జపాన్ లోనూ అదరగొడుతున్న మనోళ్లు

ఒకప్పుడు జపాన్ లో బాగా తెలిసిన ఇండియన్ యాక్టర్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ చిత్రం జపాన్ లో ‘డాన్సింగ్ మహారాజ’గా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత రజనీకాంత్ ‘రోబో’ కూడా జపాన్ లో పెద్ద హిట్ అయ్యింది. ఇక.. రజనీకాంత్ సినిమాల తర్వాత ఆమిర్ ఖాన్ నటించిన ‘3 ఇడియట్స్’ కూడా జపాన్ లో బాగానే ఆడినా.. రాజమౌళి చిత్రరాజం ‘బాహుబలి-2’ అయితే అక్కడ సెన్సేషనే సృష్టించింది.

‘బాహుబలి ది కంక్లూజన్’ జపాన్ లో ఏకంగా వంద రోజుల రన్ పూర్తిచేసుకోవడం విశేషం. దీంతో.. రాజమౌళి మరో చిత్రం ‘మగధీర’ను కూడా జపాన్ లో విడుదల చేశారు. జక్కన్న బ్రాండ్ తో జపాన్ లో రిలీజైన ‘మగధీర’కు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్‘ కూడా జపాన్ లో విడుదలవ్వడం.. సినిమా ప్రమోషన్ కోసం ఎన్టీఆర్, చరణ్ ఆ దేశం వెళ్లడం వంటివి చూశాం.

లేటెస్ట్ గా రెబెల్ స్టార్ ప్రభాస్ ‘సలార్‘ జపాన్ లో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ చిత్రం గత డిసెంబర్ లో రిలీజై రూ.715 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు జపాన్ లో జూలై 5న విడుదలకు ముస్తాబవుతోంది. మరి.. ప్రభాస్ నటించిన ‘బాహుబలి‘ని విపరీతంగా ఆదరించిన జపాన్ ప్రేక్షకులు.. ‘సలార్‘కి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

Related Posts