మళ్లీ మొదలైన మైథలాజికల్ ట్రెండ్

రామాయణ, మహాభారతాలలోని పలు పాత్రలు వాటి విశేషాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హాలీవుడ్ సూపర్ హీరోస్ ను తలదన్నేలా మన పురాణ ఇతిహాసాల్లోని పాత్రలుంటాయి. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ సాయంతో గత కొన్ని సంవత్సరాలుగా మన పురాణాలను సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది.

కంటెంట్ ఉంటే చాలు ఎంతటి బడ్జెట్ అయినా తిరిగి రాబట్టుకోవడం సాధ్యమే అని నిరూపించింది మాగ్నమ్ ఓపస్ ‘బాహుబలి’. ఈ సిరీస్ సృష్టించిన మ్యానియాతో ప్రభాస్ శ్రీరాముడుగా ‘ఆదిపురుష్’ సినిమాని తీసుకొచ్చారు. అయితే ‘ఆదిపురుష్‘ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. పైగా రామాయణ గాథను వక్రీకరించారనే విమర్శలను మూటగట్టుకుంది.

అసలు ‘ఆదిపురుష్‘ కంటే ముందే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణంలో రామాయణాన్ని మూడు భాగాలుగా తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యావర్ లను దర్శకులుగా ఎంపిక చేసి రూ.1500 కోట్ల బడ్జెట్ తో ‘రామాయణం‘ మెగా మైథలాజికల్ మూవీకి ప్రి ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ‘ఆదిపురుష్‘ వలన ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిందనే ప్రచారం జరిగింది.

తాజాగా మళ్లీ మెగా ‘రామాయణం‘ వార్తల్లోకి వచ్చింది. ఈసారి నిర్మాతగా అల్లు అరవింద్ పేరు వినిపించకపోయినా దర్శకుడిగా ‘దంగల్‘ ఫేమ్ నితీష్ తివారి పేరే ప్రచారం జరుగుతోంది. ఈ రామాయణంలో రాముడుగా రణ్ బీర్ కపూర్, సీత గా సాయిపల్లవి, రావణ గా యష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అయోధ్య నేపథ్యంలో రామ్ జన్మభూమి ఇతివృత్తంతో కాంట్రవర్శీ క్వీన్ కంగన రనౌత్ ‘అపరాజిత అయోధ్య’ సినిమాని ప్రకటించింది. వెటరన్ రైటర్ విజయేంద్రప్రసాద్ రచన చేసే ఈ మూవీకి కంగన రనౌత్ దర్శకత్వం వహించబోతుంది. రామాయణం ఇతివృత్తంగానే విజయేంద్రప్రసాద్ రచనలోనే ‘సీత’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ అయ్యింది. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో ‘సీత’గా నటించేది కూడా కంగన రనౌత్ అనే ప్రచారం జరిగింది.

మరోవైపు మహాభారతాన్ని భీముడు పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పే ప్రయత్నంగా మోహన్ లాల్ భారీ స్థాయిలో ‘రండామూళం‘ చిత్రాన్ని ప్రకటించాడు. కానీ ఈ సినిమాకోసం కొన్నాళ్లుగా ఎలాంటి సమాచారం లేదు. అలాగే విలక్షణ నటుడు విక్రమ్ కర్ణుడు గా ‘మహావీర్ కర్ణ‘ సినిమా ప్రారంభమయ్యింది. కొంతభాగం షూటింగ్ కూడా పూర్తిచేసుకున్న ‘మహావీర్ కర్ణ‘ గురించి ఎలాంటి న్యూస్ లేదు. ఆమధ్య ‘మహావీర్ కర్ణ‘ నుంచి టీజర్ రిలీజైనా అందులో విక్రమ్ కనిపించలేదు.

అయితే తాజాగా కర్ణుడుగా నటించేందుకు మరో విలక్షణ నటుడు సూర్య సిద్ధమవుతున్నాడట. బాలీవుడ్ లో ‘రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్‘ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన ఓం ప్రకాష్ మెహ్రా ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడట. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా సూర్య ‘కర్ణ‘ చిత్రం తెరకెక్కనుందట. సుధా కొంగర, వెట్రిమారన్ సినిమాల తర్వాత సూర్య నటించే చిత్రం ఇదే అంటూ కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

మహాభారతం లోని మరో ముఖ్య పాత్ర అశ్వథ్థామ ఇతివృత్తంతో ‘ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్. తొలుత ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటించాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి విక్కీ తప్పుకున్నాడు. ఆ స్థానంలో అల్లు అర్జున్ వస్తాడనే ప్రచారం కూడా జరిగింది.

ఇంకా.. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె ప్రధాన పాత్రలో ‘ద్రౌపది’ సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు నిర్మాత మధు మంతెన. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉంది.

Related Posts