కమల్ కోసం రంగంలోకి రజనీకాంత్

నాలుగున్నర దశాబ్దాలకు పైగా తమిళ చిత్ర పరిశ్రమలో కథానాయకులుగా కొనసాగుతున్నారు రజనీకాంత్ – కమల్ హాసన్. ఇంచు మించు ఒకేసారి స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ అగ్ర కథానాయకులిద్దరూ.. కోలీవుడ్‌ ని దాదాపు మూడు దశాబ్దాలపాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలారు. సుమారు 16 సినిమాల్లో కలిసి నటించిన ఘనత కూడా కోలీవుడ్ లో రజనీకాంత్-కమల్ హాసన్ సొంతం చేసుకున్నారు.

బాక్సాఫీస్ వద్ద రైవల్రీ కొనసాగిస్తూనే.. బయట స్నేహితులుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు ఈ సీనియర్ హీరోలు. ఇక.. వీరిద్దరూ ఒకరి సినిమాకి సంబంధించిన ఆడియో రిలీజ్ కోసం మరొకరు అతిథులుగా హాజరైన సందర్భాలు చాలానే ఉన్నాయి. లేటెస్ట్ గా విశ్వ నటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇండియన్ 2‘ ఫస్ట్ గ్లింప్స్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ రిలీజ్ చేయబోతున్నాడు. రేపు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ‘ఇండియన్ 2.. ఇంట్రో‘ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదలకాబోతుంది. అందుకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

మరోవైపు భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ‘ఇండియన్ 2‘ని తెరకెక్కిస్తున్నాడు. ఇటు కమల్ హాసన్ తోనూ.. అటు రజనీకాంత్ ఇద్దరితోనూ శంకర్ కి మంచి అనుబంధం ఉంది. కమల్ తో ‘ఇండియన్‘ సిరీస్.. రజనీకాంత్ తో ‘శివాజీ, రోబో, 2.0‘ వంటి సినిమాలను తెరకెక్కించాడు శంకర్. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రేపు రాబోయే ‘ఇండియన్ 2‘ ఇంట్రోలో సినిమా విడుదల తేదీపైనా క్లారిటీ వచ్చే అవకాశముంది.

Related Posts