30 రోజులు.. 150 కోట్లు.. మెగా హీరోల వల్ల నష్టం

సినిమా హిట్ అయితే హీరోల అకౌంట్ లో.. ఫట్ అయితే దర్శకుల అకౌంట్స్ లో వేయడం అన్ని ఇండస్ట్రీలోనూ కనిపిస్తుంది. అయితే ఒకే నెలలో ఒకే ఫ్యామిలీ హీరోల నుంచి వచ్చిన సినిమాలు భారీ నస్టాలు తెచ్చిన సందర్బాలు మాత్రం చాలా అరుదు అనే చెప్పాలి అలాంటి అరుదైన ఘటన గత నెలలో జరిగింది. అది కూడా టాలీవుడ్ టాప్ బాక్సాఫీస్ విన్నర్స్ అయినా మెగా ఫ్యామిలీ నుంచి కావడమే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

జూలై 28న విడుదలైన పవన్ కళ్యాణ్‌ సినిమా బ్రో భారీ నష్టాలనే మిగిల్చింది. దాదాపు వంద కోట్లకు పైగా థియేట్రికల్ టార్గెట్స్ తో రిలీజ్ అయిన ఈ మూవీ మూడో వంతు కలెక్షన్స్ తో ఆగిపోయింది. నిర్మాతలు తమ సినిమా సేఫ్ అని ఎంత బుకాయించినా.. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ మాత్రం లబోదిబోమన్నారు అనేది నిజం. అవన్నీ ఇంటర్నల్ గా సెటిల్ చేసుకున్నారు అనే టాక్ కూడా ఉంది. అయితే సినిమాకు పొలిటికల్ టర్న్ కూడా మైనస్ అయిందనే చెప్పాలి. లేదంటే కలెక్షన్స్ ఇంకాస్త బెటర్ గా ఉండేవి. ఓవరాల్ గా ఈ మూవీ 60 కోట్ల లాస్ తో మిగిలిపోయింది.


ఇక తమ్ముడు తర్వాత ఆగస్ట్ 12న వచ్చిన అన్నయ్య భోళా శంకర్ భారీ డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. ఈ సినిమాపై ఏ దశలోనూ అంచనాలు లేవు. తమిళ్ లో వచ్చిన రొటీన్ మాస్ ఎంటర్టైనర్ ను తెలుగులో చేశాడు చిరంజీవి. పైగా ఇది తెలుగులో డబ్ అయింది కూడా. ఈ కారణంగానే అభిమానులు కూడా భోళా శంకర్ పై అంచనాలు పెట్టుకోలేదు. దీంతో ఓపెనింగ్ రోజునే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ సైతం పూర్తిగా డిజప్పాయింట్ అయ్యారు. ఈ మూవీ ద్వారా నిర్మాత 75 కోట్లకు పైగానే నష్టపోయారు అనేది నిజం. ఈ నిర్మాత పైకి ఎంత కవర్ చేసుకుంటున్నా.. భోళా శంకర్ ఇచ్చిన షాక్ కు కుమిలిపోతున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్.


ఇక రీసెంట్ గా ఆగస్ట్ 25న వచ్చిన మెగాప్రిన్స్ వరుణ్‌ తేజ్ గాండీవధారి అర్జున పరిస్థితీ అంతే. ఈ మూవీపైనా ఏ దశలోనూ బజ్ లేదు. అంచనాలు అసలు లేవు. ఒకవేళ కంటెంట్ సూపర్బ్ అనిపించుకుంటే కలెక్షన్స్ వచ్చేవి. కానీ అసలే బజ్ లేని ఈ మూవీకి ఫస్ట్ షోకే డిజాస్టర్ గా తేల్చారు ప్రేక్షకులు. దీంతో 20 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో రిలీజ్ అయిన గాండీవధారి కేవలం రెండున్న కోట్లు మాత్రమే రాబట్టింది. వీకెండ్ అయినా ఈ కలెక్షన్స్ అంటే సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించొచ్చు. సో.. నెల రోజుల్లోనే నలుగురు మెగా హీరోల మూడు సినిమాలు కలిపి ఇండస్ట్రీలో కలిగించిన నష్టం 150 కోట్లు.

Related Posts