కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్

అదృష్టానికి అడ్డదారి ఉండదు.. కష్టపడటం ఒక్కటే మార్గం అని నిరూపించడమే కాకుండా పట్టుదలతో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన కథానాయకులలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఒకడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న షారుక్ పుట్టినరోజు ఈరోజు (నవంబర్ 2).

బుల్లితెర నుంచి వెండితెరకు ప్రయాణం
బాలీవుడ్ లో ఎవరి అండా లేకుండా కేవలం తన టాలెంట్‌ తో స్టార్‌ గా ఎదిగిన నటుడు షారుక్‌ ఖాన్‌. మొదట టెలివిజన్‌ లో తన అదృష్టాన్ని పరీక్షించుకొన్న షారుక్‌.. తరువాత బాలీవుడ్‌ వైపు తన ప్రయాణం సాగించాడు. 1992లో ‘దీవానా’ సినిమాలో సెకండ్‌ హీరోగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. రిషీకపూర్‌, దివ్యభారతి ఇతర ముఖ్య పాత్రలు చేసిన ఈ మూవీ సక్సెస్‌ కావడంతో షారుక్‌ కు మంచి గుర్తింపు దక్కింది. తొలి సినిమాకే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ పొందాడు.

స్టార్ డమ్ తీసుకొచ్చిన ‘బాజీగర్’
‘దీవానా’ తర్వాత ‘చమత్కార్, రాజు బన్ గయా జెంటిల్ మేన్, కింగ్ అంకుల్’ వంటి చిత్రాలలో హీరోగా నటించాడు షారుక్. అయితే.. షారుక్‌ కెరీర్‌ ను మలుపు తిప్పిన చిత్రం ‘బాజీగర్’. అప్పటివరకు హీరోలు పుల్‌ లెంగ్త్‌ నెగిటివ్‌ రోల్స్‌ చేయడం చూడని ఇండియన్‌ ఆడియన్స్‌ కు.. ఈ చిత్రంలో ప్రతినాయిక పాత్ర సరికొత్త అనుభూతిని అందించింది. ‘బాజీగర్’ తర్వాత యశ్ చొప్రా డైరెక్షన్‌ లో చేసిన ‘డర్‌’ మూవీ షారుక్‌ ను మరో మెట్టుపైన నిలిపింది.

చరిత్ర సృష్టించిన ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’
నటుడిగా పరిచయమైన రెండేళ్లకే స్టార్ డమ్ తెచ్చుకున్న షారుక్ కి.. 1995వ సంవత్సరం మెమరబుల్ గా నిలిచింది. ఆ యేడాది ప్రథమార్థంలో సల్మాన్‌ ఖాన్‌ తో చేసిన మల్టీస్టారర్ ‘కరణ్‌ అర్జున్‌’ సూపర్‌ హిట్‌ అయింది. ద్వితియార్థంలో వచ్చిన ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా అయితే ఓ చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు. ఈ సినిమా షారుక్‌ కి యూత్‌ లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పరచింది. ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ తర్వాత షారుక్‌ వెనుదిరిగి చూసుకునే అవసరం రాలేదు.

కింగ్ ఖాన్ ఆఫ్ బాలీవుడ్
యాక్షన్‌ కంటే ఫ్యామిలీ రొమాంటిక్‌ ఎంటర్ టైనర్స్ షారుక్‌ కి మంచి ఫాలోయింగ్‌ తెచ్చిపెట్టాయి. ‘పర్ దేశ్, దిల్ తో పాగల్ హై, కుచ్‌ కుచ్‌ హోతాహై, మొహబత్తే, కభి ఖుషి కభి ఘమ్‌, దేవదాస్, కల్‌ హోనాహో, మే హూ నా, కభి అల్విద నాకెహనా, వీర్ జారా, రబ్ నే బనాది జోడి, మై నేమ్ ఈజ్ ఖాన్, జబ్ తక్ హై జాన్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్‌ వసూళ్లూ సాధించాయి. ఒకదాని వెంట ఒకటిగా వరుస బ్లాక్‌ బస్టర్స్‌ షారుక్‌ ను బాలీవుడ్‌ లో సూపర్‌ స్టార్‌ గా నిలిపాయి.

తన శైలికి భిన్నంగా
అమితాబ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘డాన్‌’ రీమేక్‌ లో నటించిన షారుక్‌ తన నటనలో బిగ్‌ బి ఛాయలు రాకుండా నటించి సక్సెస్‌ కొట్టాడు. ఇక.. ఉమెన్ హాకీ నేపధ్యంలో షారుక్ నటించిన ‘చక్ దే ఇండియా’ ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో హాకీ కోచ్ గా అద్భుతంగా నటించి.. ఉత్తమ నటుడుగా అవార్డులు అందుకున్నాడు. మొత్తంగా.. పలు చిత్రాలలోని అద్భుత నటనకు గానూ.. 14 ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు కింగ్ ఖాన్. ఇక తొలుత బుల్లితెరపైనే నట ప్రస్థానాన్ని ప్రారంభించిన షారుక్.. సిల్వర్ స్క్రీన్ పై బిజీగా ఉంటూనే స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి, క్యా ఆప్ పాంచ్వీ పాస్ సే తేజ్ హై, జోర్ కా జట్కా’ వంటి ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా వ్యవహరించాడు.

మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బాద్ షా
ఒకప్పుడు బాలీవుడ్ ను ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన షారుఖ్ ఖాన్ ని గత కొన్నేళ్ల పాటు ఫ్లాపులు వెంటాడాయి. మళ్లీ ఈ సంవత్సరం కింగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు.

ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘పఠాన్’, సెప్టెంబర్ లో వచ్చిన ‘జవాన్’ సినిమాలతో తాను మాత్రమే కాకుండా బాలీవుడ్ ని సైతం స్లంప్ నుంచి బయటకు తీసుకొచ్చాడు.

ఇదే ఏడాది డిసెంబర్ లో మరో క్రేజీ మూవీ ‘డంకి’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు షారుక్.

Related Posts