బాక్సాఫీస్ క్లాష్ కి రెడీ అవుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ స్టార్స్?

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్స్ గా అవతరించారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి చేసిన ‘నాటు నాటు’ స్టెప్పులు యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’తో కలిసి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన వీరిద్దరూ ఇప్పుడు విడివిడిగా బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్నారు.

ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర 1’ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలకు ముస్తాబవుతోంది. దసరా బరిలో మొదటిగా విడుదల తేదీ ఖరారు చేసుకున్న బడా మూవీ ఇది. ఆ తర్వాత రజనీకాంత్ ‘వేట్టయాన్’ అక్టోబర్ లోనే విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఈ చిత్రాన్నీ దసరా కానుకగా తీసుకురాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా అక్టోబర్ లోనే వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

‘గేమ్ ఛేంజర్’ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకు రానున్నట్టు తెలిపాడు రామ్ చరణ్. అక్టోబర్ అంటే.. ముందుగా గుర్తొచ్చేది దసరా సీజన్. స్టూడెంట్స్ కి హాలీడేస్ ఉంటాయి కాబట్టి దసరా బరిలోనే తమ చిత్రాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తారు నిర్మాతలు. ‘గేమ్ ఛేంజర్’ని కూడా దసరాకే రిలీజ్ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం. మొత్తంమీద.. ‘ఆర్.ఆర్.ఆర్’తో కలిసి బాక్సాఫీస్ బద్దలుకొట్టిన ఎన్టీఆర్, చరణ్.. ఇప్పుడు విడివిడిగా బాక్సాఫీస్ క్లాష్ కి సిద్ధమవుతున్నారన్నమాట.

Related Posts