ఈసారి మహేష్ కోసం పవన్ కళ్యాణ్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ను తలచుకోగానే ఏఎన్నార్ గుర్తుకొస్తారు. ఆ తర్వాత కృష్ణ-శోభన్ బాబు, చిరంజీవి-బాలకృష్ణ.. ఇక ఈతరంలో అలాంటి జంట అగ్ర కథానాయకులను చెప్పమంటే పవన్ కళ్యాణ్-మహేష్ బాబు పేర్లు ముందుగా గుర్తుకొస్తాయి. రెండు దశాబ్దాలకు పైగా తెలుగులో కథానాయకులుగా కొనసాగుతున్న వీరిద్దరూ కలిసిన సందర్భాలు తక్కువే. అయితే.. వీరి మధ్య మంచి బాండింగ్ ఉందనేది ఇండస్ట్రీ వర్గాల మాట.

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ సినిమాకోసం మహేష్ బాబు ఇచ్చిన నేరేషన్ అదరహో అనిపించింది. సినిమా ఆద్యంతం పవన్ కల్యాణ్ పాత్ర గురించి మహేష్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు పవన్ కోసం మహేష్ వాయిస్ ఇస్తే.. ఇప్పుడు మహేష్ కోసం పవన్ తన గళాన్ని అందించబోతున్నాడట.

‘గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబు ఇంట్రోను పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ అట. ఇక.. అటు ‘జల్సా’ సినిమాకి.. ఇటు ‘గుంటూరు కారం’ సినిమాకి కామన్ పాయింట్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే పవర్ స్టార్ తో మూడు సినిమాలు చేసిన మాటల మాంత్రికుడు.. మహేష్ తో తన మూడో చిత్రంగా ‘గుంటూరు కారం’ని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా ‘గుంటూరు కారం’ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts