డిసెంబర్ ఫస్ట్ వీక్.. ఫుల్ ప్యాక్డ్

వారం వారం కొత్త సినిమాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు సినీ ప్రేమికులు. అయితే.. కొన్ని వారాలు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ థియేటర్లకు క్యూ కడుతుంటాయి. మరికొన్ని వారాలైతే అస్సలు సినిమాలే ఉండవు. కానీ.. ఈమధ్య ఒక్కో వారం అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో అయితే ఈ కాంపిటేషన్ మామూలుగా లేదు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘ఎఫ్3‘ తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన ‘గాండీవధారి అర్జున‘ ఏమాత్రం అలరించలేకపోయింది. దాంతో.. తన ఆశలన్నీ అప్ కమింగ్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్‘పైనే పెట్టుకున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ కి జోడీగా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదలకు ముస్తాబవుతోంది.

డిసెంబర్ 8నే విడుదల తేదీ ఖరారు చేసుకున్న మరో చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో విశ్వక్ సేన్ కి జోడీగా నేహా శెట్టి నటిస్తుంది. అంజలి, నాజర్ ఇతర కీ రోల్స్ లో కనిపించబోతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

డిసెంబర్ 8నే రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకున్న మరో క్రేజీ మూవీ నితిన్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‘. రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నితిన్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఒకప్పుడు తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన హరీష్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‘ సినిమాని నిర్మిస్తుంది.


అసలు డిసెంబర్ చివరి వారంలో వద్దామనుకున్న వెంకటేష్ ‘సైంధవ్‘ ఇప్పటికే సంక్రాంతికి షిప్టైంది.

ఇక.. డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా వద్దామనుకున్న నాని ‘హాయ్ నాన్న‘ ఇప్పుడు డిసెంబర్ మొదటి వారానికి మారే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.


నాని లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న‘పై అంచనాలు భారీగానే ఉన్నాయి. నాని నాన్న పాత్రలో సమ్ థింగ్ స్పెషల్ గా కనిపించబోతున్న ఈ మూవీతో శౌర్యూవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. విజయ్ దేవరకొండ ‘ఖుషి‘కి మెమరబుల్ మ్యూజిక్ అందించిన హేషమ్ అబ్దుల్ వాహెబ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అసలు డిసెంబర్ చివరి వారంలో రావాల్సిన ‘హాయ్ నాన్న‘ ఇప్పుడు డిసెంబర్ 7 లేదా 8 లలో విడుదలకు సిద్ధమవుతోందట.

డిసెంబర్ మొదటి వారం వైపే చూస్తున్న మరొక చిత్రం ‘సెల్ఫిష్‘. దిల్ రాజు కుటుంబం నుంచి వచ్చిన హీరో ఆశిష్ సెకండ్ మూవీ ఇది. ఆశిష్, ఇవానీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విశాల్ కాశి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ కూడా బాగా ప్లస్ అవుతోందని భావిస్తోంది టీమ్. ఈ సినిమాని డిసెంబర్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట నిర్మాత దిల్ రాజు.

Related Posts