ఎస్సెన్స్ ఆఫ్ ‘తండేల్’.. మాస్ అవతార్ లో అదరగొట్టిన నాగచైతన్య

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్‘. ‘కార్తికేయ 2‘తో ఇప్పటికే పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రతిష్ఠాత్మక సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది. ఆద్యంతం మత్సకారుల ఇతివృత్తంతో రూపొందుతోన్న ఈ మూవీ ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఎస్సెన్స్ ఆఫ్ తండేల్ పేరుతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.

నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన హీరో.. అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్ కు చిక్కడం.. అక్కడ అతను ఎదుర్కొన్న బాధలు.. చివరకు వాటి నుంచి బయటపడ్డాడా? లేదా? అనేదే ఈ సినిమా కథాంశంగా ఈ ఎస్సెన్స్ ఆఫ్ తండేల్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. గ్లింప్స్ చివరిలో సత్య పాత్రలో సాయిపల్లవి ఎంట్రీ అదుర్స్ అనిపించేలా ఉంది. 2 నిమిషాల 11 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్.. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నాగచైతన్య మేకోవర్ కొత్తగా ఉంది. మాస్ అవతార్ లో అదరగొట్టాడు అక్కినేని హీరో. దేవిశ్రీప్రసాద్ సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ గా ఉన్నాయి.

పలు హిట్ కాంబినేషన్స్ లో ‘తండేల్’ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే చైతన్య కి ‘ప్రేమమ్’ వంటి హిట్ ఇచ్చి ఉన్నాడు డైరెక్టర్ చందూ మొండేటి. అలాగే.. గీతా ఆర్ట్స్ లో ‘100 పర్సెంట్ లవ్’ తర్వాత చైతూ నటిస్తున్న సినిమా ఇది. మరోవైపు హీరోయిన్ సాయిపల్లవితో నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ కూడా హిట్టే. మొత్తంగా.. ‘దూత’ సిరీస్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన చైతన్య.. ఇప్పుడు ‘తండేల్’తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related Posts