తారాగణం : విజయ్ దేవరకొండ, సమంత, మురళీశర్మ, సచిన్ ఖేద్కర్, లక్ష్మి, రోహిణి, జయరాం, వెన్నెల కిశోర్ తదితరులు
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సంగీతం :హేషమ్ అబ్దుల్ వాహబ్
సినిమాటోగ్రఫీ : మురళి జి
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవి యలమంచిలి
దర్శకత్వం : శివ నిర్వాణ

ఈ మధ్య కాలంలో రిలీజ్ కు ముందే భారీ హైప్ తెచ్చుకున్న సినిమా ఖుషీ. విజయ్ దేవరకొండ, సమంత పెయిర్ కే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్కొక్కటిగా వచ్చిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ అనిపించుకుని అంచనాలు పెంచాయి. టీజర్, ట్రైలర్ తో మరింత ఇంప్రెస్ చేసిన ఈ మూవీ అంచనాలు పెంచింది. బిజినెస్ పరంగానూ మంచి రేట్స్ వచ్చాయి. ఓవరాల్ గా దర్శకుడు, హీరో, హీరోయిన్ల గత ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్టింగ్ నుంచి రిలీజ్ వరకూ కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ తో కనిపించిన ఈ మూవీ విడుదలైంది. మరి అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం.

కథ :
విప్లవ్(విజయ్ దేవరకొండ) బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్. కావాలని పట్టుబట్టి కశ్మీర్ లో పోస్టింగ్ వేయించుకుంటాడు. అక్కడ తను ఊహించిన అందాలకంటే భిన్నమైన అనుభవాలు చూస్తాడు. అక్కడే అతను ఆరా బేగమ్(సమంత)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తను పాకిస్తాన్ నుంచి తన తప్పిపోయిన తన తమ్ముడిని వెదుక్కుంటూ వచ్చానని అబద్ధం చెబుతుంది. ఆమె ప్రేమను గెలిచేందుకు లేని ఆ తమ్ముడిని నిజాయితీగా వెదుకుతున్న అతన్ని చూసి తనూ ప్రేమలో పడుతుంది. కానీ చెప్పదు. చివరికి తను బేగమ్ కాదు. ఆరాధ్య అని.. బ్రాహ్మణుల అమ్మాయిని అని చెబుతుంది. అయినా ప్రేమించుకున్నాక పెళ్లే కదా అనుకుంటే అక్కడే వారికి ఇద్దరి తండ్రుల రూపంలో ఓ పెద్ద సమస్య వస్తుంది. అదేంటీ.. వీళ్లు పెళ్లి చేసుకున్నారా.. వారి వైవాహిక జీవితం ఎలా సాగింది అనేది మిగతా కథ.

ఎలా ఉంది.

నిజానికి ఈ కథంతా ట్రైలర్ లోనే చెప్పాడు దర్శకుడు శివ నిర్వాణ. ప్రేమించుకున్న ఇద్దరు పెద్దలను ఎదురించి, పెళ్లి చేసుకోవడం తర్వాత మనస్ఫర్థలు రావడం అనే పాయింట్స్ అన్నీ ట్రైలర్ లోనే ఉన్నాయి. ఇలా కథంతా ట్రైలర్ లో చెప్పిన తర్వాత సినిమా మొత్తం ఆసక్తికరంగా చెప్పడం స్క్రిప్ట్ మీద సాము లాంటిది. ఆ విషయంలో శివ నిర్వాణ పాస్ మార్క్ లు కొట్టేశాడు. మూఢనమ్మకం, భక్తి, హేతువాదం అనే సున్నితమైన అంశాలను కథలో జొప్పించి జనరంజకంగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అదే టైమ్ లో మతం, హేతువాదంలో ఏ స్టాండ్ తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిల్లో సులువుగానే ఊహించొచ్చు. అయినా ఆకట్టుకునేలానే చెప్పాడు.


పెళ్లి తర్వాత బంధం నిలబడాలంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఒకరికోసం ఒకరు అనుకుంటేనే సాధ్యం అవుతుందన్న విషయం చెప్పడానికే ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో తొలి సగం ప్రేమకథ, పెద్దలు నో చెప్పడం, ఇంట్లో నుంచి బయటకు రావడంతో ముగిసిపోతుంది. మలి సగంలో వీరి మధ్య అనుబంధం, పిల్లల కోసం పడే తాపత్రయం, ఆ సందర్భంగా వచ్చే మనస్ఫర్థలు, తగాదాలు, విడిపోవడం వంటి అంశాలు కనిపిస్తాయి. నిజానికి ఇదేమంత కొత్త కథ కాదు. కానీ ఎంచుకున్న నేపథ్యం కొత్తగా ఉంది. కాంబినేషన్ ఫ్రెష్ గా ఉంది. అందుకే సులువుగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వాళ్లు, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నవాళ్లు ఈ సినిమాను చూడాలి. కొన్ని సమస్యలు వచ్చిన ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో నేర్చుకోవాలి. అందుకోసం దర్శకుడు థామస్, జోయా పాత్రలను బలంగా వాడుకున్నాడు. అదే టైమ్ లో అంత స్ట్రాంగ్ సీన్ తర్వాత సమంత వెళ్లిపోవడం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా కాస్త నత్త నడకన సాగుతుంది. క్లైమాక్స్ ఊహించగలిగేలానే ఉంది. ఆఖర్లో బ్రహ్మానందం సీన్ ఫన్నీగా ఉంది.


ఓవరాల్ గా చూస్తే కొత్త కథ కాకపోయినా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు శివ నిర్వాణ. ఇలాంటి కథలు ఎప్పుడు వచ్చినా బోర్ కొట్టవు. అదీ కాక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి.. ఖచ్చితంగా చూసేయొచ్చు.
నటన పరంగా విజయ్, సమంత ఇద్దరూ పోటీ పడి నటించారు. ఇద్దరూ ది బెస్ట్ యాక్టింగ్ చూపించారు. వెన్నెల కిశోర్ ది కమెడియన్ పాత్ర కాదు. అయినా అలరించాడు. రాహుల్ రామకృష్ణ కూడా కమెడియన్ కాదు. హీరో ఫ్రెండ్ అంతే. వీరి తర్వాత బాగా ఆకట్టుకున్న పాత్రలు రోహిణి, జయరాం. థామస్, జోయాలుగా వీరి ప్రెజెన్స్ తో పాటు సీన్స్ సినిమాకు ఎసెట్ గా నిలిచాయి. హేతువాద సంఘం అధ్యక్షుడుగా లెనిన్ సత్యం పాత్రలో సచిన్ ఖేద్కర్, ప్రవచనాలు చెప్పే చదరంగం శ్రీనివాసరావు పాత్రలో మురళీ శర్మ బెస్ట్అవుట్ పుట్ నే ఇచ్చారు. అలీ దేశముదురు తరహా పాత్రలో ఒక్క సీన్ లో మెరిశాడు. ఇక శతృ, శరణ్య ప్రదీప్, శరణ్య పొన్ వణ్నన్, తదితరులు ఓకే.

టెక్నికల్ గా ఈ చిత్రానికి ముందు నుంచి వెన్నెముకగా నిలిచింది మ్యూజిక్. పాటలతో అంచానలు పెంచిన హేషమ్.. రీ రికార్డింగ్ తోనూ ఆకట్టుకున్నాడు. అతనే ఈ సినిమాకు మరో హీరో. సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్ గా ఉంది. కశ్మీర్ ను బాగా చూపిచాడు సినిమాటోగ్రాఫర్ మురళి. జి. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లోనూ కొన్ని సీన్స్ తీసేయొచ్చు. వీటివల్ల సాగదీసిన భావన కలుగుతుంది. కాస్ట్యూమ్స్ చాలా బావున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ కాస్ట్యూమ్స్. ఆర్ట్ వర్క్ బావుంది. మైత్రీ బ్యానర్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా రిచ్ గా ఉంది. డైరెక్షన్ పరంగా శివ నిర్వాణ టైప్ ఎమోషన్స్ తగ్గినట్టు కనిపించినా.. ఈ చిత్రానికి ఈ డోస్ సరిపోతుంది అనిపిస్తుంది. పాటల్లో సాహిత్యం బానే ఉన్నా.. మాటల్లో మెరుపులేం లేవు. పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అతను ఇంకాస్త కొత్త కథలూ ట్రై చేస్తే ఇంకా బావుంటుంది.

ప్లస్ పాయింట్స్ :
లవ్ స్టోరీ
విజయ్ దేవరకొండ, సమంత
సంగీతం
సినిమాటోగ్రఫీ
సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్
కామెడీ
ప్రీ క్లైమాక్స్

ఫైనల్ గా : ఫ్యామిలీ ఆడియన్స్ కు ఖుషీ గ్యారెంటీ

రేటింగ్ : 3/5

                                    - బాబురావు కామళ్ల

Related Posts