మరోసారి మ్యాజిక్ చేయబోతున్న రవితేజ-మలినేని

టాలీవుడ్ లో స్టెడీ హిట్స్ తో సాగుతోన్న దర్శకుల్లో మలినేని గోపీచంద్ ముందు వరుసలో ఉంటాడు. ఇతని కెరీర్లో ఇప్పటివరకూ చేసిన ఏడు సినిమాల్లో ఒక్క ‘విన్నర్’ మాత్రమే ఏవరేజ్ గా నిలిచింది. మిగతా అన్ని మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా గత రెండు చిత్రాలు ‘క్రాక్, వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన వీరవిహారం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరోవైపు మాస్ మహారాజ రవితేజాతో మలినేని గోపీచంద్ ట్రాక్ రికార్డ్ సూపర్ అని చెప్పాలి. ఒకవిధంగా రవితేజ పరిచయం చేసిన దర్శకుల లిస్టులో మలినేని గోపీచంద్ ఒకడు. ‘డాన్ శీను’తో మొదలైన ఈ కాంబోలో ‘బలుపు, క్రాక్’ వంటి హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు నాల్గవసారి ఈ క్రేజీ కాంబో రిపీటవుతోంది.

‘ఆర్.టి4జి.ఎమ్’ వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దీంతో హీరో రవితేజ, డైరెక్టర్ మలినేని గోపీచంద్, మైత్రీ నిర్మాతలు నవీన్, రవి నలుగురు ఉన్న ఫోటోని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తమిళ విలక్షణ దర్శకుడు, నటుడు సెల్వరాఘవన్ ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇంకా.. ఈ సినిమాలో నటించే మిగతా నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలను వరుసగా వెల్లడించనున్నారట.

Related Posts