విజయ్ కాంత్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

తమిళ పురట్చి కలైంగర్‘ విజయ్ కాంత్ మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.

‘మన ‘పురట్చి కలైంగర్’, ‘కెప్టెన్’ విజయకాంత్ ఇక లేరని తెలిసి గుండె తరుక్కుపోయింది. అతను అద్భుతమైన మనిషి. మాస్ హీరో, బహుముఖ వ్యక్తిత్వం మరియు తెలివైన రాజకీయ నాయకుడు. అతను ఎప్పుడూ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలలో నటించనప్పటికీ.. అతను అనువాద సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ప్రేమను పొందాడు. మన ప్రియమైన ‘కెప్టెన్’ చాలా త్వరగా మనల్ని విడిచిపెట్టి తిరిగిరాని శూన్యాన్ని మిగిల్చాడు! ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలగాలి.‘ అని చిరంజీవి తన సంతాపాన్ని ప్రకటించారు.

తమిళ సినీ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి బాధాకరం అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన అకాల మరణం ఒక్క కోలివుడ్‌ కే కాదు యావత్ భారతీయ సినీ పరిశ్రమకు తీరనిలోటు అన్నారు. మిత్రుడు విజయ్ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘2005లో విజయకాంత్ గారు పార్టీ ప్రకటించిన రోజు నేను మధురై ప్రాంతంలో షూటింగ్ లో ఉన్నాను. అక్కడి ప్రజల స్పందన ప్రత్యక్షంగా చూశాను. ప్రజల పట్ల విజయకాంత్ గారు స్పందించే తీరు, సమస్య వస్తే తెగించి పోరాడి అండగా నిలిచే విధానం మెచ్చుకోదగినవి. ఆపదలో ఉన్నవారిపట్ల మానవతా దృక్పథంతో స్పందించేవారు. ఆయనకు తొలి అడుగులో ఎదురైన ఫలితానికి అధైర్యపడక రాజకీయాల్లో నిలబడ్డారు. అదే ఆయన పోరాటపటిమను తెలియచేస్తుంది. పరిస్థితులకు ఎదురొడ్డి సింహంలా నిలిచేవారు. ఆయనకు సినీ సహచరుల నుంచి అవమానాలు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆ తత్వంతోనే తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షం వహించారు. విజయకాంత్ ను చివరిసారిగా 2014లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కలిశాను. విజయకాంత్ మృతికి దిగ్భ్రాంతిని తెలియచేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.‘ అని పవన్ కళ్యాణ్ సందేశాన్ని విడుదల చేశారు.

సినిమా, రాజకీయాలు రెండింటిలోనూ నిజమైన పవర్‌ హౌస్ విజయ్ కాంత్ అని ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని తెలిపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశాడు.

‘విజయకాంత్ గారి మరణవార్త ఎంతో భాధాకరమని.. ఆయన ప్రభావవంతమైన జీవిత జ్ఞాపకాలలో ఆయన కుటుంబ సభ్యులు సాంత్వన పొందాలని కోరుకుంటున్నానని‘ రవితేజ అన్నారు.

Related Posts