COMEDIAN ALI :- ఎక్స్ క్లూజివ్ – తెలంగాణ రాజకీయాల్లోకి కమెడియన్ అలీ

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నట అనుభవం ఉన్న నటుడు అలీ. హాస్యనటుడిగా, హీరోగా తెలుగుతో పాటు దక్షిణాది ప్రేక్షకులకు అలీ బాగా పరిచయం. వేల కోట్ల ధనవంతుడిని ఎవరూ గుర్తు పట్టరు గానీ మమ్మల్ని ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు, గౌరవిస్తారు అంటారు అలీ. నటుడిగా జనానికి నచ్చడం అదృష్టమని చెప్పుకునే అలీ…అదే జనం దగ్గరకు రాబోతున్నట్లు సమాచారం.
తను ఇప్పటికే ఏపీలో వైఎస్ఆర్ సీపీ తరుపున మద్దతుదారుగా ఉన్నారు. కానీ ఈసారి రాజకీయాల్లోకి రాబోయేది ఆ పార్టీ తరుపున కాదన్నదే అసలు విషయం.

అలీ అంటే అతని వైవిధ్యమైన కామెడీ గుర్తొస్తుంది. భాష, హా‌వభావాలతో అలీ తీసుకొచ్చే హాస్యం బాగా నవ్విస్తుంది. ఒక గొప్ప దశను చూసిన చాలా మంది నటుల్లాగే అలీ కూడా రాజకీయాలకు దగ్గరగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు అలీ అందులో చేరుతాడనే అంతా అనుకున్నారు. పవన్ తో అలీకున్న సాన్నిహిత్యం అలాంటిది. కానీ అనూహ్య పరిణామాల మధ్య పవన్ అలీ మధ్య దూరం పెరిగి, జనసేనలో చేరడం అసాధ్యం అనే వరకు వచ్చింది. ఆ తర్వాత వైఎస్ఆర్ సీపీకి మద్ధతుదారుగా జగన్ కు సపోర్ట్ చేశారు. గత ఎన్నికల ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటు అప్పటికే జరిగినందున అలీకి ఇప్పుడేమీ ఇవ్వలేమని వీలైనప్పుడు తప్పకుండా అతని సేవలు వినియోగించుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. అలా వైసీపీలో కొనసాగుతున్నారు అలీ. ఆ మధ్య ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అలీకి ఇచ్చినట్లు ప్రచారం జరిగినా అది మరొకరికి వెళ్లింది. రాజకీయాల్లో సహనం చాలా అవసరం. పదవుల కోసం ఏమాత్రం ఫీలయినా ఇబ్బందులు తప్పవు. అలీ ఇప్పటిదాకా సహనంగానే ఉంటూ వస్తున్నారు.

అలీ తాజాగా తన రాజకీయ భవిష్యత్ గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తన రాజకీయ జీవితాన్ని చూసుకునేందుకు అలీ సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ లో అలీ చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అలీకి టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే ఓ మంత్రి అలీకి ఈ సర్దుబాటు చేశారట. ఎంపీగా అవకాశం వస్తుందంటే అలీ మాత్రం ఎందుక్కాదంటాడు. పైగా తను పుట్టిన రాజమండ్రి వదిలేస్తే, ఆ తర్వాత కెరీర్, లైఫ్ అంతా తెలంగాణలోనే గడిపింది. అలీ టీఆర్ఎస్ లో చేరితే వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Posts