ఉత్తరాదిని మరోసారి ఊపేయనున్న ‘ఆర్.ఆర్.ఆర్‘

సమ్మర్.. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయితే.. ఈ ఏడాది వేసవి చాలా డల్ గా సాగుతోంది. ఒకవైపు పెద్ద సినిమాలు లేక.. మరోవైపు ఎలక్షన్స్, ఐ.పి.ఎల్. వంటి వాటితో థియేటర్లు ఖాళీగా ఉండే పరిస్థితి వచ్చింది. ఈనేపథ్యంలో.. గతంలో సూపర్ హిట్టైన సినిమాలను మళ్లీ రీ-రిలీజ్ చేసే సంప్రదాయం ఇప్పుడు జోరుగా కొనసాగుతోంది.

దక్షిణాదిన అగ్ర కథానాయకులు నటించిన సినిమాలు ప్రతీ వారం రీ-రిలీజ్ అవుతూనే ఉన్నాయి. తమిళం నుంచి ఆమధ్య రిలీజైన విజయ్ ‘గిల్లీ‘ అయితే.. రీ-రిలీజుల్లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. రీ-రిలీజులోనూ వరల్డ్ వైడ్ గా రూ.25 కోట్లకు పైగా గ్రాస్ ను కొల్లగొట్టింది. ఇప్పుడు ఉత్తరాదిన సైతం రీ-రిలీజుల మోత మోగబోతుంది. అది కూడా.. మన తెలుగు సినిమా ‘ఆర్.ఆర్.ఆర్‘తో కావడం విశేషం.

కరోనా పాండమిక్ తర్వాత యావత్ దేశ సినీ పరిశ్రమకు ‘ఆర్.ఆర్.ఆర్‘ చిత్రంతో మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొస్తానని మాటిచ్చాడు దర్శకధీరుడు రాజమౌళి. అన్నట్టుగానే ‘ఆర్.ఆర్.ఆర్‘ రూపంలో వెయ్యి కోట్ల సినిమాని అందించాడు. ఈ చిత్రాన్ని హిందీలో పెన్ స్టూడియోస్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మళ్లీ నార్త్ లో ‘ఆర్.ఆర్.ఆర్‘ సినిమాని రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. త్వరలోనే.. ‘ఆర్.ఆర్.ఆర్‘ రీ-రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.

Related Posts