‘ఇష్క్‘ కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యింది

యూత్ స్టార్ నితిన్ ‘జయం‘ చిత్రంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ‘దిల్‘ వంటి ఒకటి రెండు విజయాలు దక్కినా.. ఎక్కువగా ఫ్లాపులే వచ్చాయి. అలాంటి సమయంలో నితిన్ ని మళ్లీ ట్రాక్ లో నిలిపిన సినిమా ‘ఇష్క్‘. 2012లో విడుదలైన ఈ సినిమాతోనే నితిన్ కి సెకండ్ ఇన్నింగ్స్ షురూ అయ్యిందని చెప్పొచ్చు. విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ‘ఇష్క్‘ మంచి విజయాన్ని సాధించింది.

నితిన్, నిత్యా మీనన్ జోడీ, పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ సాంగ్స్ ‘ఇష్క్‘ని మరో లెవెల్ లో నిలబెట్టాయి. ముఖ్యంగా.. ‘ఇష్క్‘తో నితిన్ కి మంచి రొమాంటిక్ హిట్ అందించాడు డైరెక్టర్ విక్రమ్ కుమార్. లేటెస్ట్ గా మరోసారి ‘ఇష్క్‘ కాంబో సెట్ అయ్యిందట. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నితిన్ కోసం స్క్రిప్ట్ సిద్ధమవుతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రాన్ని ‘హనుమాన్‘ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం నితిన్.. వెంకీ కుడుమల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్‘ సినిమా చేస్తున్నాడు. అలాగే.. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ‘తమ్ముడు‘ కూడా లైన్లో ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు విక్రమ్ కుమార్ చిత్రాన్ని పైప్ లైన్లో పెట్టాడు. త్వరలోనే నితిన్-విక్రమ్ కుమార్ కాంబో మూవీపై అధికారిక ప్రకటన రానుందట.

Related Posts