మళ్లీ తెరపైకి అల్లు అర్జున్-బోయపాటి కాంబినేషన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బన్నీ ఇప్పటికే మరో రెండు ప్రాజెక్టులను ప్రకటించాడు. అవే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఫోర్త్ కాంబో మూవీ.. అలాగే టీ-సిరీస్ బ్యానర్‌ లో సందీప్ రెడ్డి వంగాతో కలిసి చేయబోయే మరో ప్రాజెక్ట్.

అయితే.. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కోసం ఈసారి ఓ సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడట త్రివిక్రమ్. ఆ ప్రాజెక్ట్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులకే చాలా సమయం పట్టనుంది. ఇక.. ఈ ఏడాది ద్వితియార్థం నుంచి ప్రభాస్ తో ‘స్పిరిట్‘ను పట్టాలెక్కించే సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాతే అల్లు అర్జున్ తో సినిమాని రూపొందించనున్నాడు.

ఈనేపథ్యంలో.. ‘పుష్ప 2‘ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాని సెట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట బన్నీ. 2016లో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘సరైనోడు’ మూవీ సూపర్ హిట్ అయింది. మళ్లీ అల్లు అర్జున్ కోసం అలాంటి ఫక్తు ఎంటర్ టైనర్ సబ్జెక్ట్ ను సిద్ధం చేస్తున్నాడట బోయపాటి. ఇప్పటికే ఆ స్టోరీ లైన్ ఐకాన్ స్టార్ కి వినిపించడం.. అతని నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం కూడా జరిగినట్టు సమాచారం. కొద్ది రోజుల్లోనే ఈ క్రేజీ కాంబో గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

Related Posts