కింగ్ ఆఫ్‌ కొత్తా


తారాగణం : దుల్కర్ సాల్మన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కళ్లారక్కల్, ప్రసన్న, గోకుల్ సురేష్‌, అనికా సురేంద్రన్, చెంబన్ వినోద్ జోష్‌, నైలా ఉష తదితరులు
ఎడిటింగ్: ఉమా శంకర్ సప్తపతి
సంగీతం: జేక్స్ బెజోయ్, షాన్ రెహ్మాన్( పాటలు)
నేపథ్య సంగీతం: జేక్స్ బెజోయ్
సినిమాటోగ్రఫీ: నైమిష్ రవి
నిర్మాతలు:దుల్కర్ సాల్మన్, జీస్టూడియోస్
దర్శకత్వం: అభిలాష్ జోషీ

దుల్కర్ సాల్మన్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. మళయాలంలో స్టార్ హీరోగా వెలుగుతున్నా.. ఇతర భాషల్లో మంచి కథలు వుంటే వెంటనే చేస్తున్నాడు. ఇప్పటికే మాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. అదే విధంగా మళయాలంలో రూపొందే తన సినిమాలను కూడా ఇతర భాషల్లో డబ్ చేస్తున్నారు. అతని కొత్త సినిమా కింగ్ ఆఫ్‌ కొత్త. అభిలాష్ జోషీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిర్మాత కూడా దుల్కరే కావడం విశేషం. మరి ఈ గురువారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ
రాజు(దుల్కర్) తండ్రి ఒకప్పటి రౌడీ. అతనిలాగే తనూ రౌడీ కావాలని చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుతాడు. అది నచ్చని రాజు తల్లి అతనితో మాట్లాడటం మానేస్తుంది. దీంతో వీధుల్లో ఉంటున్న అతన్ని కన్నా(షబిర్ కళ్లారక్కల్) తల్లి చేరదీస్తుంది. అలా చిన్నప్పటి నుంచి ఇద్దరూ ప్రాణ స్నేహితులవుతారు. కన్నా కోసం తండ్రిని కూడా కొట్టేందుకు వెళతాడు రాజు. ఆ రౌడీయిజంతో కొత్త అనే టౌన్ కు తనే పెద్ద కింగ్ అవుతాడు. గ్యాంగ్ స్టర్ గా అన్నీ తన కంట్రోల్ లోనే ఉంటాయి. లా అండ్ ఆర్డర్ సైతం అతని చేతిలోనే ఉంటుంది. బట్ ఆ ఊరిలో గంజాయి, మాదక ద్రవ్యాలు వంటివి లేకుండా చేస్తాడు. అందుకు కారణం తను ప్రేమించిన తార (ఐశ్వర్య లక్ష్మి). తార తమ్ముడు డ్రగ్స్ వల్ల చనిపోతాడు. దీంతో ఆమె డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటుంది. ఆమెకు సాయంగా టౌన్ మొత్తం డ్రగ్స్ లేకుండా చేస్తాడు రాజు. ఓ రోజు ప్రత్యర్థులు రాజుకు కొన్ని ఫోటోస్ పంపిస్తారు. అందులో తార వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి ఆవేశంగా వెళ్లి వారిని కొడతాడు. అప్పుడు తార తనకు రాజు అంటే ఇష్టం లేదని చెబుతుంది. అన్ని రోజులు అబద్ధం ఆడినందుకు అసహ్యించుకుని దేవదాస్ అయిపోతాడు. ఇదే అదనుగా అప్పటికే రాజు చైర్ పై కన్నేసిన కన్నా ఆ ఊరికి డ్రగ్స్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. వద్దని వారించిన రాజుపైనే హత్యాయత్నం చేయిస్తాడు. అటు ప్రేయసి, ఇటు స్నేహితుడు చేసిన మోసం నుంచి కోలుకోలేక తల్లి మాట విని ఊరు విడిచి వెళ్లిపోతాడు. అలా వెళ్లిన అతనికి పదేళ్ల తర్వాత తిరిగి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి ఈ పదేళ్లూ ఎక్కడ ఉన్నాడు. మళ్లీ వెనక్కి రావాల్సిన అవసరం ఏంటీ..? తార ఏమైంది..? ఆ కొత్త ప్రాంతాన్ని అన్నేళ్లూ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది మిగతా కథ.

ఎలా ఉంది..

కింగ్ ఆఫ్ కొత్త.. టైటిల్ లో ఉన్న కొత్తదనం కథ, కథనాల్లో మచ్చుకు కూడా లేదు. ఏ సన్నివేశమూ ఆకట్టుకోదు. కథా గమనం 1986 – 1998ల మధ్య జరిగినట్టుగా చూపించారు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ సినిమా కథ కూడా ఆ కాలం నాటిదే. అందుకే ఆల్రెడీ ఎన్నోసార్లు చూసి ఉన్న ఫీలింగ్ వస్తుంది. పైగా కొన్నాళ్ల క్రితం తెలుగులోనే వచ్చిన మహా సముద్రంను పోలిన సన్నివేశాలున్నాయి. మహా సముద్రం డిజాస్టర్. కాబట్టి ఈ కథ ఎలా ఉందో ఊహించొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా రాజు ఎలివేషన్స్, అతనెంత తోపు అనేదే సరిపోయింది. పైగా డ్రగ్స్ ను పారదోలిన ప్రతి సీన్ లోనూ రాజు మందులో మునిగితేలుతుంటాడు. ఎవడ్నో ఒకడిని కొట్టడం, మందేయడం, చిందేయడం.. దీనికి తోడు మన ఆడియన్స్ కు అస్సలు కనెక్ట్ కాని ఫుట్ బాల్ మ్యాచ్ లు. ప్రేమలో ఫెయిల్ కావడం, స్నేహితుడు ద్రోహం చేయడం వంటి సన్నివేశాలు, కథలు.. ఇప్పటికే వందల సినిమాల్లో చూసి ఉన్నాం. అందుకే నెక్ట్స్ సీన్ ఏంటనేది ఇట్టే పట్టేయగలం. ఇక సెకండ్ హాఫ్‌ మొదటి 20 నిమిషాలు ఓకే అనిపిస్తుంది. ఆ తర్వాత పూర్తిగా గాడి తప్పుతుంది కథనం. ముఖ్యంగా విపరీతమైన ల్యాగ్ ఉందీ సినిమాలో. అరంగట ముందే అయిపోయినా ఇబ్బంది లేని సినిమాను చివరి అరగంట వరకూ సాగదీయడంతో మరింత బోరింగ్ గా అనిపిస్తుంది.


కథలో ప్రధానమైన లోపం ఏంటంటే.. బలమైన విలన్ లేడు. ఉన్న విలన్ ఆల్రెడీ హీరో కింద పనిచేసిన వాడు. అతనంటే అనుక్షణం భయపడేవాడు. అలాంటి వాడిని ఎదుర్కొనేందుకు హీరో ఎంతో సేపు ఎదురుచూడటం.. అతని ట్రాప్ లో పడిపోవడం సిల్లీగా ఉన్నాయి. కొత్త ప్రాంతం నుంచి ఉత్తర ప్రదేశ్ వెళ్లి మద్రాసీగా అక్కడి ప్రభుత్వాన్ని హడలెత్తించినట్టు చూపిస్తాడు. ఒక దశలో కత్తులతో చంపడంపై బోర్ కొట్టి చేతులు, పెన్నులు, పిన్నులతో కూడా చంపడంలో ఆనందాన్ని వెదుక్కునేంత క్రూరత్వం సంతరించుకున్న రాజు.. తన కుటుంబానికి అన్యాయం చేశాడని తెలిసినా.. కన్నా పట్ల అంత ఉదాసీనంగా ఉండటం.. దానికి పాత స్నేహం తాలూకూ జ్ఞాపకాలు ముడిపెట్టడం అస్సలు అతకలేదు. అత్యంత కృతకంగానూ ఉన్నాయి. ఇక రాజును చంపేందుకు అతని తలపై కొట్టి తన చోటికి తీసుకువచ్చిన కన్నన్ అతన్ని ఓ మంచానికి కట్టేసి సంభాషణలు చేయడం చూస్తే అస్సలు నవ్వాపుకోలేం. దర్శకుడు మరీ ఇంత అవుట్ డేటెడ్ గా ఆలోచిస్తే దానికి దుల్కర్ ఎలా యాక్సెప్ట్ చేశాడా అని జాలి పడతాం కూడా. ఓవరాల్ గా మనది కాని నేపథ్యం, మనం ఎన్నో సినిమాల్లో చూసిన కథ, కథనాలు, సహనానికి టెస్ట్ మ్యాచ్ పెట్టే ల్యాగ్ లు, పండని సెంటిమెంట్, ఎగ్జైట్ చేయని యాక్షన్, కనిపించని కామెడీ వెరసి కింగ్ ఆఫ్‌ కొత్త ఒక పాత చింతకాయ పచ్చడి.


నటన పరంగా దుల్కర్ కథలో దమ్ము లేకపోయినా తన ప్రెజెన్స్ తో ఒక అటెన్షన్ క్రియేట్ చేయగలిగాడు. తన వరకూ అద్భుతంగా నటించాడు. తర్వాత కొన్నాళ్ల క్రితం తమిళ్ లో వచ్చిన సారపట్టై పరంపర అనే చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్ అనే పాత్రలో అదరగొట్టిన షబీర్ కళ్లారక్కల్ గొప్పగా నటించాడు. మిగతా పాత్రల్లో ప్రసన్న, అనిక, ఐశ్వర్య లక్ష్మీ, చెంబన్ వినోద్ తదితరులంతా ఓకే అనిపించేశారు.

టెక్నికల్ గా ఈ మూవీకి బ్యాక్ బోన్ నేపథ్య సంగీతం. కొంతలో కొంతైనా చూడగలుగుతాం అంటే అది కేవలం జేక్స్ బెజోయ్ అందించిన నేపథ్య సంగీతం వల్లే. హీరో ఎలివేషన్స్ కోసం అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు. బట్ పాటలు అసలు బాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఆ కాలం నాటి మూడ్ క్రియట్ అయ్యేలా లైటింగ్స్ అవీ బాగా సెట్ చేసుకున్నాడు. ఎడిటింగ్ వరస్ట్. సెట్స్, ఆర్ట్ వర్క్, డైలాగ్స్ బావున్నాయి. దర్శకుడి గురించి చెప్పడానికి ఏం లేదు. అతను అవుట్ డేటెడ్ థాట్స్ తో ఉన్నాడు. అలాంటి ఆలోచన గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం.

ప్లస్ పాయింట్స్
దుల్కర్ సాల్మన్
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ
ఆర్ట్ వర్క్, సెట్స్

మైనస్ పాయింట్స్
కథ, కథనం
ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ
దర్శకత్వం
ఎడిటింగ్

ఫైనల్ గా: కొత్తదనమే లేని అవుట్ డేటెడ్ కింగ్

రేటింగ్: 2/5

                                    - బాబురావు. కామళ్ల

Related Posts