అన్నపూర్ణ ఫోటో స్టూడియో


తారాగణం : చైతన్య రావు, లావణ్య, లలిత్ ఆదిత్య, మిహిర, వైవా రాఘవ, యశ్ రంగినేని తదితరులు
ఎడిటింగ్ : డి వెంకట ప్రభు
సంగీతం : ప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రఫీ : పంకజ్ తొట్టాడ
నిర్మాత : యశ్ రంగినేని
దర్శకత్వం : చెందు ముద్దు
రిలీజ్ డేట్ : 21.07.2023

ఈ మధ్య తెలుగులో చాలా పీరియాడిక్ మూవీస్ వస్తున్నాయి. కథా నేపథ్యం గతంలోకి వెళ్లడంతో ఆ కాలపు పరిస్థితులు మళ్లీ కనిపిస్తాయి. ఇప్పటి ప్రేక్షకులకు ఇదో కొత్త అనుభూతి ఉంటుంది. అలాగేఇప్పుడన్న ఫెసిలిటీస్ అప్పుడు ఉండవు కాబట్టి.. కథలకూ కొన్ని విధాలుగా కలిసొస్తుంది. అన్నపూర్ణ ఫోటో స్టూడియో.. ఇచ్చట ఫోటోలు అందంగా తీయబడును అనే సినిమా కూడా అలాంటిదే. టైటిల్ నుంచి ట్రైలర్ వరకూ ఇంప్రెస్ చేయగలిగింది ఈ టీమ్. పైగా పెళ్లి చూపులు, దొరసాని వంటి చిత్రాలతో అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న యశ్ రంగినేని నిర్మించడంతో ఈ మూవీపై కొంత వరకూ ఆసక్తి కలిగింది. మరి ఈ శుక్రవారం విడుదలైన అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఎలా ఉందో చూద్దాం..

కథ:
గోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురం గ్రామంలో చంటి(చైతన్యరావు) అనే వ్యక్తి అన్నపూర్ణ అనే ఫోటో స్టూడియో నడుపుతుంటాడు.ఎంతో ఆస్తి ఉన్నా.. సొంత కాళ్లపై నిలబడాలని తండ్రికి ఇష్టం లేకపోయినా ఆ పనిచేస్తుంటాడు. అతనికి ఓ పదిమంది ఫ్రెండ్స్ ఉంటారు. చంటికి వయసు ముదిరిపోయినా.. పెళ్లి కాదు. కాస్త లేట్ వయసులో తన చెల్లి క్లాస్ మేట్ ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. అంతా బావుంది అనుకున్న టైమ్ లో అతని తండ్రి ద్వారా అతనికి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదే సమయంలో తను బలవంతంగా ఓ హత్య చేయాల్సి వస్తుంది.. మరి అతనికి వచ్చిన సమస్యేంటీ..? హత్య చేయడానికి కారణాలేంటీ..? నిజంగా అతను హత్య చేశాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ :
అన్నపూర్ణ ఫోటో స్టూడియో 1980ల కాలంలో సాగే కథ. అందుకు తగ్గట్టుగా ఎంచుకున్న ఊరు, నేపథ్యం బావుంది. ఇక ఈ కథలో ప్రధాన పాత్ర పోషించేది ఓ చిన్న కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ చుట్టూ రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను తిప్పాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు కొన్ని బాగా నవ్విస్తాయి. కానీ అసలు పాయింట్ లో మాత్రం అంత పస లేదు. ఈ చిన్న పాయింట్ కోసం ఇంత కథ(నం)నడపాలా అనిపిస్తుంది. ఇక ఏజ్ బార్ వ్యక్తిగా చైతన్యరావుపై వచ్చే సీన్స్, అతనిపై పడే సెటైర్స్ నవ్విస్తాయి. ముఖ్యంగా అతను ప్రేమించిన అమ్మాయి తండ్రే అతన్ని వేరే కుర్రాడితో అంకుల్ అని పిలిపించినప్పుడు అతని బాధ వర్ణనాతీతం. అలాగే అతని క్లాస్ మేట్ పెళ్లీడుకు వచ్చిన తన కూతురును తీసుకుని ఓ ఫంక్షన్ కు వచ్చి నీ కొడుక్కి నా కూతురును ఇస్తా అన్నప్పుడు నవ్వాపుకోలేం. ఇలాంటి సీన్స్ కొన్ని ఉన్నాయి. కానీ ఈ సినిమాలో ప్రధాన లోపం.. ఒక సినిమాకు కావాల్సిన దాని కన్నా ఎక్కువ సన్నివేశాలున్నాయి. ఒకే ఊరిలో కథ జరుగుతున్నప్పుడు ఇవన్నీ రిపీటెడ్ గా అనిపిస్తాయి. ప్రధానంగా ఫ్రెండ్స్ లో కలిపి వచ్చే సీన్స్ లెక్కకు మించి ఉన్నాయి.


కథానాయకుడు ఆత్మహత్య చేసుకోవడం నుంచి కథ మొదలవుతుంది. కొండమీద నుంచి దూకిన అతను సరాసరి వెళ్లి పోలీస్ జీప్ పై పడటంతోవాళ్లు వెంటనే హాస్పిటల్ లో చేరుస్తారు. అతని సూసైడ్ నోట్(ఒక పుస్తకంలా ఉంటుంది) పోలీస్ లు చదవడం మొదలుపెట్టినప్పుడు.. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేకంటే తను ప్రేమించిన అమ్మాయిని చంపాలనుకున్న విషయం, తన చెల్లినే ప్రేమించిన బెస్ట్ ఫ్రెండ్ ను చంపాలనుకున్న విషయం, ఆ బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి అంతకు ముందే ఒక వ్యక్తిని చంపిన విషయంతో పాటు తమ ఇంటికి అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిని తను ‘ఖచ్చితంగా’ చంపాల్సిన విషయ గురించి ఆ నోట్ లో ఉంటుంది. ఇలా ఒక్కో హత్య గురించిన ట్విస్ట్స్ అన్నీ చివర్లో రివీల్ అవుతాయి. ఆ రివీల్ అయ్యే క్రమం ఏమంత గొప్పగా లేదు. అలాగని మరీ చప్పగానూ లేదు. కాకపోతే థ్రిల్లర్ అన్నప్పుడు ఆ పదానికి ఒకట్రెండు సార్లైన అర్థం చెప్పే సన్నివేశాలుంటే బావుండేది. ఇందుకు ప్రధాన లోపంగా హీరో క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. అందుకే ఇంకాస్త బెటర్ థ్రిల్లర్ అయ్యే అవకాశాలున్న ఈ ఫోటో స్టూడియో సాధారణ సినిమాగా ఆగిపోయింది.


చిన్న గ్రామంలో చిన్న ఘటన జరిగితేనే పెద్దగా కనిపిస్తుంది. అలాంటిది ఓ వ్యక్తిని చంపితే ఎవరూ పట్టించుకోకపోవడం వింతగా అనిపిస్తుంది. ఇలాంటి లూప్ హోల్స్ సినిమాలో చాలా ఉన్నాయి. కేవలం వీళ్లు ఎంచుకున్న ఆర్టిస్టులు తప్ప గ్రామస్తులు ఎవరూ కనిపించరు. కారణం.. వీళ్లు ఎంచుకున్న పీరియాడిక్ బ్యాక్ డ్రాప్.కథ జరుగుతున్నది ఊరిలోనే అయినా ఆ ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ రాదు. ఇక ట్విస్ట్ లు రివీల్ అయ్యే తీరు తుస్సుమనిపించాడు దర్శకుడు. అయినా ఈ సినిమా ఒకప్పటి రేలంగి నర్సింహారావు తరహాలో అక్కడక్కడా ఎంటర్టైన్ చేస్తుంది.


నటన పరంగా చైతన్య రావు తన 30వెడ్స్ 21 ఇమేజ్ నే కంటిన్యూ చేశాడు. అమాయకత్వం, నిజాయితీ ఉన్న ‘వ్యక్తి’గా బాగా నటించాడు.హీరోయిన్ లావణ్య చాలా సహజంగా ఉంది. నటన కూడా బావుంది. ఇతర పాత్రల్లో అంతా బానే చేశారు.

టెక్నికల్ గా సంగీతం హైలెట్ గా నిలిచింది. రెండు మూడు పాటలు బావున్నాయి. నేపథ్యం సంగీతం బావుంది. ఎడిటింగ్ పరంగా చాలా పని వదిలేసినట్టు కనిపిస్తుంది. ఆ కాలానికి తగ్గట్టుగా మంచి సినిమాటోగ్రఫీ ఉంది. కొన్ని విజువల్స్ ను బాగా క్యాప్చర్ చేశారు. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కథ స్థాయికి మించి కనిపించాయి. దర్శకుడు చెందు ముద్దు ఎంచుకున్న థీమ్ బావుంది. కానీ దాన్ని ప్రభావవంతంగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు అనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్

కామెడీ సీన్స్
పాటలు
చైతన్యరావు, లావణ్య లవ్ సీన్స్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

నిడివి
సాగదీత సన్నివేశాలు
ఎడిటింగ్
క్లైమాక్స్

ఫైనల్ గా : అక్కడక్కడా నవ్వించబడును

రేటింగ్ : 2.5/5

                                        - బాబురావు. కామళ్ల

Related Posts