రచనలో దిట్ట.. దర్శకత్వంలో దిగ్గజం..

లాజిక్‌ ను జోడించి, డైలాగ్ ‌తో మేజిక్‌ చేయడంలో ఆందెవేసిన చేయి.. సన్నివేశానికి తగినట్టుగా మాటను ఆయుధంలా వాడడంలో సవ్యసాచి.. హీరోల ఇమేజ్‌ ని బట్టి కూడా డైలాగ్‌ ను పేల్చగల ఛాంపియన్‌.. కేవలం మాటల రచయితగానే కాదు.. చిత్రదర్శకుడిగా కూడా తన బ్రాండ్‌ ని, ట్రెండ్‌ ని సృష్టించుకుని, అనతికాలంలోనే తారాపథంలోకి దూసుకుపోయి.. చిత్రవిచిత్రాలను మాస్, క్లాస్‌ ప్రేక్షకులకు ఎడతెరిపి లేకుండా అందజేస్తున్న దర్శక మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్‌ పుట్టినరోజు ఈ రోజు (నవంబర్ 7).

‘స్వయంవరం’ చిత్రంతో మొదలైన త్రివిక్రమ్ రచనా ప్రయాణం అత్యంత వేగవంతంగా సాగింది. ‘చిరునవ్వుతో, సముద్రం, నువ్వు నాకు నచ్చావ్‌, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ’ చిత్రాలకు తనదైన మార్కు మాటలతో గొప్ప గుర్తింపును సొంతం చేసుకున్నాడు. త్రివిక్రమ్‌ దర్శకుడిగా పరిచయమవడంతో తెలుగు సినిమాలు, మరీ ముఖ్యంగా హీరోల సినిమాలకి విలక్షణమైన క్రేజ్‌ వచ్చింది. సీను రాయడంలో, సీనుకు తగిన మాటలను పాత్రలకు పొదగడంలో త్రివిక్రమ్‌ గడుసుదనం హీరోలకి న్యూవేవ్ ‌ని క్రియేట్‌ చేసింది. అందుకే ప్రతీ హీరో త్రివిక్రమ్ ‌తో చెయ్యడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారనే టాక్‌ వచ్చింది.

మహేష్‌ బాబు సినిమాలలోనే అతడు సినిమా ఓ ప్రత్యేకమైన ఒరవడిలో ఉంటుంది. తక్కువ డైలాగులు, ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్, సౌండ్‌ కన్నా సైలెన్సే అధికంగా ఆక్రమించుకున్న ‘అతడు’ చిత్రం టీవీల్లో ఎన్ని సార్లు వస్తే అన్ని సార్లు కూడా ఇంటిల్లిపాది కూర్చుని చూసి ఎంజాయ్‌ చేసే చిత్రంగా ముద్ర పడింది.

పవన్‌ కళ్యాణ్‌తో చేసిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో త్రివిక్రమ్‌ నడిపిన సీన్స్ ప్రేక్షకులను తిరుగులేని రీతిలో ఆకట్టుకున్నాయి. అంత పెద్ద స్టార్‌ ని ఇంటిలో కారు డ్రైవర్‌గా ప్రవేశపెట్టి ఆడించిన నాటకానికి వెనకనుండి తన కలంతో, బుద్ధిబలంతో దర్శకుడిగా, రచయితగా కూడా త్రివిక్రమ్‌ చూపించిన ఒడుపు పవన్‌ అభిమానుల్ని మామూలుగా రెచ్చగొట్టలేదు.

అల్లు అర్జున్ అభిమానులను ‘అల.. వైకుంఠపురములో’ నిలబెట్టిన త్రివిక్రమ్ మరోసారి అతనితో సిల్వర్ స్క్రీన్ పై మేజిక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

రచన, దర్శకత్వం రెండు పడవల మీద ప్రయాణం చేయగల నైపుణ్యం త్రివిక్రమ్ సొంతం. హీరోయిజమ్‌, రొమాంటిసిజమ్‌ ప్లస్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ అనే జోడు గుర్రాల స్వారీ చేసే చాతుర్యం అన్న అరుదైన దర్శకుడిగా త్రివిక్రమ్‌ ది తప్పనిసరిగా ఓ ప్రత్యేకస్థానం.

ప్రస్తుతం మహేష్ బాబుతో హ్యాట్రిక్ మూవీగా ‘గుంటూరు కారం’ని తీర్చిదిద్దుతున్నాడు త్రివిక్రమ్. రాబోయే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts