దర్శక శిఖరం దాసరి నారాయణరావు జయంతి

వ్యక్తికి బహువచనం శక్తి అన్నాడు శ్రీశ్రీ. ఆ మాటలు ఎంత నిజమో దాసరి నారాయణరావును చూస్తే అర్థమౌతుంది. ఓ దిగ్ధర్శకుడిగా తెలుగు చిత్ర సీమపై చెరగని ముద్రవేసిన దాసరి తర్వాత పరిశ్రమకే పెద్ద దిక్కుగా మారారు. స్వయం కృషి, ప్రతిభ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చనని నిరూపించిన దాసరి నారాయణరావు జయంతి ఇవాళ (మే 4).

45ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం.. 151 చిత్రాలకు దర్శకత్వం, 54 సినిమాల నిర్మాణం.. 250 చిత్రాలకు సంభాషణలు.. నటుడిగా ఎన్నో అవార్డులు.. దాసరి నారాయణరావు సినీ జీవితానికి సంబంధించిన కొన్నంటే కొన్ని లెక్కలు ఇవి. అంతే కాదు జర్నలిస్టుగా, పబ్లిషర్ గా, మ్యాగజైన్ ఎడిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, రాజకీయవేత్తగా, కేంద్ర మంత్రిగా అనేక రంగాల్లో రాణించి.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించారు దాసరి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుల నుంచి నటన రాబట్టుకోవడమే కాదు.. స్వయంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

దాసరి దర్శకత్వంలో ఓ సినిమా మొదలయితే చాలు, జనాల్లో ఆసక్తి రేకెత్తేది. ఇక ఆయన సినిమా వచ్చిందంటే చాలు జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆబాలగోపాలాన్ని అలరించే చిత్రాలను రూపొందించి మెప్పించారు దాసరి. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే , నిర్మాణం, దర్శకత్వం ఇలా పలు శాఖల్లో తనదైన బాణీ పలికించిన మేటి .ఇక చిత్రసీమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా.. దాని పరిష్కారానికి దాసరి ముందుండేవారు. ఆపన్నులను ఆదుకోవడానికి దాసరి తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచేవారు. అర్ధరాత్రి ఆయన దగ్గరకు వెళ్ళినా, తగిన న్యాయం జరగుతుందని సినిమా జనం భావించేవారు. అందుకే అసలైన అందరివాడు అంటే దాసరే అని ఈ నాటికీ జనం చెప్పుకుంటున్నారు.

తెలుగు తెరపై దాసరిది ఓ చెరిగిపోని సంతకం. దర్శకుడు అంటే సినిమా క్రూ కు కెప్టెన్ అనేది పాత కాలం మాట. దానిని మళ్ళీ తీసుకువచ్చి, డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ అని చాటిన ఘనుడు . 151 చిత్రాల రూపకల్పనతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన మేటి దర్శకుడు . టాప్ స్టార్స్ మొదలు, అప్ కమింగ్ ఆర్టిస్టులతోనూ చిత్రాలు తెరకెక్కించి ఘనవిజయాలను సొంతం చేసుకున్నారు దాసరి. ఆయన సినిమాల ద్వారానే ఎంతోమంది చిత్రసీమలో స్థిరపడిపోయారు. అందుకే దాసరి నారాయణరావు అంటే తెలుగువారికి ఓ ప్రత్యేకమైన అభిమానం.

Related Posts