జూనియర్ కు ఆహ్వానం బాలయ్యకు కౌంటరా..?

సినిమా.. రాజకీయ.. ఈ రెండూ ఎప్పుడు ఏది ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేం. కొన్నిసార్లు యాధ్రుచ్చికంగా చేసిన విషయాలు కూడా రాజకీయ రంగు పులుముకుంటాయి. రీసెంట్ గా ఏపిలో రజినీకాంత్ అంశం అందుకు ఉదాహరణ. మరొకొన్నిసార్లు ప్లాన్ చేసినవి కూడా పట్టించుకునేవారు ఉండరు.

ఇది మరో కేటగిరీ. అయితే యుగపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ముగింపు సంబరాల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి వారికి ఆహ్వానం అందలేదు. ఇది కేవలం రాజకీయ వేదిక అని అభిమానులూ ఎవరికి వారు ఎన్ని కవరింగ్ లు చేసుకున్నా..

ఆ వేదికపై రాజకీయాల్లో కూడా లేని ఆయన కుటుంబ సభ్యులు,
చాలామందే ఉన్నారు. అంటే జూనియర్ ను కావాలనే పక్కన బెట్టారు అని ఖచ్చితంగాచెబుతాం అనేవారూ ఉన్నారు. అయితే ఇది ముగిసిపోయింది అనుకుంటోన్న టైమ్ లో ఖమ్మం వేదికగా మరోసారి అదే అంశం ఎన్టీఆర్ ఫ్యామిలీ అనే ట్యాగ్ తో మరోసారి తెరపైకి రాబోతోంది.

ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం ట్యాంగ్ బండ్ లో నందమూరి తారకరామారావు 36 అడుగుల భారీ విగ్రహం ఒకటి ప్రతిష్టించబోతున్నారు. ఈ నెల 28న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆహ్వానించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆంధ్రలో నిర్వహించిన పెద్దాయన శతజయంతి వేడుకల ముగింపుకు తారక్ ను రాకుండా చూసుకుంది బాలయ్య,చంద్రబాబు అనే విమర్శలున్నాయి. ఆ విమర్శలకు మరింత ఊతం ఇచ్చేలా తాజాగా తెలంగాణలోని విగ్రహావిష్కరణకు ఎన్టీఆర్ ను ఇన్వైట్ కనిపిస్తోంది.

నిజానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశాలే లేవు. అయినా అక్కడక్కడా ఉన్న ఓట్ బ్యాంక్ ను పూర్తిగా కొల్లగొట్టేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగడతో పాటు.. చంద్రబాబుపై మరింత కోపం వచ్చేలా చేయడానికే తారక్ ను ఆహ్వానించాలనుకున్నారు అనే మాటలూ వినిపిస్తున్నాయి.

అయితే తారక్ వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరించినంత మాత్రాన బిఆర్ఎస్ కు కలిసొస్తుందని చెప్పలేం. ఎందుకంటే.. అది ఖమ్మం. రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లాగా పేరుంది. కేవలం ఓ సినీ నటుడు వెళ్లి పెద్దాయన విగ్రహాన్ని ఆవిష్కరించినంత మాత్రాన అది రాజకీయంగా ప్రభావం చూపిస్తుంది అనుకోలేం.

కాకపోతే రీసెంట్ గానే తారక్ కు అవమానం జరిగినట్టుగా చాలామంది అభిమానులు ఫీలవుతున్నారు. అందుకు కారణం అని భావిస్తోన్న బాలయ్య, చంద్రబాబులకు ఇది కౌంటర్ అవుతుందనే కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ కోణంలో చంద్రబాబు టీమ్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.

Related Posts