నేషనల్ క్రష్ రష్మిక బయోగ్రఫీ

టాలీవుడ్ లో షార్ట్ పీరియడ్ లోనే స్టార్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. శాండల్ వుడ్ నుంచి మొదలై టాలీవుడ్ లో అగ్ర తారగా మారిన రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ దూసుకుపోతుంది. నేషనల్ క్రష్ గా నేషనల్ వైడ్ మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక పుట్టినరోజు ఈరోజు.

ఏప్రిల్ 5, 1996వ సంవత్సరంలో కర్ణాటకలోని విరాజ్ పేటలో జన్మించింది రష్మిక. తల్లిదండ్రులు పేర్లు సుమన్, మదన్ మందన్న. రష్మిక కి ఓ చెల్లెలు ఉంది. రష్మిక హోమ్ టౌన్ లోనే ఆమె తండ్రికి ఓ కాఫీ ఎస్టేట్ ఉంది. రష్మిక కుటుంబం తొలుత ఫైనాన్సియల్ గా చాలా కష్టాలు పడింది. ఇంటి అద్దె కట్టడానికి కూడా ఇబ్బందులు పడేవారట.

రష్మిక గోనికొప్పల్ లోని బోర్డింగ్ స్కూల్ లో చదువుకుంది. చదువుల్లో టాపర్. ఆ తర్వాత బెంగళూరులోని ఎమ్.ఎస్.రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో సైకాలజీ, జర్నలిజమ్, ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ చేసింది. చిన్నప్పటినుంచీ నటనపై మక్కువ ఉండడంతో ఆమె తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ప్రోత్సహించారు.

తొలుత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన రష్మిక.. 2014లో ది టైమ్స్ ఆఫ్ ఇండియాస్ క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అవార్డు అందుకుంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చేతుల మీదుగా ఆ అవార్డు అందుకుంది రష్మిక. ఇక.. 2016లో రష్మిక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ జరిగింది. కన్నడ రొమాంటిక్ డ్రామా ‘కిరిక్ పార్టీ’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ యేడాది కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కిరిక్ పార్టీ’ నిలిచింది. తొలి చిత్రానికే బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా సైమా అవార్డు అందుకుంది.

ఆ తర్వాత వరుసగా కన్నడలో మరో రెండు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఆ చిత్రాలే.. ‘అంజని పుత్ర, చమక్’. చాలా చిన్న వయసులోనే హీరోయిన్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న రష్మిక.. తన తొలి చిత్ర నాయకుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. రష్మిక-రక్షిత్ ఎంగేజ్ మెంట్ గ్రాండ్ లెవెల్ లో జరిగింది. అయితే.. కొన్ని కారణాల వలన వీరి ప్రేమ పెళ్లి వరకూ వెళ్లలేదు.

దీంతో.. కన్నడ సినిమాలను పక్కన పెట్టి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక. 2018లో నాగశౌర్య హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందిన ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ కి వచ్చింది. ఈ సినిమాలో రష్మిక క్యూట్ నెస్ కి తెలుగు కుర్రకారు ఫిదా అయిపోయారు. తెలుగులో తొలి సినిమా ‘ఛలో‘తో హిట్ అందుకున్న రష్మికకు.. రెండో సినిమా ‘గీత గోవిందం‘ బ్లాక్ బస్టర్ అందించింది. చిన్న చిత్రంగా విడుదలైన ‘గీత గోవిందం’ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. ‘గీత గోవిందం’ తర్వాత రష్మికకు తెలుగులో తిరుగులేకుండా పోయింది.

ఆ తర్వాత వరుసగా ‘దేవదాస్, డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలు చేసింది. అయితే.. ఈ రెండు చిత్రాలు అంతగా అలరించకపోయినా.. ఆ తర్వాత వచ్చిన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో సంస్కృతి పాత్రలో రష్మిక పండించిన హ్యూమర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు’ రష్మికకి మెమరబుల్ హిట్ అందించింది.

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న చందంగా.. తెలుగులో బిజీగా ఉంటూనే మరోవైపు మాతృభాష కన్నడలోనూ అడపాదడపా సినిమాలు చేసింది రష్మిక. ఈ లిస్టులో వచ్చినవే ‘యజమాన, పొగరు’ వంటి చిత్రాలు. ఇక.. రష్మిక కోలీవుడ్ డెబ్యూ ‘సుల్తాన్’ ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో మళ్లీ తెలుగులోపైనే తన ఫుల్ ఫోకస్ పెట్టింది. అప్పుడు దక్కిన భారీ విజయాలు ‘భీష్మ, పుష్ప.. ది రైజ్’.

వెంకీ కుడుమల కాంబోలో ‘భీష్మ’తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది రష్మిక. ఈసారి ఈ సినిమాలో నితిన్ తో జోడీ కట్టింది. ఎప్పటిలాగే తన క్యూట్ పెర్ఫామెన్స్ తో ‘భీష్మ’ చిత్రంలో చైత్రగా అదరగొట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’తో శ్రీవల్లిగా పాన్ ఇండియా లెవెల్ లో రష్మిక సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘పుష్ప 1’ విడుదలైన సమయంలో దేశంలోని ఏ మూలకు వెళ్లిన శ్రీవల్లి శ్రీవల్లి అనే నామ జపమే చేసేవారు సినీ లవర్స్. అంతలా ఈ చిత్రంలోని శ్రీవల్లి రోల్.. పాటలు హైలైట్ అయ్యాయి.

‘పుష్ప’ ప్రభావంతో బాలీవుడ్ లోనూ తొలి అడుగులు వేసింది రష్మిక. బీటౌన్ లో ‘గుడ్ బై’ వంటి సినిమాలు చేసింది. అయితే.. తెలుగులో వచ్చినంత గుర్తింపు మాత్రం ఈ చిత్రాలతో హిందీలో సంపాదించుకోలేకపోయింది. మధ్యలో శర్వానంద్ తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’లో ఎక్స్ టెండెడ్ కేమియోలోనూ మురిపించింది. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఆడకపోయినా.. ‘సీతారామం’లో రష్మిక పోషించిన అఫ్రీన్ పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది.

2023వ సంవత్సరం రష్మికకు మెమరబుల్ ఇయర్ అని చెప్పొచ్చు. తమిళంలో విజయ్ నటించిన ‘వరిసు’ హిందీలో చేసిన ‘మిషన్ మజ్ను, ఆనిమల్’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. 2023లో తెలుగులో ఒక్క చిత్రం విడుదల చేయకపోయినా.. ఆ సినిమాల అనువాదాలతో ఇక్కడ ఆడియన్స్ ను కూడా అలరించింది.

ప్రస్తుతం ది మోస్ట్ అవైటింగ్ ‘పుష్ప 2’తో పాటు.. తెలుగు చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’.. తెలుగు-తమిళం బైలింగ్వల్ ‘రెయిన్ బో’, హిందీ సినిమా ‘చావ’ చిత్రాలతో బిజీగా ఉంది రష్మిక. ఇక.. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో రష్మిక మొదటి వరుసలో నిలుస్తుంది. అందుకే.. ఈ కన్నడ కస్తూరిని నేషనల్ క్రష్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. నేషనల్ క్రష్ రష్మిక మునుముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ.. మరోసారి ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతోంది తెలుగు 70 ఎమ్.ఎమ్.

Related Posts