తారాగణం : రామ్, శ్రీ లీల, సాయీ మంజ్రేకర్, శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, గౌతమి, ప్రిన్స్, ఇంద్రజ, శరత్, అజయ్ పుర్కర్
ఎడిటర్ : తమ్మిరాజు
సంగీతం : ఎస్.థమన్
సినిమాటోగ్రఫీ : సంతోష్ డెకాటే
నిర్మాతలు : శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమార్
దర్శకత్వం : బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది. అతని సినిమాలకు లాజిక్ లు ఉండవు. కొన్ని సీన్స్ సెన్స్ లెస్ గా కనిపిస్తాయి కూడా. అయినా మాస్ ను ఎంటర్టైన్ చేస్తుంటాడు. దీనివల్ల కమర్షియల్ గా మెప్పిస్తాడు. ఇక ఫస్ట్ టైమ్ రామ్ తో సినిమా అనగానే చాలామంది ఈ ఇద్దరి స్కూల్స్ వేరే కదా అనుకున్నారు. అనుకున్నా తను రామ్ రూట్ లోకి వెళ్లకుండా తన స్కూల్ కే రామ్ ను రప్పించాడని ట్రైలర్స్ చూస్తే అర్థమైంది. మరి ఇవాళ విడుదలైన స్కంద ప్రేక్షకుల అంచనా(ఉంటే)లను అందుకుందా లేదా అనేది చూద్దాం..

కథ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు(అజయ్ పుర్కర్) తన కూతురుకు పెళ్లి చేస్తుంటాడు. ఆ పెళ్లికి ఓ అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రిరంజిత్ రెడ్డి (శరత్) కొడుకు వెళతాడు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ అందరూ ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు పెళ్లి కూతురును కిడ్నాప్ చేసి హెలికాప్టర్ లో తీసుకువెళతాడు. అప్పటికే ఇద్దరి మధ్యా వైరం ఉంటుంది. తన కూతురును రప్పించేందుకు ఓ వ్యక్తిని పంపిస్తాడు రాయుడు. ఇక తెలంగాణ సిమ్ కు కాబోయే అల్లుడిని అని చెబుతూ భాస్కర్(రామ్) శ్రీ లీలను కాలేజ్ లోనే ఏడిపిస్తుంటాడు. తనే సిఎమ్ కూతురును అని చెప్పకుండా తన అన్న ఎగేజ్మెంట్ కు ఇన్వైట్ చేస్తుంది. అక్కడికి వెళ్లిన భాస్కర్ వందల మంది పోలీస్ లు, సెంట్రల్ బలగాలను ఒంటి చేత్తో కొట్టి ఏపి సిఎమ్ కూతురుతో పాటు, తెలంగాణ సిఎమ్ కూతురును కూడా అతని కళ్ల ముందు నుంచే తీసుకువెళతాడు. మరోవైపు తన కంపెనీలో పనిచేసే పదిమంది అమ్మాయిలను, పాతికమంది స్టాఫ్ ను చంపేశాడు అనే అభియోగంతో రామకృష్ణరాజుకు ఉరిశిక్ష పడుతుంది. మరి ఈ రెండు కథలకు ఉన్న కామన్ పాయింట్ ఏంటీ.. రామకృష్ణ రాజు ఉరిశిక్షకు కారణం ఎవరు.. అసలు ఈ సిఎమ్ ల మధ్య ఉన్న కనెక్షన్ ఏంటీ అనేది సెకండ్ హాఫ్ లో తేలుతుంది.

ఎలా ఉంది.

బోయపాటి సినిమా అంటేనే లాజిక్ లెస్. ఎంత మాస్ కు పూనకం వచ్చేలాంటి ఆర్ఆర్ లతో వందలమందిని ఒంటి చేత్తో కొట్టే హీరోలున్నా.. ఈ సారి మరీ గీత దాటేశాడు. ఎంత సర్ది చెప్పుకున్నా.. అనేక సన్నివేశాలు సెన్స్ లెస్ గా అనిపిస్తాయి. హై హీల్ షూస్ వేసుకుంటే తప్ప హీరోయిన్ హైట్ కు కూడా సరిపోని రామ్.. ఆ ఫిజిక్ తో వందలమందిని కొడుతుంటే ఆ దెబ్బలేవో మనకే తగులుతున్నట్టుగా అనిపిస్తుంది. బోయపాటి హీరో మాస్ లో పిహెచ్.డిలు చేసి ఉంటాడు. రామ్ స్టేచర్ స్కూల్ ను కూడా దాటదు. అందువల్ల ఎంత మాస్ సీన్ అయినా.. మనస్సుకు ఎక్కడో బాధ అనిపిస్తూ ఉంటుంది. మరీ ప్రేక్షకులను ఎంతో చులకనగా చూస్తే తప్ప ఇలాంటి యాక్షన్ సీన్స్ ఉండవు కదా అనిపిస్తుంది. ఒక సిఎమ్ సెక్యూరిటీ ఏంటీ, పెళ్లిలో అతని కూతురును కిడ్నాప్ చేయడం ఏంటీ.. ఓ సాధారణ కుర్రాడు సిఎమ్ ఇంటికే వెళ్లి ఆధునిక ఆయుధాలున్న పోలీస్ బలగాలను ఒంటి చేత్తో కొట్టడం ఏంటీ.. ఏ మాత్రం బుర్ర వాడినా ఇలాంటి సన్నివేశాలు రాసుకోరు. యాక్షన్ సీన్స్ అయినా కనీసం మెప్పించేలా ఉండాలి కదా..? ఏపి సిఎమ్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత అన్నట్టు చూపించాడు. అంటే అతను చంద్రబాబు(ఆ భద్రత ఆయనకు మాత్రమే ఉంది) అనుకోవాలా.. ? అనంతపూర్ లో పాలెస్ చూపించారు కాబట్టి జగన్ అనుకోవాలా.. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి అనగానే కెమెరా ఫామ్ హౌస్ మొత్తం తిరుగుతూ ఇంట్లోకి వెళ్లడం చూస్తే ఇతను కేసీఆరే అనుకోవాలా.. పెళ్లి కూతురును కిడ్నాప్ చేసింది కేటీఆర్ అవుతాడు కదా అనుకోవాలా.. ఇన్ని ప్రశ్నలు మెదడులోకి రాకుండా ఎంత అడ్డుకున్నా.. ఆ యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా, అర్జెంట్ గా ఓ తలనొప్పి బిల్ల వేసుకోవాలనిపిస్తుంది. బేసిక్ సెన్స్ లేని కథనం ఉన్న ఈ చిత్రంలో కథలాంటిది కూడా ఉంటుంది. అది గతంలో జరిగిన సత్యం రామలింగరాజు స్కామ్ ను పోలి ఉంటుంది. బోయపాటి కథలో ఈ రామరాజు అత్యంత నిజాయితీ పరుడు నీతిమంతుడూనూ. ఈయన హీరో తండ్రికి స్నేహితుడు.70 దేశాల్లో కంపెనీలు, లక్షకు పైగా ఎంప్లాయీస్ ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీకి అధినేత. తన స్నేహితుడిని కాపాడమని తండ్రి చెబితే ఇతగాడు వెళ్లి ఇద్దరు సిఎమ్ లను చెడుగుడు ఆడేసుకుంటాడు. మరి ఈ కుర్రాడైమైనా ఎక్స్ ట్రార్డినరీనా అంటే.. కాదు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో ఎథికల్ హ్యాకింగ్ లో యూనివర్శిటీ టాపర్. కానీ పేరెంట్స్ కోసం ఓ పెద్ద ఉపన్యాసం సీన్ ఉంది కాబట్టి.. తను ఫెయిల్ అయ్యానని చెప్పి తల్లితండ్రుల వద్ద ఉంటాడు. అదీ మేటర్. మరి ఈయనగారి స్నేహితుడు అరెస్ట్ కావడం, అతని కంపెనీపై బ్యాడ్ నేమ్ రావడం అన్నీ టివిల్లో వస్తుంటాయి. కానీ వీళ్లు పట్టించుకోరు. అదేం చిత్రమో మరి. చివర్లో ఎవరో చెబితే కానీ విషయం తెలియదు. ఏంటో బోయపాటి లాజిక్ అర్థం కాదు.
ఇక ఈ సినిమాలో మరో రామ్ కూడా(డ్యూయొల్ రోల్) ఉన్నాడు. చూడ్డానికి అడవి మనిషిలా ఉన్నాడు. పైగా మొరాకో ప్రభుత్వాన్ని 30యేళ్లుగా ఇబ్బంది పెడుతున్న క్రిమినల్ ను చంపాడట. ఈ కథంతా సీక్వెల్ లో చెబుతామని చివర్లో వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తిని వేల కోట్లకు అధిపతి అయిన రామకృష్ణ రాజు కూతురు కలవడమే అసాధ్యం అంటే వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారని చెబుతాడు. ఏదేమైనా కొన్ని సినిమాలు చూస్తుంటే.. ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. ఆ జాబితాలో ఖచ్చితంగా ఉండే సినిమా ఈ స్కంద.

ఇక నటుల విషయానికి వస్తే రామ్ దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లిపోయాడు. అందుకోసం యాక్షన్ సీన్స్ లోఒళ్లు హూనం(అఫ్ కోర్స్ డూప్ దే)చేసుకున్నాడు. డ్యాన్సులు గట్రా ఎప్పట్లానే బావున్నాయి. అన్ని ఫైట్లు చేసేందుకు తనను తాను మానసికంగా కూడా ప్రిపేర్ చేసుకున్నట్టున్నాడు. పేరెంట్స్ గురించి వచ్చిన సన్నివేశం బావుంది. శ్రీ లీలది రెగ్యులర్ హీరోయిన్ పాత్రే. అటు సాయీ మంజ్రేకర్ దీ అంతే. ఉన్నంతలో శ్రీకాంత్ తో పాటు ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న దగ్గుబాటి రాజాకు అద్భతుమైన రీ ఎంట్రీ పడింది. సినిమా రిజల్ట్ తో పనిలేకుండా ఇతను ఫుల్ బిజీ అవుతాడని చెప్పొచ్చు. ఇతర పాత్రలన్నీ రొటీన్ అంటే రొటీన్. అదేంటో తెరంతా విపరీతమైన జనం కనిపిస్తారు. బోయపాటి సినిమాల్లో ఎప్పుడూ ఉండేదే అయినా.. ఈ సారి ఆ సంఖ్య డబుల్, త్రిబుల్ గా కనిపిస్తుంది. వీరిలో ఎవరి పాత్రకూ సరైన ఔచిత్యం కనిపించదు. కాదు… ఉండదు.

టెక్నికల్ గా ఈ సినిమాకు థమన్ సంగీతం హైలెట్ అవుతుందనుకున్నారు. కానీ పాటలు మైనస్. నేపథ్య సంగీతం అక్కడక్కడా బావుంది అంతే. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ పరంగా సెకండ్ హాఫ్ లో చాలా ట్రిమ్ చేయొచ్చు. ఆర్ట్ వర్క్, సెట్స్ చాలా బావున్నాయి. కాస్ట్యూమ్స్ బావున్నాయి. డైలాగ్స్ జస్ట్ ఓకే. ఇక దర్శకుడుగా బోయపాటి పూర్తిగా హాఫ్ మైండెడ్ గా తీశాడు అనేలా ఉంది. కథపై కనీసం కసరత్తు చేయలేదు. కథనంపై అవగాహనతోనే చేశాడా అనిపిస్తుంది. ఎంత సినిమాటిక్ లిబర్టీ అయినా.. మరీ ఇంత దారుణంగా ఉంటే ఒక దశలో అభాసుపాలవుతారు. ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులూ ఆకు రౌడీల్లా హీరో మీద పడిపోవడం ఏదైతే ఉందో.. ఆ ఒక్కటి చాలు.. బోయపాటి దర్శకత్వ పరిణతి తెలియడానికి.

ఫైనల్ గా ః సిల్లీ, ఇల్లాజికల్

రేటింగ్ ః 2/5

                                                            - బాబురావు. కామళ్ల

Related Posts