ్ళకే తమిళ తెర మీద ఆరంగేట్రం చేశాడు. ‘కలత్తూర్‌ కన్నమ్మ’ అనే చిత్రంలో మహానటి సావిత్రి కొడుకుగా నటించిన చిన్నారి కమల్ పరిశ్రమ దృష్టిని, ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్నాడు. అవార్డుల పరంపర అనాడే ప్రారంభమైంది. భారత రాష్ట్రపతి బంగారు పతకాన్ని గెలుచుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

బాలచందర్ దర్శకత్వ నిర్దేశకత్వంలో
1973లొ వచ్చిన ‘అరంగేట్రం’ చిత్రంతో వయసొచ్చిన కమల్‌ ఒక ప్రముఖ పాత్రను పోషించాడు. 1974లో విడుదలైన కన్యాకుమారి అనే మలయాళ చిత్రంలో పూర్తిస్థాయి హీరోగా ప్రత్యక్షమై, మరుసటి సంవత్సరంలో బాలచందర్‌ ‘అపూర్వరాగంగళ్‌’ చిత్రం తర్వాత తిరిగి చూసుకోని పరుగును సొంతం చేసుకున్నాడు.

తెలుగులో మరోచరిత్ర
1978లో వచ్చిన బాలచందర్‌ చిత్రం ‘మరో చరిత్ర’ కమల్‌హసన్‌ కి తెలుగులో పెద్ద పీటనే వేసింది. తెలుగు బాగా నేర్చుకుని ‘మరోచరిత్ర’ సినిమాలో కమల్‌ తన డబ్బింగ్‌ తానే చెప్పుకున్నాడు. అందులో ఒక సీన్‌లో తెలుగుభాషలో బాగా ప్రాచుర్యం పొందిన యాసలన్నింటినీ కమల్‌ అవసోసన పట్టి మరీ చెప్పడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ‘మరో చరిత్ర’ సంచలనం సృష్టించడానికి కమల్‌ నట ప్రతిభ ఎంతగానో దోహదపడింది. తెలుగులో వచ్చిన ‘మరోచరిత్ర’ చిత్రాన్ని హిందీలో బాలచందర్‌ ‘ఏక్‌ దూజేకే లియే’ పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమా హిందీలో విజయదుందుభిలు మ్రోగించింది.

విశ్వనాథ్ దర్శకత్వంలో క్లాసిక్స్
1983లో కళాతపస్వి కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో పూర్ణోదయా బ్యానర్‌ మీద ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ‘సాగర సంగమం’ తెలుగు ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచెత్తింది.

తర్వాత మళ్ళీ కె. విశ్వనాథ్‌, కమల్‌ కాంబినేషన్‌ లో 1985లో మళ్ళీ అదే సంస్థ పూర్ణోదయా నిర్మించిన ‘స్వాతిముత్యం’ తెలుగు సినిమాలలో మరో మైలురాయిగా నిలిచి, తెలుగు సినిమాని సుసంన్నం చేసిన చిత్రంగా ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంది.

ఆనాడే పాన్ ఇండియా ట్రెండ్
ఈరోజున పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్స్ అని చెప్పుకుంటున్న ట్రెండ్‌ కి 1996లోనే ‘భారతీయుడు’ చిత్రం శ్రీకారం చుట్టింది. అందులో కమల్‌ వయసు మళ్ళిన పాత్రకి అవసరమైన మేకప్‌కి సంబంధించి తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్త ఆ పాత్రని వెయ్యింతలు పెంచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’తో రెడీ అవుతున్నాడు. ఇటీవలే రిలీజైన ఈ మూవీ ఇంట్రోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కమల్ విజయపరంపరలో
‘విక్రమ్’ విజయంతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసిన కమల్ హాసన్ ఇప్పుడు ‘భారతీయుడు 2’తో పాటు మణిరత్నం కలయికలోనూ సినిమా చేస్తున్నాడు. 1987లో వచ్చిన ‘నాయకుడు‘ తర్వాత వీరిద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రమిది.

లేటెస్ట్ గా ఈ మూవీకి ‘థగ్ లైఫ్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రభాస్ ‘కల్కి 2898 ఎడి‘ మూవీలోనూ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు కమల్.

కమల్ నటజీవితం ఎందరికో ఆదర్శం
కమల్‌ నటజీవితం ఎందరికో ఆదర్శంగా మారడానికి ఆయన ఎంచుకున్న మార్గమే కారణం. నలుగురితో పాటూ తాను కూడా అన్న ధోరణికి స్వస్తి చెప్పి, కమల్‌ ఎప్పుడూ తనదైన ప్రత్యేకమైన బాణీని, ధోరణి ప్రేక్షకులకి పరిచయం చేస్తూ, క్రమంగా అలవాటుగా మార్చేశారు. గుడ్డివాడిగా, చెవిటివాడిగా, పిచ్చివాడిగా ఓ రకంగా కాదు….ఏ పాత్రైనా తానై కనిపించాడు.

Related Posts