ఈ కన్నడ సినిమానూ డబ్ చేస్తారా

కన్నడ సినిమాలో ఒక కొత్త మార్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు శెట్టి బ్రదర్స్. కొన్నాళ్లుగా వీళ్లు చేస్తోన్న సినిమాలు శాండల్ వుడ్ కే పాఠాలు నేర్పిస్తున్నాయి. వాళ్లెవరో కాదు.. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి.. చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి. వీరితో పాటు ఇప్పటి వరకూ మనకు పెద్దగా తెలియని రాజ్ బి శెట్టి.

నిజానికి ఈ ఇద్దరి వెనక ఉన్నదే ఇతను. రాజ్ బి శెట్టి మంచి రైటర్. మేకర్. రిషబ్ తో కలిసి అతను ఇంతకు ముందు చేసిన గరుడగమనవృషభవాహన అనే సినిమా మేకింగ్ పరంగా మెస్మరైజ్ చేస్తుంది. టేకింగ్ లోనూ సరికొత్తగా కనిపిస్తుంది. ఇక రిషబ్ శెట్టిని తెలుగువారికి ఫేవరెట్ చేసిన కాంతార ఐడియా కూడా రాజ్ దే. ఈ మూవీ క్లైమాక్స్ ను డైరెక్ట్ చేసింది కూడా రాజ్ బి శెట్టినే. ఏ సినిమా చేసినా ముగ్గురూ కథలో ఇన్వాల్వ్ అవుతారు అంటారు. బడ్జెట్ తక్కువగా ఉన్నా.. సినిమా పరంగా ఓ రిచ్ నెస్ తో పాటు మేకింగ్ లో ఓ కొత్తదనాన్ని చూపిస్తారు వీళ్లు. అదే కాంతార వంటి ఎపిక్ మూవీకి కారణమైంది.


ఇక లేటెస్ట్ గా రాజ్ బి శెట్టి హీరోగా ఓ కొత్త సినిమా రాబోతోంది. పేరు “టోబి”. ఈ నెల 25న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తే దీనికీ ప్యాన్ ఇండియన్ కలర్ ఉన్నట్టు కనిపిస్తోంది. మాటలు రాని ఓ అమాయకుడు. చేయని నేరానికి బలమైపోతాడు. శిక్షను అనుభవించిన ఆ అమాయకుడు తిరగబడితే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు అనే పాయింట్ తో రూపొందిన ఈ చిత్రానికి కథ రాజ్ బి శెట్టినే అందించాడు.

ఇందులోనూ రెగ్యులర్ హీరో హీరోయిన్, పాటలు వంటి అంశాలు కాకుండా కథకే ప్రాధాన్యం కనిపిస్తోంది. తీసుకున్న పాయింట్ ను డైరెక్ట్ చెబుతూ తనదైన మేకింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.రాజ్ బి శెట్టికి కన్నడలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది.వాళ్లంతా ఈ టోబీ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని కూడా ఇతర భాషల్లో డబ్ చేస్తారేమో చూడాలి.

Related Posts