‘ఆపరేషన్ వాలెంటైన్’ రివ్యూ

నటీనటులు: వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ తదితరులు
సినిమాటోగ్రఫి: హరి కె. వేదాంతం
సంగీతం: మిక్కీ జే మేయర్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాతలు: సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్ద
దర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా
విడుదల తేదీ: 01-03-2024

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ‘ఆపరేషన్ వాలెంటైన్’. ‘ఎఫ్ 3’ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వచ్చిన ‘గాండీవధారి అర్జున’ ఏమాత్రం అలరించలేకపోయింది. దీంతో.. ఇప్పుడు వరుణ్ తన ఆశలన్నీ ‘ఆపరేషన్ వాలెంటైన్’పైనే పెట్టుకున్నాడు. ఆద్యంతం ఏరియల్ యాక్షన్ గా ఈ చిత్రాన్ని రాజస్థాన్ బేస్డ్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించాడు. ఈ మూవీలో వరుణ్ కి జోడీగా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్ నటించింది. సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోందా? ఈ సినిమా కథేంటి వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ
అర్జున్ రుద్ర‌దేవ్ అలియాస్ రుద్ర (వ‌రుణ్‌తేజ్‌) భార‌తీయ వైమానిక ద‌ళంలో స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌. అతను ధైర్యసాహసాలతో ఏం జరిగినా చూసుకుందాం అనే అటిట్యూడ్ ఉంటాడు. అదే వైమానిక దళంలో పనిచే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్ (మానుషి చిల్ల‌ర్‌)తో ప్రేమ‌లో పడతాడు. తోటి ఫైటర్స్ తో ప్రారంభించిన వజ్ర మిషన్ విఫలమవ్వడంతో రుద్ర పై ఆంక్షలు విధిస్తారు. ఈ క్రమంలో పుల్వామా దాడి జరిగి కొంతమంది జవాన్లు వీరమరణం పొందుతారు. దీంతో ప్రతీకార చర్య తీర్చుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్‌లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి వస్తుంది. ఆ తరువాత పాకిస్తాన్ చేపట్టిన చర్యలు ఏంటి? వాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా అడ్డుకుంది? వంటి విశేషాలే ‘ఆపరేషన్ వాలెంటైన్’ కథ.

విశ్లేషణ
ఉగ్ర‌వాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్ర‌తిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వ‌ర‌కూ ప‌లు వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇప్పటివరకూ త్రివిధ దళాలలో మిలటరీ, నావీ లకు సంబంధించిన కథలతోనే ఎక్కువగా చిత్రాలు రూపొందాయి. అయితే.. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాముఖ్యత పెరిగింది. ఈకోవలో రూపొందిన చిత్రమే ‘ఆపరేషన్ వాలెంటైన్’.

గ్వాలియర్ ఎయిర్ బేస్‌లో జరిగిన ఓ సంఘటనతో కథ సీరియస్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత కథ బ్యాక్ డ్రాప్ శ్రీనగర్‌కు చేరుకొంటుంది. ఇక.. పుల్వామా ఎటాక్ దాడిలో మన సైనికులు చనిపోయిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆ ఎమోషనల్ సీన్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’లో అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. కథలో బలమైన సన్నివేశాలు, ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురిచేసే సన్నివేశాలు ఫస్టాఫ్‌లో లేకపోవడంతో రెగ్యులర్ ఆడియెన్స్‌కు మొదటి భాగం ఏదో సాదాసీదాగా సాగినట్టు అనిపిస్తుంది.

సెకండాఫ్‌లో పాక్, ఇండియా మధ్య పరస్పర దాడుల చిత్రీకరణ ఆకట్టుకునే రీతిలో ఉంది. సర్జికల్ స్ట్రైక్ ఎలా చేశారు? అనే విషయాలను ఇందులో చూపించారు. నాలుగు నిమిషాల్లోనే పని పూర్తిచేసిన మన ఎయిర్ ఫోర్స్ ఘనతను అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఓవరాల్ గా ఫస్టాప్ సో సో గా సాగితే.. సెకండాఫ్ మాత్రం ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు చూస్తున్నప్పుడు దేశభక్తి నరనరాల్లోకి వచ్చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గొప్పదనం, ధైర్య సాహసాలను ఈ సినిమాలో బాగా ఆవిష్కరించారనే చెప్పొచ్చు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడంలో తన విలక్షణతను చూపే వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్ అధికారిగా చక్కగా సరిపోయాడు. ఆ హైట్, పర్సనాలిటీ చూస్తుంటే నిజంగానే మనం ఓ వింగ్ కమాండర్‌ను చూసినట్టుగానే అనిపిస్తుంది. రుద్ర అలియాస్ అర్జున్ దేవ్‌ గా పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. మానుషి చిల్లార్ తెరపై అందంగా కనిపిస్తుంది. అంతే ఎమోషనల్‌ గానూ నటించింది. హీరోహీరోయిన్ల పాత్రలే తెరపై ఎక్కువ సేపు కనిపిస్తాయి. నవదీప్ క్యారెక్టర్ అసంపూర్తిగా ముగిసిపోవడం కొంత జీర్ణించుకోలేని విషయంగా కనిపిస్తుంది. అభినవ్ గోమఠం పాత్ర చిన్నదే. ఇంకా.. మిగిలిన పాత్ర‌ల‌న్నీ తమ పాత్రల మేరకు ప‌రిమితంగానే ఉంటాయి.

టెక్నికల్ విభాగం గురించి వస్తే.. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెరపై కనిపించే ప్రతీ సీన్ చాలా రిచ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ హ‌డా భారతీయ వైమానిక ద‌ళం గురించి సహజంగా తెరపై చూపించాడు కానీ.. సినిమాకి అవసరమైన డ్రామానే కొరవడిందని చెప్పాలి.

చివరగా
దేశభక్తి ప్రదానంగా సాగే సన్నివేశాలు, వరుణ్ తేజ్, మానుషి చిల్లార్ నటన, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు అని చెప్పొచ్చు. కథనం సాగే విధానం, కొరవడిన భావోద్వేగాలు ‘ఆపరేషన్ వాలెంటైన్’కి మైనస్ లుగా చెప్పొచ్చు. మొత్తంగా.. ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోకపోయినా.. సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. గగనవీధుల్లో పోరాటాలను ఆస్వాదించాలంటే ‘ఆపరేషన్ వాలెంటైన్’ చూడాల్సిందే.

Related Posts