‘సలార్ 2’ కోసం సముద్రాన్ని సృష్టించిన ప్రశాంత్ నీల్

రెబెల్ స్టార్ ప్రభాస్ ను మళ్లీ ఫుల్ ఫామ్ లోకి తీసుకొచ్చిన చిత్రం ‘సలార్’. ఈ మూవీలో ప్రభాస్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానానికి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ప్రభాస్ అయితే ‘సలార్’తో మళ్లీ ‘బాహుబలి’లా బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడ్డాడు. సరికొత్త కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టాడు. ‘సలార్ 1’ హిట్ అవ్వడంతో.. ‘సలార్ 2’ ఎప్పుడెప్పుడు మొదలవుతోందా? అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఇక లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం ‘సలార్ 2’ షూటింగ్ సైలెంట్ గా మొదలయిపోయిందట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెట్టాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అలాగే.. ‘సలార్ పార్ట్ 2’ కోసం ఓ సముద్రాన్ని సెట్ రూపంలో వేస్తున్నారట. అంటే.. ఓ పెద్ద స్విమ్మింగ్ పూల్ ని నిర్మించి.. దానిలో కృత్రిమంగా అలలను సృష్టించి.. విజువల్ ఎఫెక్ట్స్ సాయంతో దాన్నే ఓ మహా సముద్రంలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట ప్రశాంత్ నీల్.

ఈ సముద్రం నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ‘సలార్ 2’కి మెయిన్ హైలైట్ అవ్వనున్నాయట. ‘సలార్ 2’కి ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మొదటి భాగానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు రెండో భాగానికి కంటిన్యూ అవుతున్నారు. 2025, ద్వితియార్థంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Posts