Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. ఆపరేషన్ టూ మంత్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ హీరోగా ఇప్పటికీ ఆయనే నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు. పొలిటికల్ గా బిజీగా ఉన్నా.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూకుడుగా వెళుతున్నాడు. అయితే కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ ఒక విషయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడనే వార్త వినిపిస్తోంది. అదే టైమ్. అంటే తను ఓ డెడ్ లైన్ పెడతాడు. ఆ డెడ్ లైన్ పూర్తయ్యేలోగా ఎవరు ముందుగా సినిమా తీయగలరో వారికే తన డేట్స్ ఇస్తూ వస్తున్నాడు. అందుకే ముందు ఒప్పుకున్న హరిహరవీరమల్లును పక్కన బెట్టి తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ ను చేశాడు. అలాగే హరీష్ శంకర్ సినిమాను సైతం సైడ్ లైన్ చేశాడు. భీమ్లా నాయక్ పూర్తయింది. ఇక హరిహర వీరమల్లు సినిమాకు వచ్చే సరికి ఈ డెడ్ లైన్ వార్నింగ్ ను బయటకు తీశాడు పవన్.
ఈ సినిమా ఇప్పటికే సగం వరకూ పూర్తయింది. ఈ సగంలో సగానికిపైగా పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలే ఎక్కువ. అంటే ఇకపై చేయాల్సిందంతా పవన్ పైనే. అయితే ఆ షూటింగ్ ను కేవలం రెండు నెలల్లో.. అచ్చంగా చెబితే 60 రోజుల్లోనే పూర్తి చేయాలని దర్శకుడికి వార్నింగ్ ఇచ్చాడు. అందుకే ఆ మధ్య తను క్రిస్మస్ సెలవులకు వెళుతూ మరోసారి స్క్రిప్ట్ ను పక్కాగా చూసుకున్నాడు. అంటే రెండు నెలల్లోగా హరిహర వీరమల్లును పూర్తి చేయాల్సిందే. అయితే ఈ విషయంలో దర్శకుడు క్రిష్ కు ఆల్రెడీ గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ చుట్టేసిన అనుభవం ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కాకపోతే అవుట్ పుట్ సంగతే ఆడియన్సెస్ ముందుకు వస్తే గాని తేలదు.
ఇక హరీష్ శంకర్ సినిమాకైతే పూర్తిగా రెండు నెలలు మాత్రమే టైమ్ అన్నాడట. ఆ లోగానే షూటింగ్ అట్ లీస్ట్ తన పార్ట్ ను ఫినిష్ చేయాలని అల్టిమేటమ్ జారీ చేశాడట పవన్ కళ్యాణ్. హరీష్ కు ఇప్పటికే బోల్డెంత టైమ్ దొరికింది. ప్రీ ప్రొడక్షన్ పక్కాగా చేసుకుని ఉన్నాడు. అందుకే ఈ టైమ్ లో సినిమాను పూర్తి చేయడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. అటు సురేందర్ రెడ్డికి సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని నిర్మాతలకు చెప్పాడట. కాకపోతే సురేందర్ కాస్త చెక్కడంలో ఎక్స్ పర్ట్. రెండు నెలల్లో సినిమాను పూర్తి చేయడం అతని వల్ల అవుతుందా లేదా అనేది పక్కన బెడితే.. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంటూ.. ఆ పని బాగా తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఇలా కండీషన్స్ పెట్టడం బాలేదని సదరు చిత్రాల నిర్మాతలు, దర్శకులు తమలో తాము చెప్పుకుని తెగ ఫీలవుతున్నారట. అయినా తప్పదు కదా.. అక్కడ చెప్పింది పవన్ కళ్యాణ్. అందుకే ఇయన కేటాయించే రెండు నెలల టైమ్ లోనే తమ సినిమాలను ఎలా పూర్తి చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నట్టు టాక్.

Related Posts