జీవిత రాజశేఖర్ పై నట్టికుమార్ కంప్లైంట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జీవితకథతో రెండు భాగాలుగా రాబోతున్న చిత్రం ‘వ్యూహం‘. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలోని ఫస్ట్ పార్ట్ ‘వ్యూహం‘ నవంబర్ 10న విడుదల తేదీ ఖరారు చేసుకుంది.

ఇటీవల ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ కోసం వెళ్లగా.. రీజనల్ ఆఫీసర్, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, హైదరాబాద్ వారు రిజెక్ట్ చేశారు. అలాగే సెన్సార్ వాళ్లు ‘వ్యూహం‘ సినిమాని రివైజింగ్ కమిటీకి (ఆర్.సి.) రిఫర్ చేశారు. గతంలో చాలా సినిమాల విషయంలో ఇది జరిగింది.

ప్రస్తుతం సెన్సార్ ఆర్.సి. మెంబర్ గా జీవిత రాజశేఖర్ ఉన్నారు. ఆమె వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినందున, జీవిత రాజశేఖర్ ని ‘వ్యూహం‘ సినిమా వరకు సెన్సార్ చేయకుండా తొలగించాలని.. సెన్సార్ బోర్డుకి కంప్లైంట్ లెటర్ ఇచ్చారు నిర్మాత నట్టికుమార్.

నట్టికుమార్ తన కంప్లైంట్ లెటర్ లో.. ‘వ్యూహం‘ సినిమా కంప్లీట్ గా పొలిటికల్ మూవీ అని.. వై.ఎస్.ఆర్. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పూర్తి అనుకూలంగా, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను వ్యంగంగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారన్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ను ఒక్కసారి చూస్తే ఈ విషయం చాలా సులువుగా అర్ధమవుతుందని తన లెటర్ లో తెలిపారు.

తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్, 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు గారిని, జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని.. ఇంకా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారిని, కాంగ్రెస్ పార్టీ లీడర్ సోనియా గాంధీ గారిని ఈ సినిమాలో వారి పోలికలు దగ్గరగా ఉన్న నటీనటులను ఎంపిక చేసుకుని మరీ, ఈ సినిమాలో వారి పాత్రలను వ్యంగంగా చూపించారని తన కంప్లైంట్ లెటర్ లో నట్టికుమార్ తెలిపారు.

అంతేకాదు ‘వ్యూహం‘ మూవీని తీసిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా వై.ఎస్.ఆర్. పార్టీ లీడర్ అని.. వై.ఎస్.ఆర్ ప్రభుత్వం ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ మెంబర్ గా కూడా నియమించిందని నట్టికుమార్ తెలిపారు.

Related Posts