సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటాడు. తనదైన నేరేటివ్ స్కిల్స్ తో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుంటాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘జల్సా‘ సినిమాకోసం, ఎన్టీఆర్ ‘బాద్షా‘ కోసం మహేష్ బాబు చెప్పిన వాయిస్ ఓవర్ కి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ కోసం మరోసారి గొంతు సవరించుకోబోతున్నాడట ప్రిన్స్.
‘కల్కి‘ సినిమాలోని ప్రభాస్ విష్ణు అవతారానికి సంబంధించి ఇంట్రో నేరేషన్ ను మహేష్ బాబు చెప్పబోతున్నాడట. అయితే.. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి‘లో ఇప్పటికే భారీ తారాగణం ఉంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి అమితాబ్, దీపిక, దిశా పటాని వంటి వారు నటిస్తున్నారు. యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ కూడా ఈ మూవీలో భాగస్వామ్యమయ్యాడు. ఇంకా.. నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి వారు కూడా ‘కల్కి‘లో నటిస్తున్నారనే ప్రచారం ఉంది. వీరితో పాటు.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడనే న్యూస్ ‘కల్కి‘ చిత్రాన్ని మళ్లీ ట్రెండింగ్ లో నిలిపింది. జూన్ 27న ‘కల్కి‘ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.