మరోసారి మల్టీస్టారర్ లో మామాఅల్లుళ్లు

కొన్ని కాంబినేషన్స్ కు క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. మళ్లీ మరో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తూంటారు. అలాంటి సూపర్ కాంబినేషన్ వెంకటేష్, నాగచైతన్య. ఈ మేనమామ, మేనల్లుడు కలిసి ఇప్పటికే ‘వెంకీమామ‘లో నటించి అటు అక్కినేని.. ఇటు దగ్గుబాటి అభిమానులను మురిపించారు. ‘వెంకీమామ‘ కంటే ముందే నాగచైతన్య ‘ప్రేమమ్‘లో అతిథిగా అదరగొట్టాడు వెంకటేష్.

ఇప్పుడు మరోసారి వెంకటేష్, నాగచైతన్య కాంబోలో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే వెంకటేష్ కోసం డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక ఈ స్టోరీలో వెంకటేష్ తో పాటు మరో కథానాయకుడికి కూడా స్కోప్ ఉందట. ఆ పాత్రకు నాగచైతన్య ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట సురేందర్ రెడ్డి. దీంతో మరోసారి వెంకటేష్, చైతన్య కాంబోలో మల్టీస్టారర్ కన్ఫమ్ అనే సంకేతాలు అందుతున్నాయి.

ప్రస్తుతం వెంకటేష్ తన ప్రెస్టేజియస్ 75వ చిత్రం ‘సైంధవ్‘తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా టీజర్ రిలీజ్ కు రెడీ అయ్యింది. సంక్రాంతి కానుకగా ‘సైంధవ్‘ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చైతన్య.. చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలా వీరిద్దరి ప్రయర్ కమిట్ మెంట్స్ పూర్తైన తర్వాత సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ అవుతోందట.

Related Posts