రుద్రంగి

తారాగణం : జగపతిబాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్, ఆశిష్‌ గాంధీ, గణవి లక్ష్మణ్, ఆర్ఎస్ నందా తదితరులు
ఎడిటర్ : నాగేశ్వర రెడ్డి బొంతల
సంగీతం : నవ్ ఫాల్ రాజా
సినిమాటోగ్రాఫర్ : సంతోష్‌ షానమోని
నిర్మాత : డాక్టర్ రసమయి బాలకిషన్
దర్శకత్వం : అజయ్ సామ్రాట్

తెలంగాణ నేపథ్యం ఇప్పుడు తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ గా మారింది. అయితే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే కథలు పూర్తి స్థాయిలో వస్తున్నాయని మాత్రం చెప్పలేం. తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. పోరాటగడ్డగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నది. అదే సమయంలో దొర, గడీ అనే బానిస సంకెళ్లూ ఉన్నాయి. ఆ సంకెళ్లను బద్ధలు కొడుతూ అనేక కథలు, గాథలూ ఉన్నాయి. అలాంటి కథేమైనా వస్తుందేమో అని ఎదురుచూస్తున్న వారికి ఇదుగో మేమొస్తున్నాం అంటూ వచ్చారు రుద్రంగి మూవీ టీమ్. మరి ఈ సినిమా ఎలా ఉంది..? ఇప్పటి వరకూ వాళ్లు చెప్పినంత మేటర్ సినిమాలో ఉందా లేదా అనేది చూద్దాం.

కథ:
మల్లేష్‌(ఆశిష్‌ గాంధీ) రుద్రంగి(గణవి లక్ష్మణ్) బావా మరదల్లు. చిన్నప్పుడే వీరి తల్లితండ్రులు చనిపోతారు. చావుకు దగ్గరైన తాత వద్ద పెరుగుతుంటారు. వారి అన్యోన్యత చూసి ఆ తాత చిన్నప్పుడే మల్లేష్‌ చేత రుద్రంగి మెడలో తాళి కట్టిస్తాడు. వయసు మల్లిన ఆ వ్యక్తిని వెట్టి చేయడానికి ఆ ఊరి దొర రమ్మంటాడు. రాలేనంటే ఈడ్చుకువెళ్లి కట్టేసి కొట్టి చంపేస్తాడు. అప్పుడే ఆ దొరపై ఎదురుతిరుగుతాడు చిన్న మల్లేష్‌. దొర చంపేస్తాడేమో అని రుద్రంగిని వదిలి పారిపోతాడు. అలా వెళుతున్న క్రమంలో మరో దొర భీమ్ రావ్ దేశ్ ముఖ్(జగపతిబాబు) పై హత్యా ప్రయత్నం జరిగితే దాన్నుంచి కాపాడతాడు. అప్పటి నుంచి దొర వద్దే ఉంటూ పెరుగుతాడు మల్లేష్‌. ఆక్స్ ఫర్డ్ లో చదువుకున్నా దొర అనే అహంకారం నిలువెల్లా నింపుకున్న మనిషి భీమ్ రావ్ దేశ్ ముఖ్. కనిపించిన ఆడదాన్నల్లా చెరపడుతుంటాడు.

ఓ సారి రెండో పెళ్లి చేసుకుని జ్వాలాబాయ్ దేశ్ ముఖ్(మమతా మోహన్ దాస్)ను తెస్తాడు. మొదటి భార్య(విమలా రామన్) మౌనంగా చూస్తుందే తప్ప ఏమీ చెప్పలేని నిస్సహయురాలు. రెండో భార్యతో అతను ప్రేమనే కాదు.. పక్కను కూడా పంచుకోడు. ఈ క్రమంలో ఆమె మల్లేష్‌ పై మనసు పడుతుంది. మల్లేష్‌ కాదంటాడు. ఓ రోజు దొర రుద్రంగిని చూసి మోహించి.. పిచ్చివాడైపోతాడు. ఆమెను తీసుకురమ్మని మల్లేష్‌ ను పంపిస్తాడు. అలా వచ్చిన మల్లేష్‌ ఆమె తన భార్య అని చెబుతాడు. అయినా నాక్కావాలంటాడు దొర. దీంతో మల్లేష్‌ ఎదురుతిరుగుతాడు.. మరి ఆ తర్వాత ఏమైందీ అనేది మిగతా కథ.

విశ్లేషణ:
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ తెలంగాణకు కాదు. ఇది అప్పటికి నిజాం స్టేట్ కిందే ఉంది. భారత్ లో విలీనం చేయడానికి నిజాం ఒప్పుకోలేదు. అందుకే వల్లభాయ్ పటేల్ సైన్యంతో వచ్చి నిజాంను లొంగదీసుకుంటాడు. ఈ రుద్రంగి కథ ఆ కాలంలో జరిగినట్టుగా ఎంచుకున్నడు దర్శకుడు. అంటే అప్పటికి ఇంకా కమ్యూనిజం పురుడుపోసుకోలేదు. ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం రాలేదు. అంటే ప్రభుత్వ అండా లేదు. మరి దొరతనపు ఆగడాల మధ్య ఆ అమాయకపు జనం ఎలా నలిగిపోతారు అనేది అచ్చంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అజయ్ సామ్రాట్. ఫిక్షనల్ స్టోరీగానే కనిపించినా.. తెలంగాణ గురించి తెలిసిన వారికి ఆ బాధేంటనే అర్థమవుతుంది. హీరో… హీరోయిజం నిండి ఉన్న కథలకు సంబంధించి కొన్ని సులువుగానే ఊహించేయొచ్చు. ఈ రుద్రంగి ట్రైలర్ చూసిన తర్వాత ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమాగానే భావించారు చాలామంది.

ఆ ఎలిమెంట్స్ ఉన్నా.. ఆ కాలం నాటి తెలంగాణ దొరల ఆగడాలను బాగా పిక్చరైజ్ చేశారు. భీమ్ రావ్ పాత్రను పరిచయం చేయడం నుంచి ముగించడం వరకూ దర్శకుడు మంచి ప్రతిభ చూపించాడు. మల్లేష్ పాత్రను బిల్డ్ చేసిన విధానానికి అది ఎండ్ అయిన విధానానికి మధ్య ఓ అసంబద్ధత కనిపిస్తుంది. అందుకే ఇది హీరోయిజంతో నడిచే కథ కాదు. కథను బట్టే సాగే పాత్రలుంటాయి. కాబట్టే రెగ్యులర్ హీరోయిజం ఈ సినిమాలో కనిపించదు. కనిపించినప్పుడు మాత్రం ఓకే అనిపిస్తుంది.


దొర పాత్రకు పూర్తి భిన్నంగా ఆయన భార్య పాత్ర ఉంటుంది. ఆమెకు సామాన్య జనాలంటే కూడా ఇష్టమే. దొరకు మాత్రం వాళ్లు బానిసలే. ఊరు మొత్తం ఆడవాళ్లను చెరిచిన దొర ఒక అమ్మాయి కోసం పిచ్చివాడైపోవడం.. అనే సీన్స్ బావున్నాయి. వ్యక్తిత్వం అనేది మనిషిపై ఆధారపడి ఉంటుంది తప్ప.. దొరతనం పై కాదు అని చెప్పేందుకు దొర రెండో భార్య మల్లేష్‌ ను వలచి.. అవసరమైతే దొరను చంపి గడీనే నీకు ఇస్తానన్నా తన వ్యక్తిత్వాన్ని అతను చంపుకోడు. ఈ సీన్ మధ్యలో రెండు మూడుసార్లు వచ్చినా.. చివర్లో అద్భుతంగా వర్కవుట్ అయింది.


దర్శకుడుగా అజయ్ కొన్ని సన్నివేశాల్లో అద్బుత ప్రతిభ చూపిస్తే.. అతని టాలెంట్ ను తమ నటనతో నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లారు ఆర్టిస్టులు. ముఖ్యంగా.. రుద్రంగికి తన బావంటే ఎంత ఇష్టమో చెప్పమని చిన్న దొరసాని అడిగితే.. ఆమె ఓ పాట పాడుతుంది. ఆ సమయంలో గణవి లక్ష్మి, మమతా మోహన్ దాస్ నటన.. సింప్లీ సూపర్బ్. ఇక దొరకు తనను తాను అర్పించుకునేందుకు సిద్దపడిన రుద్రంగి.. ఆ ఊరి గుడి ముందుకు వెళ్లి ఒక్క మాట కూడా చెప్పుకుండా మట్టిన పట్టుకుని.. గుడిగంటను మోగించే సీన్.. కె విశ్వనాథ్ సినిమాలను తలపిస్తుంది.

ఆఖర్లో జగపతిబాబు చనిపోయే సన్నివేశం.. అనూహ్యం కాకపోయినా ఆ పాత్రకు అద్భుతమైన ముగింపుగా కనిపిస్తుంది. దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టే ఇలాంటి సన్నివేశాలు అనేకం ఉన్నాయి.
అదే సమయంలో రుద్రంగి కోసం చావడానికి సిద్ధపడిని ఊరు.. ఆమె దొర వద్దుకు వెళ్లడానికి సిద్ధపడ్డ మరుక్షణం నీటి కోసం వెంపర్లాడటం.. సహజంగా అనిపించలేదు. అప్పటి వరకూ దొర మాట విని సొంత మనిషిని కూడా చంపేందుకు వచ్చిన దొర మనుషులు.. కేవలం చిన్న స్పీచ్ కే పడిపోవడం ఆర్టిఫిషియల్ గా ఉంది. కోరి తెచ్చుకున్న రెండో పెళ్లాం గురించి కనీసం పట్టించుకోకపోవడం ఆకట్టుకోదు. తెలంగాణ, ఆంధ్రకు సంబంధం లేని కాలంలో రూపొందినట్టుగా చెప్పిన సినిమాలోని జీప్ నంబర్ ఏపి అనే అక్షరాలతో ఉండటం నిర్లక్ష్యమే. ఇలాంటి సీన్స్ కూడా అనేకంగానే ఉన్నాయి.


ఓవరగాల్ గా మొదటి సగం చూస్తున్నప్పుడు.. కేవలం లస్ట్ స్టోరీలా కనిపించినా.. ఇంటర్వెల్ కు ముందుకు వచ్చేసరికి అసలు పాయింట్ లోకి వచ్చాడు. ఇక గడీలను పడగొట్టి బడులుగా మార్చాలనేది దర్శకుడు చెప్పాలనుకున్న అసలు పాయింట్. బట్ ఆ పాయింట్ ఎక్కడా ఎలివేట్ కాలేదు. ఆఖర్లో చూపించినా.. చాలామందికి అర్థం కూడా కాదు.

సినిమాను పూర్తిగా ఒక ఊరికి మాత్రమే పరిమితం చేయడం వల్ల రిపీటెడ్ సీన్స్ కనిపిస్తుంటాయి. అయినా ఆర్టిస్టుల ప్రతిభ వల్ల అనేక సన్నివేశాలు అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. మూర్ఖత్వం, కామం, అహంకారం కలిసిన దొరగా జగపతిబాబు అద్భుతంగా నటించాడు. కాకపోతే డిక్షన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అప్పుడే ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చిన మనిషి తెలంగాణ యాసలో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది జగపతిబాబు డైలాగ్ డెలివరీ. మాటలు పట్టి పట్టి చెప్పడంతో ప్రతిసారీ ఆర్టిఫిషియల్గానే అనిపిస్తుంది. మమతామోహన్ దాస్ ఫైర్ బ్రాండ్ లా అదరగొట్టింది. విమలా రామన్ ఓకే. ఆశిష్ గాంధీ యాక్షన్ సీన్స్ లో బావున్నాడు. డబ్బింగ్ వల్ల అతని నటనలో సహజత్వం కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది.

రుద్రంగి పాత్రలో నటించిన గణవి లక్ష్మణ్.. సినిమాలో జగపతిబాబు పాత్ర చెప్పినట్టుగా మట్టి పరిమళంలానే ఉంది. నటనా చాలా సహజంగా చేసింది. మిగతా పాత్రల్లో బాహుబలి ప్రభాకర్ ది ఆకార పుష్టి మాత్రమే. దొర అనే స్టేచర్ అతని నటనలో కనిపించలేదు. మిగతా పాత్రల్లో దొర వద్ద కర్ణంగా నటించిన ఆర్ఎస్ నందా ఆకట్టుకున్నాడు. ఆల్రెడీ యూ ట్యూబ్ లో ఫేమస్ స్టార్ కాబట్టి అతని టైమింగ్ చాలా చోట్ల నవ్వులు పూయిస్తుంది.


టెక్నికల్ గా ఈ చిత్రానికి నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. ఇప్పటి వరకూ మనం వినని సౌండింగ్స్ ఏవో ప్రయోగించాడు సంగీత దర్శకుడు నవ్ ఫాల్ రాజా.. అవన్నీ అదిరిపోయాయి. వీక్ సీన్స్ ను కూడా స్ట్రెంతెన్ చేశాయి. పాటలన్నీ బావున్నాయి. డ్యూయొట్ లో సాహిత్యం వినసొంపుగా ఉంది. ఎడిటింగ్ పరంగా ఓ పదినిమిషాలైనా ఇంకా తగ్గించొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ మరీ సాగదీతగా ఉంది. దొరగడీ, ఊరు సెట్స్ అదిరిపోయాయి. ఇది నిజంగా గడీయే అన్నంత సహజంగా సెట్స్ అన్నీ కుదిరాయి. ఆర్ట్ వర్క్ బావుంది. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. దర్శకుడుగా అజయ్ సామ్రాట్ ఎంచుకున్న కథా నేపథ్యం తెలంగాణ వారికి ముఖ్యంగా ఓ రెండు తరాల వెనక వారికి బాగా తెలుస్తుంది. అర్థం అవుతుంది. మరి మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందో కానీ.. ఇక్కడి వరకూ వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి.

ఫైనల్ గా: దొరల గడీలను కూల్చి బడులు కట్టమన్న రుద్రంగి.

రేటింగ్: 2.5/5

                    - బాబురావు. కామళ్ల

Related Posts