ఈవారం చిన్న చిత్రాలదే సందడి

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వారం వారం కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. పోయినవారం మహాశివరాత్రి కానుకగా మూడు మీడియం రేంజ్ మూవీస్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక ఈ వారం చిన్న చిత్రాలదే హవా. ఈ శుక్రవారం అంటే మార్చి 15న దాదాపు ఏడు సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన సినిమా ‘వెయ్ దరువెయ్’. ఈ సినిమాలో యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటించారు.
నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన ఈ చిత్రం ఈ వారం రాబోతున్న సినిమాలలో కొంచెం క్రేజున్న మూవీ. ‘వెయ్ దరువెయ్’ సినిమా రెండున్న‌ర గంటల పాటు ప్రేక్షకులకు ప‌క్కా ఎంట‌ర్‌టైన్ మెంట్ అందిస్తుందని చిత్రబృందం కాన్ఫిడెంట్ గా చెబుతుంది.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యుడు యాటా సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రజాకార్‘. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్రజ, మ‌క‌రంద్ దేశ్ పాండే, అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించారు. నిజాం నిరంకుశ పాలనను కళ్లకు కట్టినట్టు చూపించేలా.. ఆ కాలాన్ని ప్రతిబింబిస్తూ సాగే ‘రజాకార్‘ ట్రైలర్ అయితే బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా మార్చి 15న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలకు ముస్తాబవుతోంది.

ఈవారం వస్తోన్న చిత్రాలలో చైతన్య రావు ‘షరతులు వర్తిస్తాయి’, త్రిగున్ హీరోగా నటించిన ‘లైన్ మ్యాన్’, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘తంత్ర’, బిగ్ బాస్ దివి నటించిన ‘లంబసింగి’ కూడా ఉన్నాయి. మరో చిన్న చిత్రం ‘రవికుల రఘురామ’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts