‘మంజుమ్మల్ బాయ్స్’ రివ్యూ

నటీనటులు: షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ తదితరులు
సినిమాటోగ్రఫి: షైజు ఖలీద్
సంగీతం: సుశీన్ శ్యామ్
ఎడిటింగ్‌: వివేక్ హర్షన్
నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని
దర్శకత్వం: చిదంబరం
విడుదల తేది: ఏప్రిల్ 06, 2024

తెలుగులో అనువాద చిత్రాలు కొత్తేమీ కాదు. కంటెంట్ బాగుంటే వాటిని తెలుగు ప్రేక్షకులు స్ట్రెయిట్ మూవీస్ కి దీటుగా ఆదరించిన దాఖలాలున్నాయి. ఎక్కువగా తమిళం నుంచి అనువాద సినిమాలు తెలుగులోకి వస్తుంటాయి. ఈమధ్య మలయాళం నుంచి తెలుగులోకి వస్తోన్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. ‘ప్రేమలు’ విజయం తర్వాత మలయాళం నుంచి తెలుగులోకి వచ్చిన మరో సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’. మలయాళం చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటోంది? ‘మంజుమ్మల్ బాయ్స్’ ఎలా ఉంది? ఈ సమీక్షలో చూద్దాం.

క‌థ‌:
సర్వైవల్ థ్రిల్లర్.. ఈ జోనర్ హాలీవుడ్ సినీ లవర్స్ కి బాగా సుపరిచితం. అయితే.. ఇండియాలో ఇలాంటి జోనర్ లో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు అలాంటి సర్వైవల్ జోనర్ లో వచ్చిన సినిమాయే ‘మంజుమ్మల్ బాయ్స్’. కథ విషయానికొస్తే.. కేరళ నుంచి కొంతమంది గ్యాంగ్ కొడైకెనాల్ వెకేషన్ కి వెళ్తారు. అయితే.. ఆ ట్రిప్ పై అంతగా ఆసక్తి చూపించని సుభాష్ (శ్రీనాథ్ భాసి)ని ఒప్పించి వెకేషన్ కి తీసుకెళ్తాడు కుట్టన్ (షౌబిన్ షాహిర్). కొడైకెనాల్ లో వాళ్లందరూ డెడ్లీయెస్ట్ గుణ కేవ్ కి వెళ్తారు. ఆ లోయలో పడ్డవాళ్లెవరూ ప్రాణాలతో బయటపడరు అనే హెచ్చరిక అక్కడ ఉంటుంది. కానీ.. మంజుమ్మల్ బాయ్స్ అక్కడ సెక్యూరిటీ కళ్లు గప్పి గుణ కేవ్స్ లోకి వెళతారు. యాక్సిడెంటల్ గా సుభాష్ ఆ లోయలోకి పడిపోతాడు. మరి.. సుభాష్ ని మిగతా గ్యాంగ్ రక్షించగలిగారా? లేదా? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:
చిన్న‌చిత‌కా ఉద్యోగాలు చేసుకుంటూ సరదాగా ఉండే మిత్రులంతా కలిసి వెకేషన్ కి వెళ్లడం.. అక్కడ వారు గడిపే అద్భుతమైన క్షణాలు, సరదాలు అన్నీ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా ఇలాంటి సన్నివేశాలతో సినిమా ఆహ్లాదంగా సాగుతుంది. సెకండాఫ్ నుంచి సర్వైవల్ జోనర్ లోకి వెళుతుంది.

సుభాష్ లోయ‌లో ప‌డిన త‌ర్వాత సినిమా మొత్తం ఎమోష‌న‌ల్ వైపు ట‌ర్న్ తీసుకుంటుంది. పోలీసుల‌తో పాటు అక్కడ స్థానికులు కూడా ఏమీ చేయలేమని చేతులెత్తేయడంతో.. మంజుమ్మల్ బాయ్స్ తమ ప్రాణాలకు తెగించి స్నేహితుడి కోసం ఎలాంటి సాహసాలు చేశారన్నది ద్వితియార్థంలో చాలా బాగా చూపించాడు డైరెక్టర్ చిదంబరం. మలయాళం సినిమాలు అంటే ఎంతో సహజసిద్ధంగా ఉంటాయి. ‘మంజుమ్మల్ బాయ్స్’ దానికి ఒక ఎగ్జాంఫుల్. తమ స్నేహితుడిని కాపాడ‌టం కోసం వారు త‌పించే సన్నివేశాలలో భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.

మిత్రులందరి చిన్నప్పటి సన్నివేశాలను.. లోయలో ఇన్సిడెంట్స్ కి లింక్ పెడుతూ తీర్చిదిద్దిన స్క్రీన్ ప్లే తీరు ఆకట్టుకుంటుంది. అయితే.. తమ మిత్రుడిని కాపాడటం కోసం మంజుమ్మల్ బాయ్స్ అంత చేస్తున్నా.. పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నట్టుగా చూపించడం కాస్త సత్యదూరంగా అనిపిస్తుంది. అలాగే.. కొన్ని సన్నివేశాలు లాజిక్ కి దూరంగా ఉండటం సినిమాటిక్ లిబర్టీ అనుకోవాలి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
న‌టీన‌టుల విషయానికొస్తే.. అనువాద సినిమాలతో తెలుగు వారికి కాస్త పరిచయం ఉన్న నటుడంటే షౌబిన్ షాహిర్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో కుట్టన్ పాత్రలో షౌబిన్ అదరగొట్టాడు. ఇక.. లోయలో పడిన సుభాష్ గా శ్రీనాథ్ భాసి తన పాత్రలో ఎంతో సంఘర్షణను చూపించాడు. మిగతా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనే కంటే వాళ్లు కూడా ఈ సినిమాలో హీరోలే అని చెప్పాలి. ప్రతీ ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారు. ముఖ్యంగా.. ఆ పాత్రల్లో వాళ్లు కనిపించలేదు.. వారి క్యారెక్టర్సే కనిపిస్తాయి.

టెక్నికల్ గా చెప్పుకోవాలంటే ‘మంజుమ్మల్ బాయ్స్’కి మంచి సపోర్ట్ సినిమాటోగ్రఫీ, బి.జి.ఎమ్.. కమల్ హాసన్ కల్ట్ మూవీ ‘గుణ’ రిఫరెన్సెస్ ను ఈ సినిమాకోసం అద్భుతంగా వాడుకున్నాడు డైరెక్టర్ చిదంబరం. ముఖ్యంగా.. ‘గుణ’ సినిమాలోని ‘కమ్మని ఈ ప్రేమ లేఖనే’ పాటను సందర్భోచితంగా వాడుకున్న తీరు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. షైజు ఖలీద్ విజువల్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి.

చివరగా
ఒక సినిమా హిట్టయ్యిందంటే ఆ చిత్రానికి సంబంధించిన నేటివిటీ కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మన కథనే వెండితెరపై చూస్తున్నామనే భావన అందుకు కారణం. ‘మంజుమ్మల్ బాయ్స్’ కేరళ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపవడం వెనుక అలాంటి నేటివిటీ కలిసొచ్చింది. మరి.. ఇలాంటి యూనివర్శల్ పాయింట్ మిగతా ప్రాంతాల వారికి కూడా కనెక్ట్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ అలా కనెక్ట్ అయితే.. తెలుగులో కూడా ‘మంజుమ్మల్ బాయ్స్’ దుమ్మురేపడం ఖాయం.

Related Posts