ఒక్కో సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పెంచుకుంటూ వెళుతోన్న హీరో తిరువీర్. మొదట చిన్న పాత్రలే చేసినా తన టాలెంట్ తో హీరోగా ఎదుగుతున్నాడు.రీసెంట్ గా వచ్చిన హారర్ థ్రిల్లర్ మసూద చిత్రంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హీరోగా వరుస ఆఫర్స్ అందుకుంటోన్న తిరువీర్ నెక్ట్స్ మూవీ పరేషాన్. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. రూపక్ రోనాల్డ్ సన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానా సమర్పించడం విశేషం.
ఇక ట్రైలర్ చూస్తే ఇదో తెలంగాణ గ్రామీణ కథ. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తో కనిపిస్తోంది. పనీ పాటా లేని హీరో అతని మిత్ర బృందం. ఎప్పుడూ ఇంట్లో వారితో పాటు ఊళ్లోవాళ్ల చేత కూడా తిట్లు తింటూ ఉంటారు. అలాంటి వీరికి అనుకోకుండా ఓ సమస్య ఎదురవుతుంది. మరి ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు అనే కోణంలో సాగే సినిమాలా కనిపిస్తోంది. అలాగని అదేమీ సీరియస్ ప్రాబ్లమ్ లా లేదు. ఫన్నీ ఇష్యూతోనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కుర్రాడుగా కనిపిస్తున్నాడు తిరువీర్. అతని సరసన హీరోయిన్ గా పావని కరణం నటించింది.
ట్రైలర్ చూస్తే ఒక్క ఊరిలోనే సాగే కథగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వస్తోన్న తెలంగాణ గ్రామీణ చిత్రాల్లోని కామెడీనే మరోసారి చూపించబోతున్నారని తెలుస్తోంది. కాకపోతే ఏ కథకైనా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఈ కథలోనూ ఉన్నట్టే అనిపిస్తోంది. ఎప్పుడూ ఇంట్లో వారిచేత తిట్లు తింటూ, శిరీష అనే అమ్మాయిన ప్రేమించే క్రిస్టియన్ కుర్రాడిగా తిరువీర్ కనిపిస్తున్నాడు.
ఒక్క తిరువీర్ తో పాటు డిజే టిల్లు, బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ తప్ప మిగతా అన్నీ దాదాపు కొత్త మొహాలే. చాలా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కినట్టుగా కనిపిస్తోన్న ఈ చిత్రాన్ని జూన్ 2న విడుదల చేయబోతున్నట్టు ట్రైలర్ తో పాటు అనౌన్స్ చేశారు.