ఆ అవకాశం త్రివిక్రమ్ కే ఎందుకు ఇస్తున్నారో తెలుసా..?

దర్శకుడుగా తనకంటూ ఓ రేంజ్ వచ్చిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి సినిమాలోనూ పాత తరం హీరోలనో, హీరోయిన్లనో ప్రధాన పాత్రల్లో తీసుకోవడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా అత్తారింటికి దారేదీ సినిమాతో తెలుగులో అతి తక్కువ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నదియాను అత్త పాత్రలో తీసుకుని ఆశ్చర్యపరిచాడు. అలాగే బాలీవుడ్ స్టార్ బొమన్ ఇరానీని పరిచయం చేశాడు. అటుపై సన్నాఫ్ సత్యమూర్తితో మరో ప్రయోగం చేశాడు. కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ అయిన ఉపేంద్రను ఓ కీలక పాత్రలో తీసుకున్నాడు. ఈ పాత్రకు ఉపేంద్ర పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు కూడా.
అ ఆ సినిమాతో మొన్నటి తరం హీరోయిన్ ఈశ్వరీ రావును నితిన్ తల్లి పాత్రతో మళ్లీ పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆమె కెరీర్ కూడా కొత్త టర్న్ తీసుకుంది. ఈశ్వరీరావుకు మళ్లీ అరవింద సమేతలోనూ ఓ కీలక పాత్ర ఇచ్చాడు. వీరితో పాటు ఎవరూ ఊహించని విధంగా అజ్ఞాతవాసిలో ఖుష్బూను తీసుకువచ్చాడు. సినిమా పోయినా.. ఈ సినిమాలో ఖుష్బూ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది.
అలాగే అల వైకుంఠపురములోతో టబును కొత్త పాత్రలో చూపించాడు. ఇదే సినిమాలో మళయాల సినిమాల్లో హీరోగా నటించిన జయరామ్ ను కూడా పరిచయం చేశాడు. విశేషం ఏంటంటే.. నిన్నటి తరం హీరోలైనా, హీరోయిన్లైనా.. త్రివిక్రమ్ సినిమాల్లో బలమైన పాత్రల్లోనే కనిపించారు. కేవలం వారి ఇమేజ్ కోసం మాత్రమే వాడలేదు. వారి ఇమేజ్ కు తగ్గట్టుగానే తన చిత్రాల్లో వారి పాత్రలు రాసుకున్నాడు త్రివిక్రమ్. అందుకే పాతతరం నటీ నటులు త్రివిక్రమ్ సినిమాలో పాత్ర అంటే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబుతో మూవీకి రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో దాదాపు పన్నెండేళ్ల తర్వాత వస్తోన్న చిత్రం ఇది. గతంలో అతడు, ఖలేజా మూవీస్ తో మెప్పించారు. ఇక ఎప్పట్లానే ఈ మూవీలోనూ ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం మరోసారి ఉపేంద్రను తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఉపేంద్ర తెలుగులో ఆల్రెడీ గని సినిమాలో నటించి ఉన్నాడు. ఇక సన్నాఫ్ సత్యమూర్తిలో అత్యంత కీలక పాత్ర ఇచ్చిన త్రివిక్రమ్ మూవీలో ఆఫర్ అంటే వదులుకుంటాడా..? మరి మహేష్ – ఉపేంద్రల పాత్రలను ఎలా మలచబోతున్నాడో చూడాలి.

Related Posts