మళ్లీ మాస్టర్ తోనే విక్రమ్ డైరెక్టర్

కొన్ని కాంబినేషన్స్ భాషతో పనిలేకుండా క్రేజ్ తెచ్చుకుంటాయి. ఆ క్రేజ్ ను సంపాదించడం అంత సులువు కూడా కాదు. బట్ కేవలం నాలుగు సినిమాలతోనే ఆ ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. అతన్నుంచి ఓ సినిమా వస్తోందంటే గ్యారెంటీ హిట్ అనే ట్యాగ్ పడిపోయింది. పైగా తన హీరోలను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తాడు. దీనికి తోడు మల్టీవర్స్ అనే కొత్త ట్రెండ్ కూడా క్రియేట్ చేశాడు. ఈ ట్రెండ్ లోకి లోకనాయకుడు కమల్ హాసన్ కూడా చేరాడంటే అతని టాలెంట్ గురించి కొత్తగా చెప్పేదేముందీ. విక్రమ్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో మాట తప్పలేదు. మళ్లీ తన మాస్టర్ తోనే చేస్తున్నాడు.


సౌత్ లో ఇప్పుడు కొత్తగా వస్తోన్న దర్శకులు సరికొత్తగా ఆలోచిస్తున్నారు. కొన్నాళ్ల క్రితంలా బాలీవుడ్ ను కాకుండా హాలీవుడ్ టార్గెట్ గా కథలు రాసుకుంటున్నారు. కొత్త టెక్నాలజీని బాగా అవగాహన చేసుకుంటూ.. టేకింగ్, మేకింగ్ విషయంలో మెస్మరైజ్ చేస్తున్నారు. అఫ్‌ కోర్స్ ఇది కొద్దిమందికి మాత్రమే వర్తిస్తుంది. ఆ కొద్దిమందీ వీటితో పాటు మంచి కంటెంట్ ను కూడా రాసుకుంటున్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నాడు లోకేష్ కనకరాజ్. ఫస్ట్ మూవీ మా నగరంతోనే ఆకట్టుకున్న అతను తర్వాత ఖైదీతో సౌత్ మొత్తం అదరగొట్టాడు. ఒక్క రాత్రిలో జరిగే కథను థ్రిల్లింగ్ గా చెప్పాడు.

ఆ తర్వాత విజయ్ తో చేసిన మాస్టర్ మనవారికి పెద్దగా నచ్చుకున్నా.. తమిళ్ లో బ్లాక్ బస్టర్. అప్పుడే విజయ్ తో మరో సినిమా చేస్తా అని చెప్పాడు లోకేష్. తర్వాత కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. లిమిటెడ్ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. విక్రమ్ టైమ్ లో మళ్లీ ఖైదీకి సీక్వెల్ ఉంటుందనీ..

దానికి విక్రమ్ కు లింక్ ఉంటుందనే టాక్ వచ్చింది. బట్ తను ముందే చెప్పినట్టుగా మళ్లీ విజయ్ తోనే సినిమాకు కమిట్ అయ్యాడు లోకేష్‌ కనకరాజ్. కొన్నాళ్లుగా జస్ట్ న్యూస్ లా ఉన్న ఈ కాంబోను కన్ఫార్మ్ చేస్తూ అఫీషియల్ గానే చెప్పేశారు. లోకేష్ కు కలిసొచ్చిన అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విజయ్ కి ఇది 67వ సినిమా. అయితే తను క్రియేట్ చేసిన మల్టీవర్స్ లోనే ఈ విజయ్ మూవీ కూడా ఉంటుందా లేక సెపరేట్ చిత్రమా అనే ప్రశ్న మాత్రం అలాగే ఉంది. దీనికి సినిమాతో సమాధానం చెబుతారా లేక ముందే చెబుతారా అనేది చూడాలి.

Related Posts