తెలుగు సినిమా నిర్మాతల ఆవేదన..

తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది.. ఇది ఒకవైపు వినిపిస్తోన్న మాట. నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిపోయింది. ఇది నిర్మాతల వైపు నుంచి వినిపిస్తోన్న మాట. రెండూ నిజాలే. కానీ ఈ స్థితికి కారణం ఎవరూ అంటే ఖచ్చితంగా సమాధానం ఏదో ఒకవైపు వెళ్లాల్సిందే కదా. అలా వెళితే అది ఎవరివైపు.. స్థాయి వైపా లేక నిర్మాణ ఖర్చువైపా.. ఏదో ఒకటి అయితే దీనికీ కారణం ఎవరూ.. అనేది తెలుసుకునే ముందు అసలు ఈ సిట్యుయేషన్ ఏంటో చూద్దాం.తాజాగా తెలుగు సినిమా నిర్మాతల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు.. నిర్మాణ ఖర్చులు విపిరీతంగా పెరిగిపోయాయి అని.. అందుకు కారణాలేంటీ అనే విషయాల మీద జరిగాయి. ప్రధానంగా తేలినవి రెండు. ఒకటి రెమ్యూనరేషన్స్. రెండురీసెంట్ గా జరిగిన సినీ కార్మికులు సమ్మె. ఎవరు సమ్మె చేసినా, డిమాండ్ చేసినా దాని భారం, ప్రభావం అంతిమంగా పడేది నిర్మాతలపైనే. దీంతో ప్రధానంగా నష్టపోతున్నది వాళ్లే. అలాగే సినిమా పోయినా ఆ నష్టాన్ని భరించాల్సిందే. ఏదో కొందరు హీరోలు తప్ప ఇంకెవరూ దాన్ని భరించేందుకు ముందుకు రారు.

దీనివల్ల తమకు ఒరుగుతున్నది ఏంటీ అనే తర్జన భర్జనలు జరిగాయి. దీంతో అసలు వాళ్లూ వీళ్లూ ఏంటీ ”మనమే సమ్మె చేస్తే” అన్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. కట్ చేస్తే సినిమా షూటింగ్స్ ఆపేయాలనే నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచనలు కొనసాగుతున్నాయి.నిజానికి సినిమా షూటింగ్ ఆపాలన్న నిర్ణయం ముందే అనుకున్నది. అయితే అప్పుడు త్వరలో ప్రారంభం కాబోతోన్న చిత్రాల గురించి మాత్రమే అనుకున్నారట. కానీ ఈ మీటింగ్ లో చర్చించిన తర్వాత అందరికంటే ఎక్కువగా నష్టపోతున్నది తామే కనుక అసలు మొత్తం షూటింగ్ లే ఆపేస్తే అన్న నిర్ణయానికి ఎక్కువ మంది ఆమోద ముద్ర వేశారు. కట్ చేస్తే ఈ సమ్మె ఎప్పటి నుంచి ఎలా జరుగుతుంది. నిర్మాతల డిమాండ్స్ ఏంటీ అనేది త్వరలోనే చెబుతారు.అయితే నిర్మాతల ఆవేదన అర్థం చేసుకోదగ్గదే. అంతిమంగా సినిమా పరిశ్రమలో అత్యధికంగా నష్టపోతున్నది నిర్మాతలే. కానీ ఈ దుస్థితికి కారణం ఎవరూ అంటే నిర్మొహమాటంగా నిర్మాతలే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 2000 సంవత్సరం వరకూ తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలుగా కాక ‘కంపెనీలు” ఉన్నాయి. వారి బ్యానర్ లో సినిమా అంటే ఖచ్చితంగా పదిమందికి పని దొరుకుతుంది. ఖర్చు విషయంలో ఖచ్చితత్వం ఉంటుంది. ఎవరి ‘అదనపు’ డిమాండ్స్ ను అంగీకరించరు. దీంతో నిర్మాతలు తాము అనుకున్న బడ్జెట్ లోనే నిర్మాణం పూర్తి చేసి సినిమాను విడుదల చేసేవారు. 2000ల తర్వాత ఈ సిట్యుయేషన్ లో పెద్ద మార్పులు వచ్చాయి. అప్పటి వరకూ ఉన్న నిర్మాతలను కాదని కొత్తగా కొందరు పుట్టుకు వచ్చారు. ఆల్రెడీ ఇచ్చిన డేట్స్ ను కాదని అడ్డగోలుగా అడ్వాన్స్ లు ఇచ్చి, భారీ రెమ్యూనరేషన్లు ఆశ చూపించి పాత నిర్మాతలను కబ్జా చేశారు. సో ఇప్పుడు వీళ్లు చెప్పుకుంటోన్న ఈ సోకాల్డ్ ప్రాబ్లమ్ కు దాదాపు 20యేళ్ల క్రితమే బీజం పడింది. అప్పటి వరకూ ఓ ప్లానింగ్ తో ఉన్న నిర్మాతలు పక్కకి వెళ్లిపోయారు. కేవలం కాంబినేషన్స్ ను నమ్ముకుని రియల్ ఎస్టేట్ ద్వారానో లేదా బినామీలుగానో వచ్చిన వాళ్లంతా అడ్డగోలుగా ఖర్చు పెడుతూ.. పనికిమాలిన కథలతో సినిమా చేశారు. దీని ఫలితమే మనకు 2005 – 2012 మధ్య కాలంలో తెలుగు సినిమాను డబ్బింగ్ సినిమాలు శాశించాయి. దాని ఫలితంగా ఇతర భాషల హీరోలు ఇక్కడ మార్కెట్ పెంచుకున్నారు. ఓ దశలో తెలుగు సినిమా అంటే రొటీన్ రొడ్డకొట్టుడుకు కేరాఫ్‌ అనే పేరొచ్చిందంటే కారణం.. సినిమా నిర్మాణంపై అవగాహన లేని నిర్మాతలు పుట్టుకు రావడమే.మగధీర, ఈగ, బాహుబలి లాంటి సినిమాల తర్వాత ట్రెండ్ మరింత మారింది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అంటూ ఖర్చులు మరింత పెరిగాయి. ప్రపంచ సినిమాతో పోటీ పడేందుకని మనవాళ్లూ కంటెంట్ ను పట్టించుకోకుండా ఖర్చులు పెంచేశారు. దీంతో బడ్జెట్ డబుల్ అయింది. ఇదే అదనుగా చాలామంది దర్శకులు నిర్మాలను కేవలం “క్యాషియర్స్”గా మార్చారు.

ఇంకేముందీ అతనికి కథ తెలియదు. చివరికి ఫలితం చూస్తే తారుమారు. అలా చాలామంది నిర్మాతలు ఒక్కో శుక్రవారంతో కనుమరుగైపోయిన మాట నిజమా కాదా..? మురళీ మోహన్ లాంటి నిర్మాతను అతడు సినిమా విషయంలో పక్కన బెడితే అతను ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.ఎన్టీఆర్, చిరంజీవిలతో మాత్రమే సినిమాలు చేసిన దేవీ వర ప్రసాద్ ను మృగరాజు సినిమా టైమ్ లో కనీసం ప్రి వ్యూ థియేటర్ లోకి రానివ్వలేదు. నడమంత్రపు సిరితో ఎగసిపడిన నిర్మాతల వల్లే కదా ఇప్పుడు ఈ దుస్థితి. ఇంతా చేస్తే వీళ్లు ఇప్పుడు హీరోల రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడ్డం లేదు. జూనియర్ ఆర్టిస్టులు, ఇతర 24 క్రాఫ్ట్ ల్లో పనిచేస్తోన్న చిన్న చిన్న టెక్నీషియన్స్ అడిగిన వందల రూపాయల గురించి ఫీలవుతున్నారు. అలాగే వాళ్లే మాట్లాడుకున్నట్టు.. ఇవాళా రేపూ క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం విచ్చలవిడిగా మారారు. దీనికీ మన నిర్మాతలే కారణం. పరభాషల నుంచి పట్టుకు వచ్చి భాష, నటన రాకపోయినా లక్జరీ హోటెల్స్ లో బస, క్యారవాన్ లు ఏర్పాటు చేశారు. దీనికి నష్టపోయింది నిర్మాతలే. ఇలా ఆదిలోనే ఇలాంటి నిర్మాతలను కట్టడి చేసి ఉంటే ఇప్పుడీ దుస్థితి వచ్చేది కాదు.ఏదేమైనా ఇప్పటికైనా నిర్మాత అనేవాడు క్యాషియర్ కాదు. ఓనర్ ఆఫ్‌ ద షిప్ అని ఖచ్చితమైన నిర్ణయాధికారిగా ఉండేవాడు అని నిరూపించుకుంటేనే తెలుగు సినిమా పరిశ్రమ మనుగడ సాగుతుంది. లేదంటే ఈ సమ్మెలు ఇప్పటితో ఆగవు. రాబోయే రోజుల్లో వెండితెర వైభవం అంటూ ఉండదు.

Related Posts