విజయ్ డబుల్ ధమాకాతో ‘లియో‘

దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కోలీవుడ్ లో స్టార్ హీరోగా అగ్ర పథాన దూసుకెళ్తున్నాడు విజయ్. కేవలం తమిళంలో మాత్రమే కాదు మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోనూ విజయ్ కి మంచి స్టార్ డమ్ ఉంది. తన కాంటెంపరీరస్ విక్రమ్, సూర్య ల కంటే తెలుగులోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినా విజయ్ అనువాద సినిమాలకు ఇక్కడా మంచి ఆదరణ లభిస్తుంటోంది.

దసరా బరిలో దిగుతోన్న సినిమాలలో ‘లియో‘ కూడా ముందు వరుసలో ఉంది. అందుకు ఒక కారణం విజయ్ అయితే మరో కారణం దర్శకుడు లోకేష్ కనకరాజ్. వీరిద్దరి గత చిత్రం ‘మాస్టర్‘ భారీ విజయాన్ని సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ‘మాస్టర్‘ సృష్టించిన సంచలనం తెలిసిందే. ఈకోవలోనే వీరి కాంబోలో వస్తోన్న ‘లియో‘పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

లేటెస్ట్ గా ‘లియో‘ ట్రైలర్ రిలీజయ్యింది. ‘సీరియల్ కిల్లర్ నడిరోడ్డుమీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు. ఆల్రెడీ రోడ్డు మీద చాలామంది చనిపోయారు. ఈ ఈజ్ నొటోరియస్. వాడు అందరినీ కాలుస్తున్నాడు. అప్పుడు ధైర్యంగా ఒక పోలీసాఫీసర్ సింహంలా వచ్చి ఆ సీరియల్ కిల్లర్ ని తిరిగి కాల్చాడు. పోలీసాఫీసర్ గన్ రీలోడ్ చేసే ఆ గ్యాప్ లో కాల్చాడు. ఇప్పుడు ఆ పోలీసాఫీసర్ గన్ నీ చేతిలో ఉంది. అండ్ యూ హ్యావ్ ఎ క్లీన్ షాట్.‘ విజయ్ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ ను బట్టి విజయ్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది. ‘లియో‘ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నాడు. ‘వాడు ఊరిని మోసం చేయొచ్చు. ఈ లోకాన్ని మోసం చేయొచ్చు కానీ నన్ను మోసం చేయలేడు‘ అంటూ విలన్ గా సంజయ్ దత్ ఎంట్రీ అదిరింది. లాంగ్ గ్యాప్ తర్వాత విజయ్, త్రిష జోడీగా నటించిన సినిమా ఇది. ఇతర కీలక పాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్, మన్సూర్ ఆలీఖాన్, మిస్కిన్ లు కనిపించనున్నారు.ఇక ఎప్పటిలాగే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అనిరుధ్ మరోసారి మాయ చేయబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ‘లియో‘ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.

Related Posts