టాలీవుడ్ 2024.. ఫస్ట్ క్వార్టర్ రిపోర్ట్!

ఈ ఏడాది అప్పుడే క్యాలెండర్ లో మూడు నెలలు గిర్రున తిరిగాయి. టాలీవుడ్-2024 లో ఫస్ట్ క్వార్టర్ పూర్తయ్యింది. మరి.. ఈ మూడు నెలల్లో వచ్చిన చిత్రాలు టాలీవుడ్ కి ఎలాంటి ఫలితాల్ని అందించాయి. ఏఏ చిత్రాలు విజయాలు సాధించాయి. ఏ సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి వంటి విశేషాలను చూద్దాం.

జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాలలో సంక్రాంతి సినిమాలనే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంక్రాంతి కానుకగా జనవరి 12న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ నటించిన ‘హనుమాన్’ సినిమాలు విడుదలయ్యాయి. మహేష్ ‘గుంటూరు కారం’ భారీ అంచనాల మధ్య వస్తే.. డివోషనల్ స్టోరీతో తెరకెక్కిన ‘హనుమాన్’ అండర్ డాగ్ గా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘హనుమాన్’ భారీ విజయాన్ని సాధించగా.. ‘గుంటూరు కారం’ అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలమైంది.

కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో ‘హనుమాన్’ వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటివరకూ తెలుగులో సంక్రాంతి సీజన్లలో విడుదలైన చిత్రాలన్నింటిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘హనుమాన్’ నిలిచిందని మేకర్స్ ప్రకటించుకున్నారు. వరల్డ్ వైడ్ గా ‘హనుమాన్’ సినిమా రూ.330 కోట్లు వసూళ్లు సాధించింది.

సంక్రాంతి బరిలో నిలిచిన మరో రెండు చిత్రాలు వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’. సంక్రాంతి సీజన్లలో హాట్ ఫేవరెట్ గా దిగే ఈ ఇద్దరు స్టార్లలో వెంకీకి ‘సైంధవ్’ తీవ్ర నిరాశను మిగిలిస్తే.. నాగార్జునకు ‘నా సామిరంగ’ రూపంలో పాజిటివ్ రిజల్ట్ దక్కింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘సైంధవ్’ని ఆడియన్స్ ఏమాత్రం ఆదరించలేదు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా.. సంక్రాంతి బరిలో అసలు సిసలు సినిమాగా వచ్చిన ‘నా సామిరంగ’కి అదిరిపోయే ఓపెనింగ్స్ అందించారు అక్కినేని ఫ్యాన్స్.

జనవరిలో విడుదలైన చిత్రాలలో సునీత తనయుడు ఆకాష్ నటించిన ‘సర్కారు నౌకరి’ వంటి ఒకటి రెండు చిత్రాలు మంచి అంచనాలతో వచ్చినా ఫలితం మాత్రం పాజిటివ్ గా దక్కలేదు. జనవరిలో అనువాద రూపంలో తమిళం నుంచి వచ్చిన ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ ‘అయలాన్’ కూడా తెలుగులో అంతగా ప్రభావం చూపించలేకపోయాయి.

ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలలో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’కి మంచి ఆదరణ దక్కింది. సుహాస్, శివానీ జంటగా నటించిన ఈ సినిమా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి వచ్చి హిట్ కొట్టింది. ఆద్యంతం పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ రొమాంటిక్ రివెంజ్ డ్రామాకి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఫిబ్రవరిలో మొదటి వారంలోనే వచ్చిన సోహెల్ ‘బూట్ కట్ బాలరాజు’ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో నిర్మాతగానూ మారిన సోహెల్ కి తీవ్ర నిరాశ తప్పలేదు.

ఫిబ్రవరి రెండో వారం సినిమాల విషయానికొస్తే.. భారీ అంచనాలతో విడుదలైన రవితేజ ‘ఈగల్’ డిజాస్టర్ గా మిగిలింది. రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ టెక్నికల్ గా హై స్టాండార్డ్స్ లో ఉన్నా.. కంటెంట్ వీక్ గా ఉండడంతో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఫిబ్రవరి రెండో వారంలోనే విడుదలైన పొలిటికల్ బయోపిక్ ‘యాత్ర 2’ కూడా నిరాశపరిచిందని చెప్పొచ్చు. ‘జైలర్’ వంటి హిట్ తర్వాత రజనీకాంత్ నుంచి వచ్చిన ‘లాల్ సలామ్’ అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించలేకపోయింది. మలయాళం అనువాదం మూవీ ‘భ్రమయుగం’ విమర్శకులను మెప్పించింది కానీ.. కాసులు కురిపించలేకపోయింది.

ఇక.. ఫిబ్రవరిలో మంచి ఫలితాన్ని అందించిన చిత్రమంటే ‘ఊరు పేరు భైరవకోన’ గురించి చెప్పాలి. కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూసిన సందీప్ కిషన్ కి ఈ సినిమా మంచి ఫలితాన్ని అందించింది. ఫిబ్రవరిలో వచ్చిన చిన్న చిత్రాల్లో ‘రాజధాని ఫైల్స్, సిద్ధార్థ్ రాయ్, సుందరం మాస్టర్’ వంటివి ఉన్నాయి. ఈ సినిమాలకు విడుదల ముందు మంచి బజ్ క్రియేట్ అయ్యింది కానీ.. ఫలితాలు మాత్రం మిశ్రమంగానే మిగిలాయి.

మార్చి సినిమాల విషయానికొస్తే.. ఫస్ట్ వీక్ లో వచ్చింది వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాకోసం నెలల తరబడి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేశాడు మెగా ప్రిన్స్. అయితే.. ఈ ఏరియల్ యాక్షన్ కంటెంట్ అంతగా కనెక్ట్ కాకపోవడంతో సినిమా ఫలితం తారుమారైంది. మార్చి మొదటి వారంలోనే వచ్చిన రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది.

రెండో వారంలో ఎన్నో అంచనాలతో వచ్చిన ‘భీమా, గామి’ సినిమాలలో విశ్వక్ సేన్ ‘గామి’కి మంచి అప్లాజ్ వచ్చింది. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన ‘గామి’కి చాలా త్వరగానే బ్రేక్ ఈవెన్ సాధించింది. అయితే.. మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన ‘భీమా’ మరో రొటీన్ కమర్షియల్ మూవీగా మిగిలిపోయింది. ఇంకా.. మార్చి నెలలో విడుదలైన చిత్రాలలో ‘రజాకార్’ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కితే.. మార్చి 22న విడుదలైన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ‘ఓం భీమ్ బుష్’ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా ‘ఓం భీమ్ బుష్’కి ప్రేక్షకుల ఆదరణ దక్కింది.

మార్చి ఎండింగ్ లో రిలీజైన ‘టిల్లు స్క్వేర్’ ఇప్పటికీ బాక్సాపీస్ ను ఊపేస్తుంది. మూడు రోజులకే రూ.60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం త్వరలోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఇక.. మార్చిలో విడుదలైన మలయాళం అనువాద సినిమా ‘ప్రేమలు’ తెలుగులో మంచి ఫలితాన్ని అందుకుంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి తెలుగు వాళ్లూ కనెక్ట్ అయిపోయారు. మొత్తంగా.. ఈ మూడు నెలల్లో అదిరిపోయే హిట్ అందుకున్న చిత్రం ఏదైనా ఉందంటే అది ‘హనుమాన్’ అని చెప్పాలి.

Related Posts