శెట్టి అండ్ శెట్టిక ఈ జాకీలేంటి బాస్

మిస్ శెట్టి మిస్టర్ శెట్టి.. గత గురువారం విడుదలైన సినిమా. మొదటి రోజే ఈ సినిమాకు జస్ట్ యావరేజ్ టాక్ వచ్చింది. జవాన్ ముందు నిలవడం కష్టమే అనుకున్నారు. కానీ ఈ లోగా మూవీ టీమ్ ఒక ప్లాన్ చేసింది. ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రిటీస్ తో ఈ చిత్రం గురించి పాజిటివ్ గా చెప్పించడం మొదలుపెట్టారు. మొదట రాజమౌళి ట్వీట్ చేశాడు. ఇది ఎవరో చెప్పించారు అనలేం. ఆయన ఒకేరోజు రెండు సినిమాలు చూశానని.. రెండిటి గురించీ చెప్పాడు. అంతే ఆ ప్లాన్ బావుందని ఆ తర్వాత అందరు సెలబ్రిటీస్ తో సినిమా సూపర్ అని చెప్పించడం మొదలుపెట్టారు. మహేష్ బాబు నుంచి రవితేజ వరకూ అనుష్కతో పనిచేసి హీరోలు, దర్శకులు పనిచేయని వారితో కూడా అదే పనిగా ట్వీట్స్ చేయిస్తున్నారు. సమంత, అనిల్ రావిపూడి, రాహుల్ రవీంద్రన్ వంటి వాళ్లు కూడా ట్వీట్స్ చేస్తూ సినిమా గురించి ఓ రేంజ్ లో చెబుతున్నారు.

ఇది వర్కవుట్ అయిందనే చెప్పాలి. దీంతో రెండో రోజు మూడో రోజు కలెక్షన్స్ కాస్త పెరిగాయి. కానీ కంటెంట్ పెరగదు కదా.. అందుకే వీళ్ల ట్వీట్స్ వల్ల సినిమా చూసిన వాళ్లంతా ఏముందీ సినిమాలో అంటూ పెదవి విరుస్తున్నారు. సెలబ్రిటీస్ చెప్పినంత మాత్రాన యావరేజ్ సినిమాలు సూపర్ హిట్ అవుతాయా అంటూ కమెంట్స్ చేస్తున్నారు.


నిజానికి ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తది కాదు. చాలా కాలం క్రితమే వచ్చింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా కనిపించిందే. కాకపోతే ఇక్కడ కాంబినేషన్ ప్లస్ అయింది. దానికి కాస్త బలమైన కంటెంట్ కూడా యాడ్ అయి ఉంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ తో జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం ఉండేది కాదు. మామూలుగా ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ బాలేకుండా సెకండ్ హాఫ్ బావుంటే ఆ సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అరగంట వరకూ చాలా బోరింగ్. ఆరంభమే మైనస్ అనిపించుకుంది. నవీన్ పోలిశెట్టి ఎంట్రీ తర్వాత కాస్త బెటర్ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ తేలిపోయింది. ముఖ్యంగా అనుష్క ఈ సినిమాకు పెద్ద మైనస్ అనేది అందరూ చెబుతున్న మాట. ఏదేమైనా ఈ మధ్య కాలంలో టాప్ సెలబ్రిటీస్ ట్వీట్స్ ను వాడుకుంటూ కొన్ని సినిమాలు కమర్షియల్ గా సేఫ్అవుతున్నాయి. ఆ లిస్ట్ లో ఈ శెట్టీస్ కూడా చేరుతున్నారనే చెప్పాలి.

Related Posts