ఓటిటి సినిమాలను రీమేక్ చేస్తే ఉపయోగం ఏంటి మేస్టారూ..?

ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం కామన్. కానీ ఓటిటిలో హిట్ అయిన సినిమాను కూడా రీమేక్ చేస్తే జనం చూస్తారా అనేది పెద్ద ప్రశ్న. పైగా ఆ చిత్రం ఓటిటిలో వచ్చినప్పుడు మనకు థియేటర్స్ అందుబాటులో లేవు. కరోనా కారణంగా బంద్ అయ్యి ఉన్నాయి. దీంతో ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని మరీ చూశారు. మరి ఓటిటి సినిమా అంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయి కదా.. ఆ రకంగా అన్ని భాషల్లోని మేజర్ ఆడియన్సెస్ ఈ చిత్రాన్ని చూసి ఉంటారు. మరోవైపు ఇదో బయోపిక్. కాబట్టి.. కొన్ని బయోపిక్ లు మాస్ ఆడియన్స్ కు పెద్దగా ఎక్కవు కూడా. అయినా రీమేక్ చేస్తున్నారంటే వారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. మరి ఆ సినిమా ఆకాశం నీ హద్దురా అని ఇప్పటికే అర్థమైంది కదా..
సాలా ఖడూస్, గురు ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆకాశం నీ హద్దురా. ఒరిజినల్ గా ఇది తమిళ్ లో రూపొందిన సినిమా. అక్కడ సూరరైపొట్రు గా వచ్చింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు ఆకాశం నీ హద్దురా అన్న టైటిల్ పెట్టారు. సింప్లీ ఫ్లై ఫౌండర్ జిఆర్ గోపీనాథన్ బయోపిక్ గా వచ్చిన చిత్రం ఇది. అప్పటి వరకూ ఆయన గురించి విన్నవారికి ప్రత్యక్షంగా ఆ కథ తెలుసుకునే అవకాశం వచ్చింది. అయితే ఈ కథను వెండితెరకు అద్భుతంగా అడాప్ట్ చేసింది సుధ కొంగర. స్క్రీన్ ప్లే సైతం ఓ రేంజ్ లో కనిపిస్తుంది. ఇక ప్రధాన పాత్రలో నటించిన సూర్య నటన మెస్మరైజ్ చేస్తే ఆయన భార్య పాత్రలో కనిపించిన అపర్ణ బాలకృష్ణ కూడా గొప్ప నటనతో మెప్పించింది. ఓ రకంగా ‘‘సోషల్ మీడియా టాక్’’తోనే ఈ చిత్రం అన్ని భాషల ఆడియన్స్ కు రీచ్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ చిత్రాన్ని వీక్షించారు. మరి అలాంటి మూవీని ఇప్పుడు మళ్లీ హిందీలో రీమేక్ చేస్తుండటం విశేషం.
హిందీలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. తమిళ్ టెక్నికల్ టీమే అక్కడా పనిచేస్తోంది. అక్కడా సుధా కొంగరే డైరెక్ట్ చేస్తోంటే.. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మొత్తంగా లేటెస్ట్ గానే ప్రారంభం అయిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Posts