Raj : ప్రముఖ సంగీత ద్వయం ‘రాజ్-కోటి’ లో రాజ్ మృతి

80, 90 దశకాలను తమదైన సంగీతంతో ఉర్రూతలూగించిన ద్వయం రాజ్ – కోటి. వీరిలో రాజ్ ఈ ఆదివారం మరణించారు.

రాజ్ కోటిగా తెలుగు సినిమా సంగీతానికి ఎనలేని కృషి చేసిన ఈ ద్వయం 1995 తర్వాత మనస్ఫర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత కోటి తనదైన శైలిలో రాణించినా.. రాజ్ ఎందుకో చాలా వెనకబడిపోయారు. ఆయ ఒక్కడుగా కేవలం పది చిత్రాలకు మాత్రమే సంగీతంఅందించారు. వీటిలో సిసింద్రీ సూపర్ హిట్ కాగా వెంకటేష్‌, ప్రీతి జింతా నటించిన ప్రేమంటే ఇదేరా చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు. ఆయన చివరి చిత్రం 2002లో వచ్చిన లగ్నపత్రిక.


రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఈయన తండ్రి కూడా ప్రఖ్యాత సంగీత దర్శకుడే. పేరు టివి రాజు. నాటి ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఎన్టీఆర్ – టివి రాజు కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ గా వచ్చారు. అలాంటి తండ్రి వారసత్వంతో తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించారు రాజ్. చిత్రంగా అతనికి తన లాగే సంగీత వారసత్వం ఉన్న కోటితో పరిచయం కలిగింది. ఈ పరిచయంతో ఇద్దరూ కలిసి సంగీతం అందించాలని నిర్ణయించుకున్నారు. ఇక కోటి తండ్రి సాలూరి రాజేశ్వరరావు సంగీత ప్రియులందరికీ సుపరిచితులే.
1982లో వచ్చిన ప్రళయ గర్జన చిత్రంతో ఇద్దరూ కలిసి సంగీత ప్రయాణం మొదలుపెట్టారు. చిత్రంగా వీరికి దాదాపు ఆరేళ్లపాటు సరైన బ్రేక్ రాలేదు. అయినా అడపాదడపా ఆఫర్స్ తో ఆకట్టుకుంటోన్న దశలో చిరంజీవితో చేసిన యముడికి మొగుడు మూవీ ఆల్బమ్ బ్లాక్ బస్టర్.

ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి తెలుగు సినిమా సంగీతాన్ని శాసించారనే చెప్పాలి. అయితే వీరిలో కోటి కాస్త మాటకారి. ఎవరితోనైనా సులువుగా కలిసిపోతాడు. కానీ రాజ్అలా కాదు. అంతర్ముఖుడు. అందుకే రాజ్ కోటిగా ఎంతో మందికి తెలిసినా.. కోటిలా అన్ని తరాల ప్రేక్షకులకు రాజ్ తెలియదు.
ఇక రీసెంట్ గా కూడా బేబీ అనే సినిమాకు సంబంధించిన ఓ పాట లాంచింగ్ కు కోటితోకలిసి వచ్చారు రాజ్. ఈ ఆదివారం రోజు బాత్ రూమ్ లో కాలు జారి పడిపోయారు. ఇంట్లోనే గుండెపోటుకు గురయ్యారు. ఆ క్రమంలో పెద్ద శబ్ధం వచ్చింది. ఆ శబ్ధానికి ఆయనకు గుండెపోటు కూడా వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లినా ఉపయోగం లేకపోయింది. మొత్తంగా తెలుగులో నేటికీ వినిపించే ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ తో తిరుగులేని ముద్ర వేసిన సంగీత ద్వయంలో ఒకరైన రాజ్ ఆత్మకు శాంతి కలగాలని తెలుగు 70ఎమ్ఎమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

Related Posts