నితిన్ కొత్త కథ ప్రభాస్ స్టోరీలా ఉందే..?

సినిమాలకు సంబంధించి ఒక కథకు మరో కథకూ సిమిలారిటీస్ ఉండటం సహజం. కొన్ని కథలు మాత్రమే ఆల్రెడీ చాలాసార్లు చూశాం కదా అనే ఫీలింగ్ ను ఇస్తాయి. కాకపోతే వీటిలో హీరోల ఇమేజ్ లు, దర్శకుల టేకింగ్ వంటివి కలిసొస్తే రొటీన్ అయినా హిట్ అవుతాయి. బట్.. ఆల్రెడీ డిజాస్టర్స్ లో ఉన్న టైమ్ లో ఇలాంటి కథలు ట్రై చేయకూడదు. ప్రస్తుతం నితిన్ కూడా ఇదే చేస్తున్నాడు. అతని కొత్త సినిమా కథ ఇదే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇవి నిజమే అయితే మాత్రం ఆల్రెడీ ఇలాంటి స్టోరీ ముఫ్ఫైయేళ్ల క్రితం నాగార్జున, పదిహేనేళ్ల క్రితం ప్రభాస్ కూడా చేశాడు. ఇక ఇతర సినిమాల్లో అలాంటి ప్లాట్స్ చాలా చూశాం. అయినా ఈ కథే ఎందుకు చేస్తున్నాడు నితిన్..?


నితిన్ కెరీర్ ఎప్పుడూ నిలకడగా లేదు. ఒక హిట్ పడితే నాలుగైదు ఫ్లాపులు అనేది అతని రొటీన్ గా మారింది. బట్ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది. వారస హీరోలు వచ్చారు. ఎవరికి వారు కొత్తగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి టైమ్ లో జాగ్రత్తగా ఉండకపోతే నితిన్ కే కాదు.. ఇలాంటి ఫ్లాపులు చూసే చాలామంది హీరోలకు ఇబ్బంది తప్పదు. 2016లో వచ్చిన అ ఆ తర్వాత మూడు ఫ్లాపులు 2020లో వచ్చిన భీష్మ తర్వాత నాలుగు ఫ్లాపులు చూశాడు నితిన్. 2022లో తను చాలా ఆశలు పెట్టుకున్న సినిమా మాచర్ల నియోజకవర్గం మరీ దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది.

ఈ క్రమంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒక్కోసారి అతి జాగ్రత్త కూడా ఇబ్బంది పెడుతుంది. తనకు చివరి హిట్ ఇచ్చిన భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో ఇప్పుడ కొత్త సినిమా చేస్తున్నాడు నితిన్. అయితే ఈ మూవీ కథ ఇదే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది నితిన్ ఇప్పటి వరకూ చేయని కథ. వెంకీ కుడుముల ఇంతకు ముందు చిరంజీవితో సినిమా చేయాల్సి ఉంది. బట్ తన కథ మెగాస్టార్ ను మెప్పించలేకపోయింది. దీంతో మళ్లీ నితిన్ ను ఒప్పించాడు.

అయితే ఈ కథ ప్రకారం హీరో ఓ ప్రాణాంతకమైన వ్యాధి ఉంటుందట. కొన్ని నెలల్లో అతను చనిపోతాడు అని తెలుస్తుంది. అప్పటి వరకూ ఎలా బ్రతికినా అప్పటి నుంచి చివరి క్షణం వరకూ సరదాగా ఉండాలని డిసైడ్ అవుతాడట. తన చుట్టూ ఉండేవారిని ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా చనిపోవాలనుకునే క్యారెక్టర్ నితిన్ ది అంటున్నారు. ప్రభాస్ చేసిన చక్రం ఇదే ప్లాట్ కదా.

ఇక నాగార్జున గీతాంజలి కూడా అదే కథ. అయితే కథ భారంగా ఉన్నా.. కథనం మాత్రం సరదాగానే వెంకీ కుడుముల స్టైల్లో ఉంటుందంటున్నారు. మరి ఈ కామెడీ వర్కవుట్ అవుతుందీ అనుకుంటే సెంటిమెంట్ లైట్ అవుతుంది. సెంటిమెంట్ హెవీ అయితే ఆడియన్స్ భరించలేరు. అయినా బ్యాలన్స్ చేసి హిట్ అందుకోవడం అంత సులువేం కాదు. మరి ఈ టాస్క్ లో నితిన్, వెంకీ ఎలా సక్సెస్ అవుతారో చూడాలి.

Related Posts